విజయ్‌ని డైరెక్ట్ చేయనున్న ‘కాక్కా ముట్టై’ రైటర్?


విజయ్‌ని డైరెక్ట్ చేయనున్న 'కాక్కా ముట్టై' రైటర్?

ఒకదానికొకటి సంబంధం లేని కథలతో సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్‌డం సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.

ధనుష్ నిర్మించగా జాతీయ అవార్డులతో పాటు పలు చిత్రోత్సవాల్లోనూ అవార్డులు సాధించిన తమిళ చిత్రం ‘కాక్కా ముట్టై’ సినిమా రచయిత ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో నటించేందుకు విజయ్ అంగీకరించాడని వినిపిస్తోంది.

ఆనంద్‌కు ఇది దర్శకుడిగా తొలి చిత్రం కానున్నది. అలాగే ఈ సినిమాలో మలయాళ తార, సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె మాళవికా మోహనన్ నాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమె ‘పేట’లోనూ నటించింది.

ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్‌గా కనిపిస్తాడనేది అంతర్గత వర్గాల సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

విజయ్ ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’, క్రాంతిమాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.