Can A STAR Really Save The Film?


Can A STAR Really Save The Film?

Can A STAR Really Save The Film?

సినిమాని హీరో నిజంగా రక్షిస్తాడా?

జీవనం కోసం పగలంతా కష్టపడి అలసినవాళ్లకు కొద్దిసేపైనా విశ్రాంతీ, వినోదం అవసరం. అందువల్లే వినోదాన్నిచ్చే సినిమాలు, టీవీ జన జీవనంలో ప్రాధాన్యం ఏర్పరచుకున్నాయి. నిజానికి ఇవాళ సినిమాకు పరమావధి వినోదమే. నిత్య జీవితంలో మనం పడ్డ శ్రమనూ, కష్టాన్నీ మరిపించి సినిమాలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయి.

అందుకని మంచికో, చెడుకో ఈ సినీ పరిశ్రమ ఏర్పడిన నాటినుంచీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ ఇవాళున్న స్థాయికి చేరింది. హాలీవుడ్‌లో తయారయ్యే సినిమాల్లో ఎక్కువ అశ్లీలత, హింస కనిపిస్తాయి. యువత మనసుల్లో అవి విష ఫలితాల్ని కలిగిస్తున్నాయనే ఉద్దేశంతో సామాజిక సంస్థలు, మహిళా సంఘాలూ కొన్నేళ్ల క్రితం వాటిని మన ప్రాంతంలో నిషేధించాలని ఆందోళనలు కూడా చేశాయి.

కానీ ఇవాళ ఇంటర్నెట్ కారణంగా మితిమీరిన అశ్లీలత అందుబాటులోకి రావడంతో సినిమాల్లోని అసభ్యత, అశ్లీలత, హింస గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నేటి మన సినిమాల్ని గమనిస్తే హాస్యం పేరుతో ఎంత అసభ్యత చలామణీ అవుతుందో అర్థమవుతుంది.

అశ్లీలంగా, అభ్యంతరకరంగా తోచిన సన్నివేశాల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించడానికి ఏర్పాటుచేసిన సెన్సార్ బోర్డులు ఆ పనిని చేయకుండా ‘చూసీచూడనట్లు’ పోతుండటంతో అలాంటి సన్నివేశాలు మన సినిమాల్లో సాధారణ విషయం కింద తయారయ్యాయి.

హాలీవుడ్, ఇతర విదేశీ సినిమాల్లోని సెక్స్ సన్నివేశాల్నీ, అర్ధనగ్నత్వాల్నీ మనవాళ్లు గుడ్డిగా.. కాదు కాదు.. యథేచ్ఛగా అనుకరిస్తున్నారు. ఇవి మనదేశ పునర్నిర్మాణానికి గానీ, సంస్కృతీ వికాసానికి గానీ ఏమాత్రం తోడ్పడవు. కొన్నేళ్లుగా తెలుగులో కానీ, హిందీలో కానీ తయారవుతున్న చిత్రాల్లో చాలావరకు విదేశీ సినిమాల అనుకరణే అని చెప్పాలి. అందుకే వాటిలో నేటివిటీ అనేది కనిపించడం లేదు.

కథా విశిష్టత మచ్చుకైనా కానరావడం లేదు. ఈ విషయంలో మన పొరుగున ఉన్న తమిళ సినిమా చాలా బెటర్ అని చెప్పాలి. వాళ్లు నేటివిటీతో ఎలాంటి సినిమాలు తీస్తున్నారో అక్కణ్ణించి తెలుగులో అనువాదమై వస్తున్న సినిమాలు చెబుతున్నాయి.

తెలుగు సినిమా ప్రారంభ సంవత్సరాల్లోనే గూడవల్లి రామబ్రహ్మం వంటి దర్శకుల నుంచే చక్కని చిత్రాలు, ప్రజాభ్యుదయాన్ని కాంక్షించే సినిమాలు తీయడం మొదలైంది. అవి ప్రేక్షకుల్లో చక్కని ఆలోచనలను రేకెత్తించేవి. వాళ్ల అభిరుచి మెరుగుపడేందుకు దోహదం చేసేవి. సామాజిక దురన్యాయాల్ని అరికట్టాలనే ఆవేశాన్ని రగిలించేవి.

భూస్వాముల దోపిడీకి అడ్డుకట్ట వేయడం, వరకట్న నిర్మూలనం, ప్రభుత్వాల, రాజకీయ నాయకుల, అవినీతి అధికార్ల దాష్టీకాల్ని ప్రశ్నించడం, కింది కులాలవారిపై అగ్రవర్ణాల పీడనను నిలదీయడం, కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం, ఊరిని బాగుచేసుకోవడం.. ఇలా ఎన్నెన్నో అంశాలతో సినిమాలు వచ్చాయి. ఇవి ఓ వైపు వినోదాన్ని అందిస్తూనే, మరోవైపు మానసిక వికాసాన్నీ కలిగించేవి.

కొంతకాలం చిత్ర పరిశ్రమ అభివృద్ధి మార్గంలోనే ఉంది కానీ, దురదృష్టవశాత్తూ జానపద, పౌరాణిక సినిమాల ధాటికి సామాజిక చిత్రాలు వెనకపడిపోయాయి. ఫలితంగా పరిశ్రమ ఆత్మే నాశనమయ్యే స్థిది దాపురించింది. వ్యాపారాలతో అకస్మాత్తుగా డబ్బు సంపాదించిన నయా సంపన్న వర్గం మరింత డబ్బు, పేరు సంపాదించాలనీ, తళుకుబెళుకు తారల మధ్య తారట్లాడాలనే ఆశతో పరిశ్రమలోకి అడుగుపెట్టడం మొదలుపెట్టింది.

అవినీతి సంపాదన కావడం వల్ల ఇష్టమొచ్చినంత డబ్బుపెట్టి సినిమాలు నిర్మిస్తూ వాళ్ల కులాసా కొద్దీ తారలకు భారీ పారితోషికాలిస్తూ వచ్చారు. ఈ నిర్మాతలకు కళాదృష్టి కానీ, సంస్కృతిపట్ల గౌరవం కానీ లేకపోవడంతో శృంగార, అశ్లీల, హింసాత్మక చిత్రాల వైపు మొగ్గు చూపారు. వాళ్లు ఒకే రకమైన సినిమాలు తీయడం ప్రారంభించారు. నేటికీ ఆ రకం సినిమాలే తయారవుతున్నాయి.

మొదట్లో నిర్మాతల అధీనంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉండేవాళ్లు  తారలు. అయితే వాళ్లలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశ బయలుదేరి, ‘కాల్షీట్ల’ పద్ధతిలో ఒకేసారి నాలుగైదు సినిమాల్ని ఒప్పుకోవడం మొదలుపెట్టారు. తాము అంత శ్రమ పడగలమో, లేదో కూడా ఆలోచించలేని విధంగా వాళ్ల ఆశలు మితిమీరిపోయాయి.

ఫలితంగా సినిమా బడ్జెట్ నిర్మాత అదుపులో లేకుండా పోయింది. షూటింగ్‌కు అయ్యే ఖర్చు కంటే తారల, సాంకేతిక నిపుణుల పారితోషికాలకే నిర్మాత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన దరిద్రపు స్థితి వచ్చింది. మరోవైపు టెలివిజన్ రాకతో సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా పడిపోయింది. నూటికి పది సినిమాలు మాత్రమే గట్టెక్కే రోజులు వచ్చాయి.

దీంతో అసలు చిత్ర పరిశ్రమ నిలుస్తుందా, లేదా అని అసలు సిసలు సినిమా ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తారల్లో మచ్చుకి వెతికినా సహకారమనేది కనిపించడం లేదు. వాళ్లు పూర్వం మాదిరిగానే కోట్లు కావాలని కూర్చుంటున్నారు. వాళ్లడిగిన డబ్బు ఇవ్వడమే కాదు, వాళ్లు సెట్స్‌పైకి ఎప్పుడొచ్చినా.. అదేమని అడగకూడదు. వాళ్లు వచ్చిందే భాగ్యమన్నట్లు అప్పుడే సీన్లు తీసుకోవాలి.

వాళ్లు ఇలాంటి ప్రవర్తనతో తమనెంతంగా బాధపెడ్తున్నా, నిర్మాతలు జీ హుజూర్ అంటున్నారు. చిత్రమేమంటే ఈ బడా తారలు నటిస్తున్న చిత్రాల్లో చాలా భాగం భారీ పరాజయాలు మూటగట్టుకుంటున్నాయి. నిజానికి ఇవాళ చిన్న తారలు నటిస్తున్న సినిమాలే నిర్మాతకు మనశ్శాంతినిస్తున్నాయి. అయినా పెద్ద తారల విలువ తగ్గడం లేదు. వాళ్లపై మోజు అంతకంతకూ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు. స్టార్ సిస్టంను ఈ నిర్మాతలే ప్రోత్సహిస్తున్నట్లు  కనిపిస్తోంది.

వీళ్లే భారీ పారితోషికాలిచ్చి మరీ ముంబాయి, ఇతర భాషా చిత్రాల నాయికలను, నటులను బుక్ చేస్తున్నారు. దానితో తెలుగు కళాకారులు చికాకు ప్రదర్శిస్తున్న సందర్భాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. అప్పనంగా వచ్చిపడుతున్న డబ్బు కారణంగా ఇతర భాషల నటులు తమ సొంత భాషా చిత్రాల కంటే తెలుగు చిత్రాలంటేనే మోజుపడే స్థితికి వచ్చారు.

ఇంత జరుగుతున్నా, పెద్ద తారల సినిమాలకు పరాజయం తప్పడం లేదు. కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనీ, స్టార్ వాల్యూలో ఏమీ లేదనీ తెలుసుకోడానికి ఆ హీరోలు నిరాకరిస్తున్నారు. ‘బ్రూస్‌లీ’ సినిమాని ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాంచరణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు. ఓ స్టార్ హీరో, ఓ స్టార్ డైరెక్టర్ కలిస్తే ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుందనీ, కాసుల వర్షం కురుస్తుందనీ బయ్యర్లు ఆశించారు. జరిగింది అందుకు భిన్నం.

గమనించాల్సిన విషయమేమంటే ఈ సినిమాకు మరింత స్టార్ వాల్యూ తీసుకు రావాలనే ఉద్దేశంతో చిరంజీవి కూడా స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఓ ఫైట్ చేశారు. అయినా సినిమాని చిరంజీవి స్టార్ వాల్యూ ఏమాత్రం కాపాడలేకపోయింది. ఫలితంగా బయ్యర్లు భారీ నష్టాలకు లోనయ్యారు.

ఇదివరకు ఇదే శ్రీను వైట్ల, మరో సూపర్‌స్టార్ మహేశ్‌తో చేసిన ‘ఆగడు’ సినిమా సైతం ఘోరంగా ఫ్లాపయింది. అందుచేత నిర్మాతలు పెద్ద హీరోల కాళ్లు పట్టుకొని వేళ్లాడే కంటే, తమ దృష్టిని ఎక్కువగా కథపైనా, నిర్మాణ విలువలపైనా పెడితే ఫలితం మెరుగ్గా ఉంటుంది.

సినిమా నిర్మాణంపై ఏమాత్రం అవగాహన లేకుండా కొంతమంది వ్యాపారులు అందులోకి దిగి అనవసరంగా డబ్బును నాశనం చేస్తున్నారు. చాలా సినిమాలు విడుదలకు నోచుకోకుండా ల్యాబుల్లో మురిగిపోతుండటానికి వాళ్ల అజ్ఞానమే కారణం. వీటిపై వందల కోట్ల రూపాయలు నాశనమయ్యాయి.

ఈ పరిస్థితికి డిస్ట్రిబ్యూటర్లు, డబ్బు పెట్టుబడిదార్లు కూడా కారణమే. నిజాయితీ ఉన్న నిర్మాతలకు డబ్బు ఇచ్చేందుకు వెనుకాడి, మోసగాళ్లను మేపడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అందుకే చిత్ర పరిశ్రమ నిరంతర ఒడిదుడుకులతో సతమతమవుతూ సాంకేతికంగా పురోగమిస్తున్నదే కానీ, నిర్మాతల్లో ఎక్కువ శాతం మందికి ఖేదాన్ని కలిగిస్తూ కుంటి నడకతో సాగుతూ ఉంది.

– వనమాలి

Can A STAR Really Save The Film? | actioncutok.com

Trending now: