సమంతతో వెంటనే కనెక్టయిపోతారు: శివ నిర్వాణ


సమంతతో వెంటనే కనెక్టయిపోతారు: శివ నిర్వాణ

సమంతతో వెంటనే కనెక్టయిపోతారు: శివ నిర్వాణ

“శ్రావణి పాత్ర చెయ్యడానికి ప్రతిభావంతురాలైన నటి కావాలి. మధ్య తరగతి యువతిగా కనిపించాలి. నాకు తెలుసు, ప్రేక్షకులు శ్రావణి పాత్రలోని సమంతతో వెంటనే కనెక్టయిపోతారు” అని చెప్పారు దర్శకుడు శివ నిర్వాణ. ‘నిన్ను కోరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన రూపొందించిన రెండో సినిమా ‘మజిలీ’.

వివాహానంతరం నాగచైతన్య, సమంత తొలిసారి కలిసి నటించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ మరో నాయిక. షైన్ స్క్రీన్స్ బేనర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఉగాది పండుగకు ఒక రోజు ముందు ఏప్రిల్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ నిర్వాణ చెప్పిన ‘మజిలీ’ కబుర్లు ఆయన మాటల్లోనే…

‘నిన్ను కోరి’ తర్వాత వెంటనే ఇంకో రొమాంటిక్ డ్రామా చెయ్యాలని నేననుకోలేదు. అందుకని రెండు యాక్షన్ థ్రిల్లర్ కథలు రాశాను. కానీ వాటిని చెయ్యడానికి హీరోల డేట్లు, యాక్టర్ల కాంబినేషన్లు కుదరలేదు. వెయిట్ చేసి చూద్దామనుకున్నా.

అప్పుడు చైతన్య నుంచి కాల్ వచ్చింది. తన కోసం ఒక స్క్రిప్ట్ తయారు చెయ్యమని చెప్పాడు. నిజానికి అప్పుడు చైతన్య కోసం రాయడానికి నేను ప్రిపేరయి లేను. ఒక వారం గడిచాక, ‘మజిలీ’ లైన్ స్ఫురించింది. మూడు రోజుల్లో ఒక పోర్షన్ రాసుకొని అతనికి వినిపించాను. చైతన్యకు నచ్చింది. మరో రెండు రోజులు టైం తీసుకొని మొత్తం స్క్రిప్ట్ పూర్తిచేశాను.

సాధారణంగా స్క్రిప్ట్ రాశాకే దానికి సూటయ్యే యాక్టర్ల గురించి ఆలోచించాలనుకొనే మనస్తత్వం నాది. కానీ ఇప్పుడు నా కథలోని పాత్రలకు చైతన్య, సమంత సరిగ్గా సరిపోతారనిపించి, వాళ్లతో ఈ సినిమా చేశాను.

సమంతతో వెంటనే కనెక్టయిపోతారు: శివ నిర్వాణ
ఇద్దరు దంపతుల మధ్య సంఘర్షణ

‘నిన్ను కోరి’ కథకూ, ‘మజిలీ’ కథకూ ఎలాంటి పోలికలూ ఉండవు. ‘నిన్ను కోరి’ అనేది ఒక ఆహ్లాదకరమైన, సిటీ నేపథ్యంలో నడిచే లవ్ స్టోరీ. నిజ జీవితంలో ఒక యువకుడు తన మాజీ ప్రేయసి, ఆమె భర్తతో కలిసి ఉండటమనేది జరిగే పని కాదు. కానీ స్క్రీన్‌ప్లే కారణంగా తెరపై అది కన్విన్సింగ్‌గా అనిపించింది.

‘మజిలీ’ విషయానికి వస్తే, ఇది వాస్తవికతకు దగ్గరగా ఉండే కథ. చైతన్య రెండు దశల కేరెక్టర్ చేశాడు. ఒకటి ఇరవై ఏళ్ల కుర్రాడిగా అయితే, ఇంకొకటి ముప్పై ఏళ్ల వయసులో ఉండే యువకుడిగా. వైజాగ్‌లోని జ్ఞానపురం అనే చిన్న కాలనీలో జరిగే కథగ్ ‘మజిలీ’. ఇద్దరు యువ దంపతులు మధ్య తలెత్తే ఘర్షణ ఈ సినిమా.

ప్రతి శుక్రవారం తెరపై చాలా ప్రేమకథలు కనిపిస్తుంటాయి. కానీ ‘మజిలీ’ వాటిలో ప్రత్యేకమైన ప్రేమకథ. ఇదొక మిడిల్ క్లాస్ కాలనీ నేపథ్యంలో నడిచే పెళ్లయిన దంపతుల మధ్య ప్రేమకథ. హీరో హీరోయిన్ల పాత్రలు మితిమీరిన గ్లామర్‌తో కనిపించవు.

అలాంటి పేర్లు పెట్టను

ప్రత్యేకించి ప్రేమకథలకు టైటిల్ నిర్ణయించే విషయంలో నేను పర్టిక్యులర్‌గా ఉంటాను. ‘నీ ప్రేమ నా తల్లి’ లాంటి పేర్లు నా సినిమాలకి పెట్టను. అలాంటి పేర్లు చాలా మామూలుగా అనిపిస్తాయి. టైటిల్‌లోని సౌండ్‌ని నేనెప్పుడూ గౌరవిస్తాను. మూడు నాలుగక్షరాల టైటిల్‌ని ఇష్టపడతాను. ‘నిన్ను కోరి’ చూసుకున్నా, ఆ పేరు ముగిసినట్లుండదు. నిగూఢత, నిష్కర్ష.. రెండూ టైటిల్‌లో ధ్వనించాలి.

ప్రయాణంలో ఒక చోట వేసే మకామే ‘మజిలీ’. మన జీవితాల్లో 27, 28 సంవత్సరాలా దాకా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని, ఒకరితో పెళ్లి అనే బంధంలోకి అడుగుపెడతాం. పెళ్లి అనేది మన జీవితాలకు మరింత అర్థాన్నిచ్చే మజిలీ. ఆ మజిలీ నుంచే ఇద్దరి జీవితాలు మొదలవుతాయి కూడా.

సమంతతో వెంటనే కనెక్టయిపోతారు: శివ నిర్వాణ
వాళ్లవి సమతూకంతో ఉండే పాత్రలు

చైతన్య దర్శకుడి నిర్ణయాలకు విలువనిచ్చే నటుడు. అతను చేసిన పూర్ణ పాత్రను రాస్తున్నప్పుడు భావోద్వేగాల్ని ఓవర్‌గా కాకుండా అండర్‌ప్లే చేసే నటుడు కావాలనుకున్నాను. పూర్ణ పెద్దగా అరుస్తూ డైలాగ్స్ చెప్పే కేరెక్టర్ కాదు. అలాగే తన ఫీలింగ్స్‌ని అతను ఎక్కువగా ఎదుటివాళ్లతో పంచుకోడు. మాటలతో కాకుండా తన చేష్టల ద్వారానే ఎమోషన్స్‌ని తెలియజేసే పాత్ర. తన బాడీ లాంగ్వేజ్‌తో పూర్ణ పాత్రకు అతికినట్లు సరిపోయాడు చైతన్య.

పూర్ణ, శ్రావణి పాత్రలు సమతూకంతో ఉంటాయి. పూర్ణ పాత్రతో పోలిస్తే శ్రావణి పాత్రకూ సమాన ప్రాముఖ్యం ఉంటుందని చెప్పగలను.

రెండు హృదయాల చుట్టూ..

రొమాంటిక్ సినిమాని డైరెక్ట్ చెయ్యాలనుకొంటే, రెండు పాత్రల మధ్య లవ్ స్టోరీ నుంచి పక్కకు మళ్లకుండా చూసుకోవడం కీలకం. ప్రపంచంలో జరిగిన ఏ గొప్ప ప్రేమకథనైనా చూడండి, సినిమాలోని అన్ని రకాల సంఘర్షణలు, అన్ని పాత్రలు రెండు హృదయాల చుట్టూనే తిరుగుతుంటాయి. వాటి మధ్యలో కావాలని ఒక ఫైట్, మూడు నాలుగు పాటలు, కొన్ని కామెడీ ట్రాకులు జోడిస్తే స్క్రిప్ట్ పాడైపోతుంది.

ఏ ప్రేమకథా చిత్రమైనా విజయం సాధించాలంటే, దాని రచన వీలైనంత సింపుల్‌గా, సూటిగా ఉండాలి. భావోద్వేగాల్ని అంతర్లీనంగా ఉపయోగిస్తే, ఒక ఇంటెన్స్ మూవీ తయారవుతుంది.

సమంతతో వెంటనే కనెక్టయిపోతారు: శివ నిర్వాణ
Shiva Nirvana
దర్శకుడికి క్లారిటీ ముఖ్యం

సృజనాత్మక స్వేచ్ఛ అనేది దర్శకుడి అవగాహనా శక్తిపై ఆధారపడి ఉంటుంది. తన స్క్రిప్టుపై గట్టి నమ్మకం ఉన్న దర్శకుడు, తన కథ, అందులోని పాత్రలతో ఏ నిర్మాతనైనా మెప్పించగలుగుతాడు. కథపై, పాత్రలపై దర్శకుడికి క్లారిటీ ఉంటే, అతడి నిర్ణయాల్ని ఎదుటివాళ్లు తప్పకుండా గౌరవిస్తారు.

ఎప్పుడైతే తన స్క్రిప్టుపై దర్శకుడు క్లారిటీ లేకుండా కనిపిస్తాడో, ముఖంగా కొత్త దర్శకుల విషయంలో, అతని పనిలో ఎదుటివాళ్లు జోక్యం చేసుకుంటారు. ఇదంతా దర్శకుడి అవగాహన, కథపై అతడికున్న పట్టు మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే దర్శకుడికే తన కథపై పట్టు లేకపోతే, ఏ నిర్మాత నమ్మి అతనిపై కోట్లు వెచ్చిస్తాడు? కథ కన్విన్సింగ్‌గా ఉండి, అందులో హీరో ఇమేజ్ ఇమిడిపోతే కొత్త తరహా సినిమాల్ని చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.

– సజ్జా వరుణ్

సమంతతో వెంటనే కనెక్టయిపోతారు: శివ నిర్వాణ | actioncutok.com

3 thoughts on “సమంతతో వెంటనే కనెక్టయిపోతారు: శివ నిర్వాణ

Comments are closed.