Jersey Review: 4 Ups And 2 Downs


Jersey Review: 4 Ups And 2 Downs

Jersey Review: 4 Ups And 2 Downs

తారాగణం: నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్, ప్రవీణ్, సంపత్ రాజ్, మాస్టర్ రోణిత్ కమ్రా

దర్శకత్వం: గౌతం తిన్ననూరి

విడుదల తేది: 19 ఏప్రిల్ 2019

రెండు ఫెయిల్యూర్ సినిమాల తర్వాత నాని నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడానికి థియేట్రికల్ ట్రైలర్, ప్రమోషన్ కారణం. నాని క్రికెటర్‌గా నటించిన ‘జెర్సీ’ని ఇదివరకు ‘మళ్లీ రావా’ చిత్రంతో ఆకట్టుకున్న గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాతో కన్నడ తార శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు తెరకు పరిచయమయ్యింది.

కథ

1986.. అర్జున్ (నాని) ఒక ఆవేశపూరితుడైన క్రికెటర్. అతనికి తనవాళ్లంటూ ఎవరూ లేరు. క్రికెట్ కోచ్ (సత్యరాజ్)తో ఆత్మీయంగా ఉంటాడు. రంజీల్లో అనేక రికార్డులు అర్జున్ సొంతం. సార (శ్రద్ధా శ్రీనాథ్)తో ప్రేమలో నిండా మునుగుతాడు.

1996.. అర్జున్, సారాలకు పెళ్లయి నాని (రోణిత్) అనే కొడుకు ఉన్నాడు. పెళ్లి తర్వాత అర్జున్ క్రికెట్ వదిలేస్తాడు. రాజకీయాలతో ఇండియన్ టీంకు ఎంపిక చెయ్యకపోవడం వల్ల అతడు క్రికెట్ వదిలిపెట్టేశాడనే అభిప్రాయం మనకు కలుగుతుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ 3 అసిస్టెంట్ ఉద్యోగం అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్‌లో పడుతుంది. సారా తాజ్ బంజారా హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని నడుపుతుంటుంది.

నాని తన పుట్టినరోజుకు క్రికెట్ జెర్సీని గిఫ్ట్‌గా ఇవ్వమని తండ్రిని అడుగుతాడు. అది కొనిపెట్టలేని నిస్సహాయ స్థితి అర్జున్‌ది. అర్జున్ ధోరణి కారణంగా భార్యాభర్తల మధ్య అదివరకటి ప్రేమ కనిపించదు. అర్జున్‌పై సారా తరచూ చికాకు ప్రదర్శిస్తుంటుంది.

అనుకోకుండా న్యూజిలాండ్‌తో ఆడే చారిటీ మ్యాచ్‌లో హైదరాబాద్ టీంలో ఆడే అవకాశం కల్పిస్తాడు కోచ్. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ టీం ఓడినా తన ఆటతో అందర్నీ అబ్బురపరుస్తాడు అర్జున్. పదేళ్ల తర్వాత కూడా తనలో చేవ తగ్గలేదని నిరూపిస్తాడు.

అర్జున్ క్రికెట్ ఆడాడని తెలిసి సారా కేకలేస్తుంది. అయితే నువ్వు క్రికెట్ ఆడుతుంటే హీరోలా ఉంటావనీ, క్రికెట్ ఆడమనీ నాని అనేసరికి మళ్లీ క్రికెట్ ఆడి, ఇండియన్ టీంలో చోటు దక్కించుకోవాలనుకుంటాడు అర్జున్. అతడి ప్రయత్నాలు ఫలించాయా? ‘జెర్సీ’కీ, అర్జున్ కథకీ సంబంధం ఏమిటనే ప్రశ్నలకు పతాక సన్నివేశాలు సమాధానం చెప్తాయి.

Jersey Review: 4 Ups And 2 Downs
కథనం

అర్జున్ లక్ష్యం ఇండియన్ జెర్సీతో నేషనల్ క్రికెట్ టీం తరపున ఆడటం. అయితే అకస్మాత్తుగా పెళ్లయిన వెంటనే క్రికెట్‌ను పక్కన పెట్టేస్తాడు. “నీ జీవితమే క్రికెట్ కదా” అని సారా అడిగితే, “నువ్వున్నావు కదా” అంటాడు అర్జున్. అంతకు ముందు జాతీయ క్రికెట్ జట్టుకు అర్జున్ ఎంపిక కాలేదన్నట్లు దర్శకుడు మనకు చూపిస్తాడు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అవుతావని కోచ్ అంటే, పక్కనే ఉన్న గ్లాస్ బాక్స్‌ని చేత్తో కొట్టి గాయం చేసుకుంటాడు అర్జున్.

ప్రథమార్ధంలో అర్జున్ ప్రవర్తించే తీరు, అతనిలోని నిరాశా నిస్పృహలు మనకు అంతుపట్టని ప్రశ్నల్లా ఉంటాయి. పనీ పాటా లేకుండా ఇంట్లో కూర్చొని క్రికెట్ చూసుకుంటూ ఉండే అతడిపై సారా చికాకు పడటంలో, నిరసన వ్యక్తం చెయ్యడంలో మనకు తప్పేమీ కనిపించదు. అందుకే అర్జున్‌తో మనం సహానుభూతి చెందలేం.

కొడుక్కు 500 రూపాయలు పెట్టి ఒక జెర్సీని కొనివ్వలేని అతడి అసహాయత మనకు జాలి కలిగించదు. ఎంతో గాఢంగా ప్రేమించుకొని, సారా తండ్రి ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకున్న వాళ్లిద్దరి మధ్య మానసికంగా, శారీరకంగా అంత దూరం ఎందుకు పెరిగిందనే సందేహం మనల్ని పీడిస్తుంది.

ఫస్టాఫ్ అయ్యేసరికి కథతో ప్రేక్షకుడ్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చెయ్యడంలో దర్శకుడు గౌతం విఫలమయ్యాడనే అభిప్రాయం కలుగుతుంది. ఒకింత అసంతృప్తికీ గురవుతాం. కానీ సెకండాఫ్ నడిచే కొద్దీ మనం కథలో లీనమవుతాం. క్రికెట్ కోచ్ కావాల్సిన 36 ఏళ్ల వయసులో తాను కోచ్ కాదలచుకోలేదనీ, క్రికెటర్‌గా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాననీ చెప్పిన అర్జున్ పట్టుదల చూసి, క్రమంగా అతనితో ప్రయాణించడం మొదలుపెడతాం.

రంజీల్లో హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యాక అతడు ఆడే ఒక్కో మ్యాచ్ చూస్తూ, అతడు గొప్పగా ఆడాలనీ, అతడి జట్టు గెలవాలనీ కోరుకుంటాం. రంజీ ఫైనల్లో ముంబైతో ఓడిపోయే స్థితిలో ఉన్న జట్టును ఒంటి చేత్తో గెలిపించాక, అతడి కొడుకు నాని, భార్య సారా పొందే ఆనందంలో మనమూ భాగమవుతాం.

కథ ప్రస్తుతానికి.. అంటే 2019కు వచ్చేసరికి ప్రథమార్ధంలోని చిక్కుప్రశ్నలన్నింటికీ మనకు జవాబు లభిస్తుంది. అర్జున్ ఫ్రస్ట్రేషన్‌నూ, అతడి నిస్సహాయతనూ అర్థం చేసుకుంటాం. ఫస్టాఫ్‌లో మిస్సయిందనుకున్న ఎమోషనల్ కనెక్షన్‌ను సెకండాఫ్‌లో కలిపాడు దర్శకుడు.

ద్వితీయార్ధంలో నెమ్మదిగా గుండెను తడుతూ వచ్చే ఆర్ద్రతా భావం క్రమక్రమంగా గుండెను ఆక్రమించుకుంటూ రావడం, సినిమా అయ్యాక కూడా ఆ ఆర్ద్రత నిలిచి ఉండటం దర్శకుడి సృజనాత్మక శక్తికీ, ప్రతిభా పాటవాలకూ నిదర్శనం. అయితే అన్ని వర్గాల, అన్ని తరగతుల ప్రేక్షకుల్నీ ఈ సినిమా అలరిస్తుందనీ, ఆకట్టుకుంటుందనీ చెప్పలేం.

అభిరుచి కలిగిన ప్రేక్షకుల్ని ఈ సినిమా సంతృప్తి పరుస్తుంది. సెకండాఫ్‌లో మనం ఎక్కువగా క్రికెట్‌నే చూసినా, అందులోని భావోద్వేగం ఆ తరహా ప్రేక్షకులకు అందుతుంది. అది అందని ప్రేక్షకులు నిరుత్సాహపడతారు.

Jersey Review: 4 Ups And 2 Downs
తారల అభినయం

ఇది ప్రధానంగా నలుగురి మీద నడిచే కథ అయినా, ఇది నాని సినిమా. అర్జున్ పాత్రలో అతడు రాణించిన విధానం అపూర్వం. ఒక ఫెరోషియస్ క్రికెటర్ ఒక ఫ్రస్ట్రేటెడ్ పర్సన్‌గా మారాక నాని నటన, అతడు ప్రదర్శించిన హావభావాలు ఉత్తమ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకూ నటుడిగా అతడికి మార్కులు వేయాల్సి వస్తే అత్యధిక మార్కులు పడేది ‘జెర్సీ’లోని అర్జున్ పాత్ర పోషణకే.

క్రికెటర్‌గా నాని బాడీ లాంగ్వేజ్ ఆశ్చర్యపరుస్తుంది. క్రికెట్‌ను ఆవాహన చేసుకున్నవాడిలా, క్రికెట్ ఆడుతూ కూడా అతడు భావోద్వేగాలు పంచాడు. బాక్సాఫీస్ ఫలితం ఎలాగైనా ఉండనీ.. నటుడిగా నాని గురించి మాట్లాడుకోవాలంటే తప్పకుండా ‘జెర్సీ’ని తలవాల్సిందే.

సారా పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ చక్కగా ఇమిడిపోయింది. కుటుంబ పోషణను గాలికి ఒదిలేసి ఏమీ పట్టించుకోని భర్తపై కోపం నసాళానికి అంటుతున్నా, తమాయించుకుంటూ, చిన్న చిన్నగా చికాకుపడుతూ ఉండే భార్యగా ఆమె టాప్ రేటెడ్ పర్ఫార్మెన్స్ చూపించింది.

క్రికెట్ కోచ్‌గా సత్యరాజ్ తనకు అలవాటైన రీతిలో సునాయాసంగా నటించేశాడు. అర్జున్‌తో ఆయన అనుబంధం మనల్ని బాగా ఆకట్టుకుంటుందంటే, అందులో సత్యరాజ్ అభినయం కీలకం.

అర్జున్, సారాల కొడుకుగా చిన్నవాడైనా భలేగా చేశాడు మాస్టర్ రోణిత్. అల్లరి పిల్లాడిగా కనిపిస్తూనే, తండ్రి ఫ్రస్ట్రేషన్‌ను అర్థం చేసుకొని ఆరిందాలా వ్యవహరించే నాని పాత్రలో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ప్రవీణ్, సంపత్ రాజ్, ఇతర నటులు పరిధుల మేరకు నటన ప్రదర్శించారు.

Jersey Review: 4 Ups And 2 Downs
టెక్నీషియన్ల పనితీరు

సాంకేతిక నిపుణుల్లో సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు చాలా చక్కని పనితనం కనపర్చారు. సంగీతం సినిమాలో ఒక భాగంగా మిళితమైంది. పాటలు సందర్భోచింతంగా ఉంటే, నేపథ్య సంగీతం కథతో పాటు ప్రయాణించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఔట్‌స్టాండింగ్.

ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సను జాన్ వర్ఘీస్ కెమెరా గొప్పతనాన్ని. అనేక షాట్లు సన్నివేశాల్లోని మూడ్‌ని బాగా ఎలివేట్ చేశాయి. స్టేడియంలో అర్జున్, రమ్య మధ్య వచ్చే లాంటి చిన్న చిన్న సన్నివేశాల్ని కూడా ముచ్చటగా తీశాడు సను. అర్జున్, నాని మధ్య చిలిపితనపు సన్నివేశాలు. అర్జున్ – సారా మధ్య బరువైన సన్నివేశాలు ఛ్యాయాగ్రాహకుడి పనితీరుని చెప్తాయి. ఇక అర్జున్ క్రికెట్ ఆడేప్పుడు కెమెరా ఎన్ని కోణాల్లో తిరగాల్లో అన్ని కోణాల్లో సమర్థవంతంగా తిరిగింది.

ఫస్టాఫ్‌లో అర్జున్ ప్రవర్తనకు సారా ఎంత ఫ్రస్ట్రేషన్ పడుతుందో, ప్రేక్షకుడూ అంతే ఫ్రస్ట్రేషన్ అనుభవించాడంటే, అర్జున్‌తో ప్రేక్షకుడు ప్రయాణించలేదంటే ఎడిటర్ నవీన్ నూలి కత్తెర ఉదారంగా వ్యవహరించిందని అర్థం. ఆ లోపాన్ని ఎడిటర్ గుర్తించలేకపోయాడు.

చివరి మాట

ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నించడం వేరు, చనిపోతానని తెలిసి కూడా ప్రయత్నించడం వేరు. ఈ రెండో పని చేసిన అర్జున్ మనల్ని కొన్ని రోజుల పాటు మనల్ని వెంటాడతాడు.

– బుద్ధి యజ్ఞమూర్తి

Jersey Review: 4 Ups And 2 Downs | actioncutok.com

You may also like: