నారీ నారీ నడుమ విజయ్ సేతుపతి!


నారీ నారీ నడుమ విజయ్ సేతుపతి!
రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి, నివేదా పేతురాజ్

విజయ్ సేతుపతి కథానాయకుడిగా ప్రఖ్యాత విజయా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే తమిళ చిత్రం షూటింగ్ మార్చి 4న ప్రారంభం కానున్నది. ఇదివరకు శింబుతో ‘వాలు’, విక్రంతో ‘స్కెచ్’ సినిమాలు రూపొందించిన విజయ్ చందర్ ఈ సినిమాకి దర్శకుడు.

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన ఇద్దరు నాయికలు – రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. రాశి తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య తారల్లో ఒకరు కాగా, నివేదా పేరురాజ్ ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఈ సినిమాలో వినోదాన్ని పంచే బాధ్యతను సూరి తీసుకుంటున్నాడు.

నాజర్, మొట్టై రాజేంద్రన్, జాన్ విజయ్, శ్రీమాన్, మారిముత్తు కీలక పాత్రధారులు. విలన్‌గా బాలీవుడ్ నటుడు అశుతోష్ రాణా ఎంపికయ్యాడు. ఇప్పటికే డజను తెలుగు సినిమాల్లో విలన్‌గా మెప్పించిన రాణా ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జై సింహా’, ‘సాక్ష్యం’ సినిమాల్లో కనిపించాడు. తమిళ చిత్రాల్లోనూ ఇటీవల అవకాశాలు పొందుతున్నాడు.

ఈ సినిమా గురించి విజయా ప్రొడక్షన్స్ సంస్థ తన ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడిస్తూ “మార్చి 4 నుంచి సినిమా షూటింగ్ మొదలవుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం” అని పోస్ట్ చేసింది. తమిళంలో రూపొందించే ఈ సినిమాని తర్వాత తెలుగులోనూ అనువాదం చేసి, ఏక కాలంలో రెండు వెర్షన్లనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విజయ్ సేతుపతి ప్రస్తుతం తెలుగులో ‘సైరా.. నరసింహారెడ్డి’ చిత్రంలో రాజా పాండి పాత్ర చేస్తున్నాడు.