‘మజిలీ’ కలెక్షన్లు: రూ. 21 కోట్లు దాటాయి!


'మజిలీ' కలెక్షన్లు: రూ. 21 కోట్లు దాటాయి!

‘మజిలీ’ కలెక్షన్లు: రూ. 21 కోట్లు దాటాయి!

నాగచైతన్య, సమంత జోడీ సినిమా ‘మజిలీ’ బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికి మించి రాణిస్తోంది. ఐదు రోజుల్లో రూ. 21 కోట్ల మార్కును దాటడమే కాకుండా కొన్ని ఏరియాల్లో ఇప్పటికే బ్రేకీవెన్ సాధించేసింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతన్య ప్రియురాలి పాత్రలో కొత్తమ్మాయి దివ్యాంశ కౌశిక్ నటించింది. ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ‘మజిలీ’ రూ. 21.66 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు.

తెలంగాణలో రూ. 6 కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా అక్కడ రూ. 6.84 కోట్ల షేర్ సాధించి లాభాల్లో అడుగుపెట్టింది. రాయలసీమలో రూ. 2.5 కోట్ల విలువకు గాను దానికి అత్యంత సమీపంగా రూ. 2.45 కోట్లను రాబట్టింది. బుధవారం వసూళ్లతో అక్కడ కూడా బ్రేకీవెన్ సాధించి లాభాల్లోకి అడుగుపెట్టనుంది.

ఇక ఆంధ్రా ఏరియాలో ‘మజిలీ’ ప్రి రిలీజ్ బిజినెస్ విలువ రూ. 8.14 కోట్లు కాగా, ఐదు రోజులకు రూ. 7.62 కోట్ల షేర్ వచ్చింది. అందులోనూ ఉత్తరాంధ్రలో మంగళవారం నుంచే లాభాలు మొదలయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బుధవారం నుంచి లాభాల్లోకి రానున్నది.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో రూ. 1.5 కోట్ల విలువకు గాను ఇప్పటికే రూ. 2.15 కోట్లతో లాభాలను ఆర్జించిన ఈ సినిమా యు.ఎస్.లో రూ. 3 కోట్లకు గాను రూ. 2.6 కోట్లను సాధించింది. బాక్సాఫీస్ వద్ద ‘మజిలీ’ దూకుడుతో చిత్రసీమలో ఆనందం కనిపిస్తోంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ల ముఖాల్లో చాలా రోజుల తర్వాత నవ్వులు విరబూస్తున్నాయి.

‘మజిలీ’ కలెక్షన్లు: రూ. 21 కోట్లు దాటాయి! | actioncutok.com

You may also like: