ABCD Review: 3 Ups And 4 Downs


ABCD Review: 3 Ups And 4 Downs

ABCD Review: 3 Ups And 4 Downs

తారాగణం: అల్లు శిరీష్, రుక్సర్ ధిల్లాన్, మాస్టర్ భరత్, కోట శ్రీనివాసరావు, నాగబాబు, వెన్నెల కిశోర్, రాజా చెంబోలు, శుభలేఖ సుధాకర్

దర్శకత్వం: సంజీవ్‌రెడ్డి

విడుదల తేది: 17 మే 2019

అనేక మార్లు విడుదలకు సిద్ధమై వాయిదా పడుతూ వచ్చిన అల్లు శిరీష్ సినిమా ‘ఏబీసీడీ’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో ఇదే పేరుతో వచ్చి విజయం సాధించిన సినిమాకు రీమేక్ అయిన ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి డైరెక్టర్‌గా అడుగుపెట్టాడు సంజీవ్‌రెడ్డి. ‘అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమాకు ఏమాత్రం వర్తిస్తుంది?..

కథ

అమెరికాలో డబ్బులో పెట్టి డబ్బులో పెరిగిన అవి (అల్లు శిరీష్)కు డబ్బు విలువ కానీ, జీవితం విలువ కానీ ఏమాత్రం తెలీవు. జీవితం అంటే ఏమిటో తెలుసుకుని రమ్మని అతడ్ని తండ్రి (నాగబాబ్) హైదరాబాద్ పంపిస్తాడు. హైదరాబాద్ వచ్చిన అవికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నేహతో పరిచయం అతడికి ఎలాంటి అనుభావాల్ని ఇచ్చింది? జీవితంతో పాటు తనను తాను అవి ఎలా తెలుసుకున్నాడు?.. ఈ ప్రశ్నలకు సమాధానం ద్వితీయార్ధం తెలియజేస్తుంది.

కథనం

సినిమాని దర్శకుడు ఆశావహ దృక్తథంతోనే మొదలుపెట్టాడు. ప్రేక్షకులకి ఆహ్లాదాన్ని పంచాడు. హాయిగా సాగుతూ వచ్చిన కథను ద్వితీయార్ధంలో క్లిష్టంగా మార్చేశాడు. రీమేక్ స్టోరీ అయినప్పటికీ ‘కన్ఫ్యూజ్డ్ దేశి’కి తగ్గట్లుగానే కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ కన్ఫ్యూజన్‌కు గురయ్యాడనే విషయం స్పష్టమైపోతుంది.

కథనంలో బిగువు లోపించడంతో తరచూ చికాకు కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు సిల్లీగా తోస్తాయి. ఆహ్లాదాన్ని పంచే సన్నివేశాల్ని కూడా అనుభవ లేమితో దర్శకుడు వాటిని నీరసపర్చాడు. జీవితం విలువ, సొంత వ్యక్తిత్వం గురించి అవి ఎలా తెలుసుకున్నాడనే విషయాల్ని భావావేశంతో చూపించినట్లయితే సినిమా ఆకర్షవంతంగా మారేది.

ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు సంజీవ్‌రెడ్డి. రాజాతో అవి ఘర్షణ, వాళ్లిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాల్లో పస లోపించింది. చివరాఖరికైనా కథ ఆసక్తిగా మారుతుందనుకుంటే.. క్లైమాక్స్ విషయంలోనూ నిరాశకు గురవుతాం.

ABCD Review: 3 Ups And 4 Downs
తారల అభినయం

‘శ్రీరస్తు శుభమస్తు’లో కనిపించిన శిరీష్‌కూ, ‘ఏబీసీడీ’లో కనిపించిన శిరీష్‌కూ బాగా తేడా కనిపించింది. ఆ సినిమాలో పాత్రతో కానీ, నటనతో కానీ పోలిస్తే ‘ఏబీసీడీ’లో అవి పాత్రలో యావరేజ్‌గా కనిపించాడు శిరీష్. హీరోకి కావాల్సిన ఛార్మింగ్ ఏమాత్రం కనిపించలేదు. ఎమోషనల్ స్టోరీ కాకపోవడం వల్ల శిరీష్ నటన చాలా క్యాజువల్ ధోరణిలో సాగింది. అవి అనేది శిరీష్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ కేరెక్టర్ కాదు.

కథలో హీరోయిన్‌కు ఎక్కువ స్కోప్ లభించలేదు. అయినప్పటికీ నేహ పాత్రలో రుక్సార్ బాగానే ఉంది. నటించడానికి అవకాశం తక్కువైనా అందంతో ఆకట్టుకుంది. ఇటీవల పాజిటివ్ కేరక్టర్లతో మెప్పిస్తూ వస్తోన్న రాజా చెంబోలు ఈ సినిమాలో విలన్‌గా చెప్పుకోదగ్గ నటన కనపర్చాడు. బాల నటుడిగా సుపరిచితుడైన భరత్ ఇప్పుడు టీనేజ్ కుర్రాడిగా ఎదిగాడు. అయితే కామెడీకి ఉద్దేశించిన అతడి పాత్రని దర్శకుడు సరిగా వినియోగించుకోలేకపోయాడు.

హీరో తండ్రిగా నాగబాబు నటన కృతకంగా ఉంది. వెన్నెల కిశోర్ కేరెక్టర్‌ను ఇంకాస్త పెంచితే బాగుండేది. కనిపించిన కొద్దిసేపూ అలరించాడు. శుభలేఖ సుధాకర్ పాత్ర పరిధి మేరకు నటించాడు.

ABCD Review: 3 Ups And 4 Downs
సాంకేతిక అంశాలు

సినిమాలో చెప్పుకోదగ్గది జుడా సంధీ అందించిన సంగీతం. కన్నడంలో సంచలన సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంధీ ఈ సినిమాకు చక్కని స్వరాలు అందించాడు. ‘మెల్ల మెల్లగా..’ పాట ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. వినసొంపుగానే కాకుండా కంటికింపుగా కూడా ఉంది ఆ పాట. రీరికార్డింగ్ సైతం బాగుంది.

రాం సినిమాటోగ్రఫీకి వంక పెట్టాల్సిన పనిలేదు. నవీన్ నూలి ఎడిటింగ్ కత్తెర సెకండాఫ్‌లో మరింత పదునెక్కితే బాగుండేది. సంభాషణలు ఫర్వాలేదు. ముందే చెప్పుకున్నట్లు స్క్రీన్‌ప్లే లోపభూయిష్ఠం.

చివరి మాట

కథన లోపాలు, ఆసక్తికరంగాలేని క్యారెక్టరైజేషన్ కారణంగా అమెరికన్ బార్న్ దేశీ తుస్సుమన్నాడు.

– బుద్ధి యజ్ఞమూర్తి

ABCD Review: 3 Ups And 4 Downs | actioncutok.com

More for you: