మూడు ఫ్లాపుల తర్వాత దక్కింది హిట్టు!


మూడు ఫ్లాపుల తర్వాత దక్కింది హిట్టు!

మూడు ఫ్లాపుల తర్వాత దక్కింది హిట్టు!

కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో చేసిన ‘రారాండోయ్ వేడుక చూద్దాం’ (2017) సినిమా తర్వాత నాగచైతన్యకు ‘మజిలీ’ రూపంలో హిట్ దక్కింది. ఈ సినిమాకి ముందు వరుసగా మూడు ఫ్లాపులతో అతని మార్కెట్ డౌన్ అయింది. ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫ్లాప్ కాగా, ‘యుద్ధం శరణం’, ‘సవ్యసాచి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. అందుకే ‘సవ్యసాచి’ కంటే ‘మజిలీ’ పంపిణీ హక్కులు తక్కువ ధరకు అమ్ముడుపోయాయి.

అయితేనేం మొదట్నుంచీ ఈ సినిమా తనను ఫ్లాపుల నుంచి బయట పడేస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు చైతన్య. ఇందులో తన నిజ జీవిత భాగస్వామి సమంతతో కలిసి నటించాడు. పెళ్లికి ముందు కలిసి మూడు సినిమాలు చేసినవాళ్లకు రెండు హిట్లు – ‘ఏ మాయ చేశావే’, ‘మనం’ – ఉన్నాయి. ‘ఆటోనగర్ సూర్య’ ఒక్కటి ఫ్లాపయింది.

పెళ్లి తర్వాత సమంతతో చేసిన తొలి సినిమా కావడంతో సెంటిమెంట్‌గానూ చైతన్య ఫీలయ్యాడు. చరిత్రనోసారి తిరగేస్తే నిజ జీవిత జంటలు తెర జంటలుగా కనిపిస్తే ప్రేక్షకులు ఏమంత ఆసక్తి చూపించలేదని అర్థమవుతుంది. దాన్ని ‘మజిలీ’తో బ్రేక్ చేశాడు చైతన్య.

ఈ క్రెడిట్‌ను డైరెక్టర్ శివ నిర్వాణకు ఇవ్వాల్సిందే. అతను రూపొందించిన ‘నిన్ను కోరి’ బాగానే ఆడినా, కథనం నెమ్మదిగా ఉందనే పేరొచ్చింది. ‘మజిలీ’లో ఆ లోపం లేకుండా చూసుకొని ఉంటే మాత్రం విజయం తథ్యమని విశ్లేషకులు అంచనా వేశారు.

నిజానికి ‘మజిలీ’ సెకండాఫ్‌లో కథనం నెమ్మదించింది. అయినప్పటికీ సమంత, చైతన్య మధ్య వచ్చే సన్నివేశాలు మధ్యతరగతి మనుషులకి బాగా కనెక్టయ్యాయి. సమంత కేరెక్టర్‌తో గృహిణులు సహానుభూతి చెందితే, భగ్న ప్రేమికుడిగా చైతన్య చేసిన పూర్ణ పాత్ర, ఆ పాత్రలో చైతన్య నటన ప్రేక్షకుల్ని మెప్పించాయి.

బహుశా ఈ సినిమా తర్వాత చైతన్యకు ఒక విషయం అర్థమై ఉండాలి. నేల విడిచి సాము చేసే కథల కంటే, వాస్తవికతను ప్రతిబింబించే కథలు, అర్థవంతమైన పాత్రలు చేయడమే ఉత్తమమని అతను తెలుసుకొని ఉండాలి.

– సజ్జా వరుణ్

మూడు ఫ్లాపుల తర్వాత దక్కింది హిట్టు! | actionctutok.com

You may also like: