ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: లోకేశ్‌కు అగ్ని పరీక్ష!


ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: లోకేశ్‌కు అగ్ని పరీక్ష!
Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: లోకేశ్‌కు అగ్ని పరీక్ష!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం వార్తల్లో నిలుస్తోంది. ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోకేశ్ పొలిటికల్ కెరీర్‌కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్ష అని చెప్పాలి.

మంగళగిరి నియోజక వర్గం నుంచి ప్రస్తుతం వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై విజయం సాధించారు. అయితే రాష్ట్రంలోనే అత్యల్పంగా ఆయన సాధించిన మెజారిటీ కేవలం 12 ఓట్లు.

ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికే సీటు కేటాయించగా, తనయుడు లోకేశ్‌ను బరిలో దింపారు చంద్రబాబు. తన అభ్యర్థిత్వం ఖరారైన రోజు నుంచే మంగళగిరి నియోజక వర్గంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకొనే యత్నం చేస్తున్నారు లోకేశ్.

మరోవైపు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్ ఎలాగైనా లోకేశ్‌ను ఓడించాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. ఇప్పటికైతే పరిస్థితులు లోకేశ్‌ను అనుకూలంగా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి తనయుడే తమ ప్రాంత అభ్యర్థి కావడంతో అక్కడి ఓటర్లలో భావోద్వేగపూరిత వాతావరణం కనిపిస్తోందనీ, ఇది లోకేశ్‌కు కలిసి రానున్నదనీ వాళ్లు అంటున్నారు.

అందరికంటే చేనేత ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎస్సీలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్లు ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మాదిగ, మాల సామజిక వర్గాల మధ్య ఓట్లు చీలే అవకాశాలున్నాయంటున్నారు. మాదిగలు టీడీపీకి, మాలలు వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తే అప్పుడు చేనేతల ఓట్లు కీలకం కానున్నాయి.

ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు కొత్తగా ఇస్తున్న హామీలు చేనేతల ఓట్లు తమకే పడేలా చేస్తాయని లోకేశ్ ఆశిస్తున్నారు. చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టడానికి తగిన సామర్థ్యం తనలో ఉన్నదని నిరూపించుకోవాలంటే ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో నెగ్గాల్సిన అవసరం ఆయనకు ఉంది. మరి ఓటర్లు ఏ రకమైన తీర్పునిస్తారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: లోకేశ్‌కు అగ్ని పరీక్ష! | actioncutok.com

You may also like: