అర్జున్ లాంటి మొగుడొద్దు బాబోయ్!


అర్జున్ లాంటి మొగుడొద్దు బాబోయ్!

అర్జున్ లాంటి మొగుడొద్దు బాబోయ్!

బెంగళూరమ్మాయి శ్రద్ధా శ్రీనాథ్ ‘జెర్సీ’ సినిమాతో నాయికగా తెలుగు తెరకు పరిచయమవుతోంది. నాని కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రేయసిగా, భార్యగా రెండు దశల సారా పాత్ర పోషణ సంతృప్తినీ, సంతోషాన్నీ ఇచ్చిందంటోన్న శ్రద్ధతో ‘యాక్షన్ కట్ ఓకే’ ప్రత్యేక ఇంటర్యూ…

నేను లా చదువుకున్నా. కాలేజీలో సెకండియర్‌లో ఉండగా నాటకాల్లో నటించడం మొదలుపెట్టా. బెంగళూరులోని ఇంగ్లిష్ థియేటర్‌లో నటించా. స్టేజితో ప్రేమలో పడిపోయాను. ఐదేళ్ల లా చదువు తర్వాత నాకు న్యాయవాద వృత్తిపై కంటే నటనపైనే ఎక్కువ ప్రేమ ఉందని తెలుసుకున్నా.

అయినప్పటికీ రెండేళ్లు లాయర్‌గా పనిచేశా. కానీ అది సంతోషాన్నివ్వలేక పోయింది. ఆ సమయంలో ఇండిపెండెంట్ కన్నడ డైరెక్టర్స్ నుంచి ఆఫర్లు వచ్చాయి. 2015 జనవరిలో సినిమాల్లోకి అడుగుపెట్టా. 2016లో నేను తొలిసారి ప్రధాన పాత్ర చేసిన ‘యు టర్న్’ వచ్చింది.

సికిందరాబాద్‌లో ఆరేళ్లున్నా

తెలుగు కాస్త వస్తుంది. నిజానికి నేను సికిందరాబాద్‌లో 6 సంవత్సరాలు ఉన్నాను. సెవెన్త్ స్టాండర్డ్ నుంచి ట్వల్త్ స్టాండర్డ్ దాకా. తిరుమలగిరిలోని కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నా. అక్కడ తెలుగు కాస్త నేర్చుకున్నా. ఇప్పుడు కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటా.

మాది బెంగళూరు. మా నాన్న ఆర్మీలో పనిచేశారు. ఎనిమిదేళ్ల క్రితం రిటైరయ్యారు. సర్వీసులో ఉన్నప్పుడు రెండేళ్లకోసారి షిఫ్టయ్యేవాళ్లు. అందువల్ల 9 స్కూళ్లలో చదువుకున్నా.

మూడో సినిమా మొదటి సినిమా అయ్యింది

ఈ సినిమా కంటే ముందే రెండు సినిమాలకు సంతకం చేశాను. ఒకటి సురేశ్ ప్రొడక్షన్స్‌లో. దానికి ‘క్షణం’ ఫేం రవికాంత్ పేరెపు డైరెక్టర్. దానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఇంకో సినిమా ఆది సాయికుమార్‌తో చేస్తోన్న ‘జోడి’. ఆ రెండింటికీ 2017లోనే సంతకం చేశాను. 2018ల్ అక్టోబర్‌లో ‘జెర్సీ’ ఆఫర్ వచ్చింది. కానీ ముందుగా అదే రిలీజవుతోంది.

‘జెర్సీ’ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నా. టీజర్, ట్రైలర్ రిలీజయ్యాక నా సంతోషం ఇంకా ఎక్కువయ్యింది. నేనికా సినిమా చూడలేదు. కానీ సినిమా చేసేప్పుడే దీనిపై చాలా నమ్మకం ఏర్పడిపోయింది.

గ్రిప్పింగ్ స్టోరీ

మొదట సినాప్సిస్ పంపించారు. నచ్చింది. తర్వాత డైరెక్టర్ గౌతం తిన్ననూరి కథ చెప్పారు. అది థ్రిల్లర్ కాదు. అయినా చాలా గ్రిప్పింగ్‌గా అనిపించింది. రియల్లీ లైక్డ్ ఇట్. నా కేరెక్టర్ నచ్చింది. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర. ఒక మంచి సినిమా తయారవ్వాలంటే దానికి తగ్గ వ్యక్తులు సినిమాకి పనిచెయ్యాలి. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లంతా అలాంటి వాళ్లే.

అర్జున్ లాంటి మొగుడొద్దు బాబోయ్!
సారా పాత్ర పోషణను ఆస్వాదించా

ఇది భిన్న దశల్లో అర్జున్, సారా జీవన ప్రయాణం. మొదట ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటారు. సారా క్రిస్టియన్ అమ్మాయి. 1986లో వాళ్లు ప్రేమికులు. ఆ కాలంలో ప్రేమించుకోవడమనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడది సాధారణ వ్యవహారమైందనుకోండి. దాన్ని సినిమాలో బాగా చూపించారు.

తర్వాత 1996లో పెళ్లి చేసుకుంటారు. వాస్తవం కళ్ల ముందుకొస్తుంది. బతకడానికి ఎవరో ఒకరు సంపాదించాలి. కడుపు నిండాలి. దాంతో ప్రేమ తగ్గి, చికాకులు పెరుగుతాయి. మొదట గ్లామర్‌గా, తర్వాత సీరియస్‌గా కనిపించే సారా పాత్ర చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశా.

సాధారణంగా ఇక్కడ హీరోయిన్లకు రెండు రకాల పాత్రలు ఉంటాయి. అయితే అభినయానికి అవకాశముండే డీ గ్లామర్ రోల్స్.. లేదా.. బాగా గ్లామరస్‌గా ఉండే కేరెక్టర్లు. ఈ రెండూ ఉండే సారా కేరెక్టర్ చేసినందుకు హ్యాపీ ఫీలవుతున్నా.

రియల్ ఫిల్మ్

‘జెర్సీ’ అనేది హానెస్ట్ స్టోరీ.. హానెస్ట్ ఎమోషన్స్. ప్రేక్షకులు ఈ కథతో అనుసంధానమవుతారని చెప్పగలను. ప్రతి ఒక్కరూ జీవితంలో స్ట్రగుల్ అవుతారు. క్రికెటర్ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి.. సినిమాలో చాలా పార్శ్వ్యాలుంటాయి. దీన్ని నేను డిఫరెంట్ ఫిల్మ్ అని చెప్పను. ఇది ఒక రియల్ ఫిల్మ్.

అర్జున్ అనే ఒక యంగ్ టాలెంటెడ్ క్రికెటర్, సారా అనే అమ్మాయి ప్రేమించుకుంటారు. తర్వాత ఆ అబ్బాయి ఏ కారణమూ లేకుండానే క్రికెట్ వదిలిపెట్టేస్తాడు. పదేళ్ల తర్వాత మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటాడు. ఎందుకు? అనేదే కథలోని కీలక అంశం.

సారాలో చాలో ఎమోషన్స్ ఉంటాయి

ప్రేయసిగా కంటే భార్యగా చెయ్యడం క్లిష్టమనిపించింది. అందులో చాలా భావోద్వేగాలు ఉంటాయి. అదే ప్రేయసిగా ఉన్నప్పుడు వినోదమే ఎక్కువ ఉంటుంది. పెళ్లయ్యాక అతను పనేమీ చెయ్యడు. ఆమె మాత్రమే ఉద్యోగం చేసి సంపాదిస్తుంది. అయిప్పటికీ ఆమె భర్తను ప్రేమిస్తుంటుంది. కానీ అతని ప్రవర్తనతో ‘ఏం చెయ్యాలి?’ అని విసిగిపోతుంటుంది.

ఒక వైపు జాబ్‌లో ఫ్రస్ట్రేషన్, ఇంకోవైపు ఇంట్లో భర్త ప్రవర్తనను భరించాల్సి రావడం.. ఆ పాత్ర చెయ్యడం కొంచెం క్లిష్టమైన పనే. ఆమె ప్రేమించే తల్లి కూడా. వాళ్లకు ఒకబ్బాయి కూడా ఉంటాడు. అలా సారా కేరెక్టర్‌లో చాలా ఎమోషన్స్ ఉంటాయి. అమ్మో.. నిజ జీవితంలో అర్జున్ లాంటి భర్తను అస్సలు కోరుకోను.

నానికి క్రెడిట్ ఇస్తా

నాని ఇంటిమిడేటెడ్ కాదు. ఎదుటివాళ్లకు సాయపడే మనిషి. నా సమస్య నటన కాదు. ఎందుకంటే మొదటే నేను స్టేజ్ ఆర్టిస్టుని. నా సమస్య తెలుగు. కానీ అది ఒక సమస్య కాకుండా చూశాడు నాని. ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. క్లిష్టమైన సన్నివేశాల్లో సాయపడేవాడు.

“నువ్వు బాగా చేస్తావు, చెయ్యగలవు” అంటూ ఎంకరేజ్ చేసేవాడు. నేను బాగా చేశానంటే అందులో నాని క్రెడిట్ కూడా ఉంది. స్టార్ అయినప్పటికీ ఎంతో వినయంగా ఉంటాడు. సెట్స్‌పై చాలా సౌకర్యంగా వ్యవహరిస్తాడు. ఒక సహ నటుడిగా ఐడియాస్ ఇవ్వడానికి చాలా ఓపెన్‌గా ఉంటాడు.

ఏ విషయంపైనైనా సమానంగా చర్చిస్తాడు. స్టార్‌ననే భేషజం అస్సలు ప్రదర్శించడు. మన ఐడియాలను వింటాడు. నాకైతే సారా పాత్ర పోషణకు సంబంధించి చాలా నమ్మకాన్ని కలిగించాడు.

అర్జున్ లాంటి మొగుడొద్దు బాబోయ్!
ఆ కాంప్లిమెంట్‌ను మర్చిపోలేను

నా నటనకు దర్శకుడు గౌతం నుంచి కాంప్లిమెంట్ అందుకున్నా. సినిమా కంప్లీట్ అయ్యాక ఒక ర్యాప్ పార్టీ అరేంజ్ చేశారు. నేను మరో సినిమా షూటింగ్‌కు వెళ్లాల్సి రావడంతో ఆ పార్టీకి అటెండ్ కాలేకపోయాను. అప్పుడు గౌతం నుంచి మెసేజ్ వచ్చింది. “శ్రద్ధా.. ప్రతి ఒక్కరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నువ్వు సారా పాత్రకు ఊపిరినిచ్చావు. థాంక్యూ ఫర్ దట్” అని. డైరెక్టర్ నుంచి అలాంటి ప్రశంస రావడం చాలా సంతోషాన్నిచ్చింది. అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్.

అన్ని చిత్రసీమలూ ఒకటే

నా దృష్టిలో ఏ భాషా చిత్రసీమ అయినా ఒకటే. భాష మాత్రమే తేడా. నేను కన్నడ, తమిళ, తెలుగు సినీ పరిశ్రమలు చూశాను. సెట్స్‌పై వాతావరణం ఒక్కలాగే అనిపించింది.

– బుద్ధి యజ్ఞమూర్తి

అర్జున్ లాంటి మొగుడొద్దు బాబోయ్! | actioncutok.com

You may also like: