తాతనవడానికి కూడా నాకు ప్రాబ్లెం లేదు!


తాతనవడానికి కూడా నాకు ప్రాబ్లెం లేదు!

తాతనవడానికి కూడా నాకు ప్రాబ్లెం లేదు!

“స్క్రీన్‌పై తండ్రిగా నటించడానికి ఎలాంటి ఇబ్బందీ పడలేదు. ఎందుకంటే ఆఫ్‌స్క్రీన్ కూడా నేను తండ్రినే కదా. నిజానికి ప్రాస్థటిక్స్, మేకప్.. అన్నీ సరిగా ఉంటే తాతనవడానికి కూడా నాకు ప్రాబ్లెం లేదు. యాక్టర్స్ అంటేనే అది కదా” అన్నారు నాని.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘జెర్సీ’లో ఆయన కథానాయకుడు అర్జున్ పాత్ర చేశారు. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో కన్నడ తార శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ‘జెర్సీ’ విడుదల సందర్భంగా ఆ సినిమాతో పాటు ఇతర విషయాల గురించీ నాని మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

ఇది రమణ్ లాంబా బయోపిక్ కాదు. కచ్చితంగా ఇది కల్పిత కథ. సోషల్ మీడియాలో ఎవరో రాస్తే, అది కాపీ పేస్ట్ అవుతూ నా దాకా కూడా చేరింది. వికీపీడియాలోని అప్‌డేట్ కూడా సినిమా రిలీజయ్యాక మారిపోతుందనుకుంటున్నా.

తాతనవడానికి కూడా నాకు ప్రాబ్లెం లేదు!
‘జెర్సీ’కి బలమైన కారణం

జెర్సీ అనేది క్రికెటర్ కానీ, మరో క్రీడాకారుడు కానీ వేసుకొనే దుస్తులు. ఇది క్రికెట్ నేపథ్య చిత్రం కాబట్టి జెర్సీ అని పెట్టలేదు. ఆ టైటిల్ పెట్టడానికి సినిమాలో చాలా బలమైన కారణం ఉంది.

నేను చిన్నప్పుడు గల్లీ క్రికెట్ ఆడాను. స్కూల్ టీంలో ఉండేవాడ్ని కానీ దాదాపు ఎక్స్‌ట్రా ప్లేయర్‌ని. ఎవరికైనా దెబ్బలు తగిలితే వాళ్ల ప్లేస్‌లో ఆడటమో, అందరూ అయిపోయాక ఆడటమో.. అలాంటి బ్యాచ్. ఎప్పుడూ బ్యాట్స్‌మన్‌నే.

‘జెర్సీ’ చేస్తుంటే అసలు క్రికెట్ అంటే ఏమిటో అర్థమైంది. అదివరకు బ్యాట్‌తో బాల్‌ను కొట్టడమే క్రికెట్ అనుకొనేవాడ్ని. క్రికెట్ నాలెడ్జి, దాని బాడీ లాంగ్వేజ్ తెలిసింది. అంతకు ముందు టీవీలో క్రికెట్ వస్తుంటే చానల్ మార్చేసేవాడ్ని. ఇప్పుడు చూస్తూ కూర్చుంటున్నా.

హైదరాబాద్ సిటీలో బెస్ట్ క్రికెట్ అకాడమీల్లో ఒకటైన డేనియల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాను. షూటింగ్ సమయంలో కూడా డేనియల్ స్వయంగా వచ్చి నా ఆటను పర్యవేక్షించారు.

గొప్ప సినిమా చేశాననే ఫీలింగ్

తండ్రీ కొడుకుల అనుబంధమే ఈ సినిమా. ఈ సినిమాతో నేను ఇంత ఎమోషనల్‌గా కనెక్టవడానికీ, ప్రేక్షకులంతా ఈ సినిమాతో కనెక్టవుతారని చెప్పడానికి కారణం ఆ అనుబంధమే.

నేను ఈ సినిమా గురించి ఇంత ఎమోషనల్‌గా ఫీలవడానికి కారణం.. ఫలితంపై నమ్మకంతో కాదు.. ఈ సినిమా చెయ్యడం వల్ల లభించిన అమితానందం. దాన్నెలా చెప్పాలో కూడా నాకు తెలీడం లేదు. నేను చాలా స్పెషల్ జోన్‌లో ఉన్నా. ఈ సినిమా చేసిన సంతృప్తి ఇలాగే నిలిచి పోవాలని ఉంది. రేపటిలోకి వెళ్లాలని లేదు.

ఒక గొప్ప సినిమా చేశామన్న ఫీలింగ్ ఉంటుంది కదా.. ఇదివరకు ఇలాంటి ఫీలింగ్ నాకెప్పుడూ కలగలేదు. స్క్రిప్ట్ వింటున్నప్పుడే పులకరింతలు వచ్చేశాయి. నేనే కాదు, టీమంతా ఒక గొప్ప పని చేశామన్న ఫీలింగ్‌లో ఉన్నాం.

తాతనవడానికి కూడా నాకు ప్రాబ్లెం లేదు!
హ్యాపీ ఎండింగ్

ఇది వంద శాతం హ్యాపీ ఎండింగ్. సినిమా అయ్యాక అందరూ నవ్వుకుంటూ ఒక ఉద్వేగంతో బయటకు వస్తారు.

ఏ తండ్రైనా తన కొడుకు దృష్టిలో హీరో కావాలనుకుంటాడు. ఒక ఎగ్జాంపుల్ కావాలనుకుంటాడు. ఈ సినిమాలో అర్జున్ కూడా అంతే. అందుకే ‘జెర్సీ’ ప్రతి తండ్రికీ, ప్రతి కొడుక్కీ, ప్రతి భర్తకీ, ప్రతి భార్యకీ, అందరికీ కనెక్టయ్యే సినిమా.

కట్టప్పను మించినవాళ్లు సత్యరాజ్

సత్యరాజ్ గారితో ఈ సినిమా చెయ్యడం నాకు పెద్ద లెర్నింగ్. ఆయన సినిమా అంతా ఉంటారు. అయితే చాలా సీన్లలో ఆయనది ఒక్క డైలాగే. దాని కోసం కోసం చెన్నై నుంచి వచ్చేసి వెళ్లిపోవాలి. ఇలాంటిది ఆయనకు సౌకర్యంగా ఉంటుందో, లేదో అనుకున్నా.

ఒకసారి మదురైలో తమిళ సినిమా షూటింగ్‌లో ఉండి, కారులో చెన్నై వచ్చి, అక్కడ్నుంచి ఫ్లైట్‌లో మధ్యాహ్నానికి షూటింగ్ జరుగుతున్న ఎల్బీ స్టేడియంకు వచ్చారు. మళ్లీ రాత్రి షూటింగ్‌కి ఆయన మదురై వెళ్లిపోవాలి.

కారవాన్ ఎక్కి రెడీ అయ్యి, గంటసేపు వెయిట్ చేసిన తర్వాత, ఈరోజు షూటింగ్ లేదు, వెళ్లిపోవచ్చని చెప్పారు. ఆయన ఒక్క మాటా అనకుండా “అవునా.. నో ప్రాబ్లెం” అన్నారు సౌమ్యంగా. నేను కారవాన్‌లోకి వెళ్లి “సారీ సర్” అని చెబ్తుంటే, “అయ్యో.. ఏం ప్రాబ్లెం లేదండి.. నేను వెళ్తాను” అని వెళ్లారు.

ఎవరికైనా అంత దూరం నుంచి వచ్చాక, ఎంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. విధేయతకి ‘బాహుబలి’లో కట్టప్ప ఉదాహరణ అయితే, ఆయనకంటే పెద్ద ఉదాహరణ సత్యరాజ్ గారు.

తాతనవడానికి కూడా నాకు ప్రాబ్లెం లేదు!
ఫెయిల్యూర్ గురించి ఆలోచించను

ఐ నెవ్వర్ కేర్డ్ అబౌట్ ఫెయిల్యూర్. ఎప్పుడేది నచ్చితే అది చేసుకుంటూ వెళ్లిపోయా. ‘జెండాపై కపిరాజు’, ‘పైసా’, ‘ఆహా కల్యాణం’ సినిమాలు చేసినప్పుడు రెండేళ్లు ఒక్క సినిమా విడుదలవలేదు. అలాంటి స్థితిలో హిమాలయాలకు వెళ్లే ‘ఎవడే సుబ్రమణ్యం’ లాంటి సినిమా చేస్తాడా?

అది చదివి ఫీలయ్యా

సినిమాల్లోకి రాకముందు నేను పెరిగిన వాతావరణంలో ఎవరైనా నన్ను ఏదైనా విమర్శగా అంటే ఒకట్రెండు నెలలు అది నన్ను బాగా బాధపెట్టేది. ఇండస్ట్రీలో ఆ తరహా మనిషి బతకలేడు. ఇక్కడకు వచ్చాక ఒకసారి “నానికి హెడ్ స్ట్రాంగ్” అని రాసిన ఆర్టికల్ చదివి చాలా ఫీలైపోయా.

ఎందుకు రాసుంటారని చాలా ఆలోచించా. ఇప్పుడు అలవాటైపోయింది. అది రాయడం వాళ్ల ధర్మం, దాన్ని ఇగ్నోర్ చెయ్యడం మన ధర్మం అనుకుంటాను.

భవిష్యత్తు వెబ్ సిరీస్‌దే

భవిష్యత్తులో వెబ్ సిరీస్, డిజిటల్ మనం ఊహించనంత ఎత్తుకి వెళ్లబోతున్నాయి. సినిమా, వెబ్ సిరీస్ ఎలా కలుస్తాయనే దానిపై ఇంకా అవగాహన రాలేదు. ఇవాళ నిర్మాణ సంస్థలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాయి. నేను కూడా రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్ నిర్మించవచ్చు. ఎందుకంటే వెబ్ సిరీస్‌దే భవిష్యత్తంతా.

– బుద్ధి యజ్ఞమూర్తి

తాతనవడానికి కూడా నాకు ప్రాబ్లెం లేదు! | actioncutok.com

You may also like: