‘చిత్రలహరి’ ట్రైలర్ చెబుతున్న 6 విషయాలు

‘చిత్రలహరి’ ట్రైలర్ చెబుతున్న 6 విషయాలు
సాయిధరం తేజ్ హీరోగా నటించిన ‘చిత్రలహరి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. చిత్ర, లహరి అనే ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న విజయ్ అనే ఒక పరాజితుడి కథ ఈ సినిమా. చిత్రగా నివేదా పేతురాజ్, లహరిగా కల్యాణి ప్రియదర్శన్ నటించారు. ‘నేను.. శైలజ’ ఫేం కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
1 నిమిషం 58 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ విజయ్ పాత్ర తీరు తెన్నులతో పాటు జీవితంలో అతడికి అప్పటివరకూ విజయమే దక్కలేదనే విషయాన్నీ పట్టిచ్చింది. విజయం కోసం విజయ్ ఎంతగా తహతహలాడిపోతున్నాడో గమనిస్తే అతడి పాత్రపై మనకు సానుభూతి కలగక మానదు.
ట్రైలర్ ఆరంభంలోనే “నా పేరు విజయ్.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని నా వెయిటింగ్” అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఆ పరిచయంలోనే మనకు అతడొక పరాజితుడిగా అర్థమవుతుంది.
“నా జీవితంలో ఏదైనా పాజిటివ్ విషయం జరిగిందంటే.. తనొక్కటే.. క్లాస్మేట్” అంటాడు. ఆ వెంటనే లహరి (కల్యాణి)ని చూపిస్తారు. అంటే లహరి అతని క్లాస్మేట్ అన్నమాట. ఆమెను అతడు బాగా ఇష్టపడ్డాడని మనకు అవగతమవుతుంది. ఆమె అతడి బాధల్ని షేర్ చేసుకుంటుంది.
కానీ ఇప్పుడతను ఒక సమస్యలో చిక్కుకున్నాడు. ఆ సమస్య చిత్ర (నివేదా పేతురాజ్). విజయ్ ఒక ఇంజినీర్ అనీ, యాక్సిడెంట్‌ను అలర్ట్ చేసే ఒక డివైస్‌ను అతను తయారు చేశాడనీ, దాని గురించి చిత్రకు విజయ్ వివరించాడనీ ట్రైలర్ ద్వారా తెలియజేస్తోంది.
మరి సమస్య ఏమిటి? “ఐ నెవర్ వాంట్ టు సీ యువర్ ఫేస్ అగైన్” అని చిత్ర చెప్పిందంటే, అతడిపై ఆమె పెట్టుకున్న నమ్మకం వమ్మయినా అయ్యుండాలి, లేదా అతడేదైనా తప్పు చేసైనా అయ్యుండాలి.
చిత్ర కంటే ముందు లహరి మెట్రో ట్రైన్లో విజయ్‌తో “నువ్వు నాకు కరెక్ట్ కాదని అనిపిస్తోంది” అని చెప్పింది. అంటే ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆమె ఆ మాట అన్నదంటే తమ ఇద్దరి మధ్యా చాలా వ్యత్యాసం ఉన్నదనే అభిప్రాయం లహరికి వచ్చుండాలి. లేదంటే, విజయ్ ప్రవర్తన ఆమెకు మింగుడుపడలేని విధంగా ఉండుండాలి.

దిగులుగా ఉన్న విజయ్‌కి సక్సెస్ రావడానికి టైం పడుతుందని తండ్రి (పోసాని) బోధిస్తాడు.
ఎవరో విజయ్ను ఉద్దేశించి “ఓడిపోవడమనేది మనోడికి వెన్నతో పెట్టిన విద్య” అంటారు నేపథ్యంలో. జయప్రకాశ్ “యు నీడ్ కేరెక్టర్.. రెస్పాన్సిబిలిటీ” అని క్లాస్ పీకుతాడు. ఆ మాటల్ని బట్టి కేరెక్టర్ లేని యువకుడిగా, బాధ్యతా రహితుడిగా విజయ్ ముద్ర పడతాడని ఊహించవచ్చు.
లహరితో “ఒకే దిక్కున ఉదయించే సూర్యుడు నాలుగు దిక్కులా ఉదయించినా ఇంత.. ఇంత వెలుతురు కూడా రాని జీవితం నాది. ఎందుకంటే చీకటికి చిరునామా నేను” అంటాడు తీవ్ర నిరాశలో కూరుకుపోయిన విజయ్. జీవితంలో తాను గెలవలేననే ఫ్రస్ట్రేషన్ అతడి మాటల్లో వ్యక్తమవుతోంది. విజయం కోసం అతడు చేసే పనులేవీ ఫలించడం లేదనే వేదన, ఆక్రోశం అతడి మాటల్లో వ్యక్తమవుతున్నాయి.
బార్లో కుర్రాడు “ఏం కావాలన్నా?” అనడిగితే “ఏం వద్దు పోరా” అంటాడు విజయ్. “ఏదో ఒకటి చెప్పన్నా” అని ఆ కుర్రాడంటే, “ఓ ప్లేట్ సక్సెస్ కావాలి” అంటాడు విజయ్. ఆ మాటల్ని బట్టి విజయ్ కేరెక్టర్ ఏమిటి, అతడి మానసిక స్థితి చివరకు ఎలా తయారయ్యిందీ అర్థమవుతుంది.
ట్రైలర్ ప్రకారం ఇద్దరు మనుషులు అతడికి అండగా నిలుస్తారని ఊహించవచ్చు. ఒకరు తండ్రి అయితే, మరొకరు ఫ్రెండ్ (సునీల్). “రిజెక్టెడ్ పీస్” అని విజయ్‌ని బ్రహ్మాజీ అనడాన్ని బట్టి అతడు విజయ్‌కు ప్రత్యర్థిగా కనిపిస్తోంది.
వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న సాయిధరం ఇప్పుడు నిజంగానే ఒక్క విజయం కోసం తపిస్తున్నాడు. కెరీర్ పరంగా అతడి ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టేలా ‘చిత్రలహరి’లోని కేరెక్టర్ ఉండటం కాకతాళీయమేనా!

ఓవరాల్‌గా ఒక్క విజయం కోసం విజయ్ తపిస్తున్నాడనీ, ఆరాటపడుతున్నాడనీ, ఆక్రోశిస్తున్నాడనీ మనకు ట్రైలర్ చెబుతోంది. చివరకు విజయ్ జీవితంలో విజయం సాధించాడా? చిత్ర, లహరిలలో ఎవరు అతడికి దక్కారు? అనేవి ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలు.
ఆ ప్రశ్నలకు జవాబు లభించాలంటే ఏప్రిల్ 12 వరకు ఆగాల్సిందే.
– సజ్జా వరుణ్
‘చిత్రలహరి’ ట్రైలర్ చెబుతున్న 6 విషయాలు | actioncutok.com
You may also like: