నెత్తురు చిందిన దానికి ఫలితం?


నెత్తురు చిందిన దానికి ఫలితం?

నెత్తురు చిందిన దానికి ఫలితం?

నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ‘జెర్సీ’ సినిమా ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రద్ధా శ్రీనాథ్ నాయికగా నటించిన ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు.

పదేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న అర్జున్ అనే 36 సంవత్సరాల క్రికెటర్ మళ్లీ 1996 రంజీల్లో ఆడటానికి చేసిన కృషి ‘జెర్సీ’ కథగా మనం చెప్పుకోవచ్చు.

వారం రోజుల క్రితం ‘జర్నీ ఆఫ్ జెర్సీ’ పేరిట విడుదల చేసిన వీడియో చూస్తే అర్జున్ పాత్ర పోషణ కోసం నాని పడిన కష్టం అర్థమవుతుంది. స్వతహాగా నాని క్రికెటర్ కాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లోనూ ఎప్పుడూ ఆడింది లేదు. అందుకే అర్జున్ కేరెక్టర్ చెయ్యడానికి క్రికెట్‌ను సాధన చేశాడు నాని.

ఇవాళ్టి యువ హీరోలు పాత్రల కోసం ఎలాంటి శ్రమ చెయ్యడానికైనా వెనుకాడటం లేదు. గతంలో క్లిష్టమైన సన్నివేశాల్ని డూప్‌ల సాయంతో నెట్టుకొచ్చేవాళ్లు హీరోలు. ఇప్పుడు రిస్కీ షాట్స్‌ను కూడా తామే చెయ్యాలని హీరోలు తపిస్తున్నారు.

అందులో భాగంగానే 70 రోజుల పాటు క్రికెట్‌లో తీవ్ర సాధన చేశాడు నాని. ఆ క్రమంలో ఎంతటి అలసటకు గురైనా వెనక్కి తగ్గలేదు. ఇక క్రికెట్ ఆడే సన్నివేశాలు తీసేటప్పుడు దెబ్బలు తిన్నాడు. అతడి మొహానికి బంతి తగిలి నెత్తురు కారింది కూడా.

క్రికెట్ ఆటలకు సంబంధించిన సన్నివేశాలను డైరెక్టర్ 24 రోజుల పాటు చిత్రీకరించాడు. చాలా ఓపిగ్గా, చాలా ప్రొఫెషనల్‌గా ఈ సినిమా చేశాడు నాని. అతను పడిన కష్టానికైనా ‘జెర్సీ’ పెద్ద హిట్టవడం వినా వేరే దారి లేదు. ఏదేమైనా నాని ఎంత కష్టపడ్డా డైరెక్టర్ ఎలా తీశాడనే దానిపైనే ‘జెర్సీ’ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. చూద్దాం.. ఫలితం ఎలా ఉంటుందో..

నెత్తురు చిందిన దానికి ఫలితం? | actioncutok.com

You may also like: