యాత్ర: నాయకుడి పరిచయం ఇలా ఉండాలి!


యాత్ర: నాయకుడి పరిచయం ఇలా ఉండాలి!

యాత్ర: నాయకుడి పరిచయం ఇలా ఉండాలి!

భారీ బడ్జెట్, బడా హీరోల సినిమాల్లో కానీ, క్రేజీ హీరోల సినిమాల్లో కానీ, మాస్ డైరెక్టర్ల సినిమాల్లో కానీ టైటిల్ క్రెడిట్స్ తర్వాత వచ్చే హీరో ఇంట్రడక్షన్ ఎపిసోడ్స్ ఎంత హంగు, ఆర్భాటాలతో ఉంటాయో మనకు తెలిసిందే. సినిమాలోని ప్రధాన పాత్ర పరిచయం అంటే దాని ఆత్మ ఏమిటో, దాని వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పడమే.

కానీ పాత్రౌచిత్యంతో సంబంధం లేకుండా మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించడమే లక్ష్యంగా, ఆ పాత్ర వ్యక్తిత్వంతో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులు విపరీతమైన ఆర్భాటంతో హీరో పరిచయ సన్నివేశాల్ని తీస్తుంటారు. హీరోలు కూడా అభిమానుల్ని అలరించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు కాబట్టి స్టైల్‌గా కాలర్ ఎగరేస్తూ ఆ సీన్ చేసేస్తాడు.

కొంతమంది దర్శకులు మాత్రమే పాత్రను ఆది నుంచి కడ దాకా దాని ఔచిత్యానికెక్కడా భగం కలగకుండా దాన్ని డిజైన్ చేస్తారు. సినిమా జయాపజయాల సంగతి ఇక్కడ మనం మాట్లాడుకోవట్లేదు. టైటిల్ క్రెడిట్స్ తర్వాత వచ్చే సన్నివేశాన్ని దర్శకుడు ఎలా కథలో అంతర్భాగంగా తీశాడు, ఆ సన్నివేశంలో ప్రధాన పాత్రను ఎలా పెజెంట్ చేశాడనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం.

ఆ ప్రకారం చూస్తే ఈ మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డి పాక్షిక జీవిత కథతో వచ్చిన ‘యాత్ర’ ఓపెనింగ్ సీన్‌ను ప్రస్తావించుకోవాలి. ఎలాంటి హంగులు లేకుండా, ఎంత సింపుల్‌గా ఆ సన్నివేశాల్ని దర్శకుడు మహి వి. రాఘవ్ తీశాడో! అదే సమయంలో ప్రధాన పాత్ర వైఎస్ వ్యక్తిత్వం ఏమిటనే దాన్ని కూడా ఆ సన్నివేశం ద్వారా ఆవిష్కరించాడు.

వైఎస్ ఇంటికొచ్చిన గౌరు చరితారెడ్డి

టైటిల్స్ పూర్తవగానే కెమెరా పులివెందులలోని నాలుగు రోడ్ల కూడలి మీదుగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటికి జూమ్ అవుతుంది. ఆయన ఇంటి ముందు ఆగిన నల్లటి స్కార్పియో వాహనంలోంచి గౌరు చరితారెడ్డి (అనసూయ) దిగుతుంది. అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోతూ, ఆమె ఇక్కడికెందుకొచ్చిందని చర్చించుకుంటూ ఉంటారు.

తన వంక అట్లాగే చూస్తున్న వాళ్లను ఓరకంట గమనిస్తూ గుమ్మ దగ్గరకు వెళ్లగానే, లోపలి నుంచి వచ్చిన విజయమ్మ అక్కడున్నవాళ్లను పలకరిస్తూ, చరితను చూస్తుంది. “రామ్మా..” అంటూ నవ్వుతూ పలకరించి, “ఏమ్మా.. చెప్పండి” అనడుగుతుంది.

“అన్నను కలవాలమ్మా” అని చెప్తుంది చరిత.

వైఎస్ అనుచరుడైన వీరప్ప (దిల్ రమేశ్)ను పిలిచి అన్న దగ్గరకు తోలుకుపొమ్మని చెబ్తుంది విజయమ్మ. చరితను వీరప్ప లోపలికి తీసుకుపోయి కేవీపీ రామచంద్రరావు (రావు రమేశ్)కు అప్పజెప్తాడు. కేవీపీ ఆమెను వైఎస్ దగ్గరకు తీసుకుపోయి, ఆమె ఎవరైందీ, వైఎస్ చెవిలో చెప్తాడు.

యాత్ర: నాయకుడి పరిచయం ఇలా ఉండాలి!

చరిత నమస్కారం చేస్తే, ప్రతి నమస్కారం చేసిన వైఎస్, ఆమెను కూర్చోమంటాడు. “మా నాయనని చంపేసినారన్నా. నా మొగుడ్ని జైల్లో పెట్టినారు. ఊళ్లోకొస్తేనే చంపేస్తామంటండారు. భయమేస్తోందన్నా. హై కమాండోళ్లు బై ఎలక్షన్ల మా సీటు మా నాయన్ని చంపినోళ్లకు ఇస్తుండారన్నా” అంటుంది చరిత, కుర్చీలో కూర్చున్నాక.

వైఎస్ (అప్పుడే ఆయన ముఖం చూపిస్తారు) “నేను చస్తే నువ్వు భయపడాలమ్మా. నేను బతికుండగా నీకే భయం. నామినేషన్ పేపర్స్ రెడీ చేసుకోమ్మా. ఆ సీటు మీదే. ఎవడాపుతాడో నేను చూస్తాను” అని అభయమిస్తాడు.

చరిత కృతజ్ఞతగా నమస్కారం పెడ్తుంది. సహాయకుడు ఓబులేశును పిలిచి చరితమ్మను ఇంట్లో దింపేసి రమ్మని చెప్తాడు వైఎస్. ఆమె వెళ్లిపోతుంది.

యాత్ర: నాయకుడి పరిచయం ఇలా ఉండాలి!
ఆడబిడ్డతో రాజకీయమేందిరా!

కేవీపీ “ఒక సంవత్సరంలో ఎలక్షన్లున్నాయ్. ఈ టైంలో మనమెందుకు ఇన్వాల్వ్ అవడం” అంటే, వీరప్ప “ఆళ్ల నాయన బతికుండగా ఎప్పుడూ మన నాశనాన్నే కోరుకున్నాడన్నా. అట్టాంటోడి కూతుర్కి మనం సాయం చేసేదేందన్నా” అంటాడు అసంతృప్తిగా.

వైఎస్ “మన గడప తొక్కి సాయమడిగిన ఆడబిడ్డతో రాజకీయమేందిరా” అంటాడు.

ఆ మాటతో వైఎస్ వ్యక్తిత్వం శిఖర సమానంగా మన ముందు ఆవిష్కృతమవుతుంది. ప్రధాన పాత్రను ఇంత చక్కగా పరిచయం చేసిన సినిమా ఇటీవలి కాలంలో ఇదే.

– సజ్జా వరుణ్

యాత్ర: నాయకుడి పరిచయం ఇలా ఉండాలి! | actioncutok.com

You may also like: