ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: నారాయణ నెగ్గుతారా?


ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: నారాయణ నెగ్గుతారా?
Narayana and Anil Kumar Yadav

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: నారాయణ నెగ్గుతారా?

రాష్ట్రంలో ఆసక్తి రేకెత్తిస్తోన్న వాటిలో నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ పోరు ఒకటి. ఇక్కడ రాష్ట్ర మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పి. నారాయణ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆయనకు ప్రధాన పోటీదారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్.

కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు రంగంలో ఉన్నప్పటికీ వాళ్లెవరూ డిపాజిట్ దక్కించుకొనే అవకాశాలు లేవని పరిశీలకులు నమ్ముతున్నారు. అర్థబలం విషయంలో నారాయణకు అనిల్‌కుమార్ యాదవ్ సరితూగే వ్యక్తి కాదు. పైగా ఎమ్మెల్యే అనిల్‌కుమార్ అయినప్పటికీ నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు చేసింది నారాయణ. మంత్రి హోదాలో తన ప్రాంతానికి పలు అభివృద్ధి పనులు చేసి పెట్టారు.

ఇవే తనను గెలిపిస్తాయని నారాయణ ఆశలు పెట్టుకొన్నారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కూడా తనను విజేతగా నిలుపుతుందని ఆయన భావిస్తున్నారు. ఇక యువకుడైన అనిల్‌కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో జగన్ పేరును నమ్ముకొని దూసుకు పోతున్నారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడాన నెల్లూరుకు చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయకపోయినా, ఈసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి నెల్లూరు నగరానికి అసలైన అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని ఆయన చెప్తున్నారు.

నెల్లూరులో ప్రతిసారీ ప్రధాన రాజకీయ పక్షాల్లో కనీసం ఒకరైనా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి నిలవడం ఆనవాయితీ కాగా, ఈసారి బలిజ సామాజిక వర్గానికి చెందిన నారాయణ, యాదవ సామాజిక వర్గానికి చెందిన అనిల్‌కుమార్ ప్రధాన ప్రత్యర్థులు కావడం గమనార్హం. జనసేన తరపున కేతంరెడ్డి వినోద్‌రెడ్డి బరిలో ఉన్నా ఆయన మూడు లేదా నాలుగో స్థానికి పరిమితమవుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత ఎన్నికల్లో 19 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించిన అనిల్‌కుమార్ ఈసారి నెల్లూరులో వైసీపీ ప్రభంజనం వీస్తున్నందున ఈసారి తన మెజారిటీ మరింత పెరుగుతుందని నమ్ముతున్నారు. మరి నారాయణ ఆయనకు అడ్డుకట్ట వేసి, తన తొలి ప్రత్యక్ష పోరులో విజయం సాధిస్తారా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: నారాయణ నెగ్గుతారా? | actioncutok.com

You may also like: