‘1.. నేనొక్కడినే’ కల్ట్ మూవీయేనా?

‘1.. నేనొక్కడినే’ కల్ట్ మూవీయేనా?
“నేనే గనుక జడ్జినైతే అన్ని అవార్డులూ మహేశ్‌కే ఇచ్చేస్తాను. ఇది అతిశయోక్తి అనిపించవచ్చు. సెట్స్‌పై ప్రతిరోజూ నాకో భావప్రాప్తిలా ఉండేది. తను చేసిన ప్రతి సన్నివేశాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లాడు మహేశ్”.. ‘1.. నేనొక్కడినే’ సినిమా విడుదలయ్యాక డైరెక్టర్ సుకుమార్ చెప్పిన మాటలివి.
సుకుమార్ అంత బల్లగుద్ది మరీ చెప్పినా ఆ సినిమాలో నటనకు మహేశ్కేమీ అవార్డులు రాలేదు. పైగా సినిమా బాక్సాఫీస్ వద్ద్ బోల్తా కొట్టింది. బయ్యర్లను, నిర్మాతలను నిండా ముంచేసింది. అయినప్పటికీ ఆ సినిమాని ‘కల్ట్’ ఫిలింగా మహేశ్ భావిస్తుంటాడు. ఇటీవల సుకుమార్‌తో తన రెండో సినిమా కేన్సిల్ అయ్యాక క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఆ సినిమా కేన్సిల్ అయ్యిందని చెప్పిన సందర్భంలోనూ ‘1’ సినిమా తన కెరీర్లో కల్ట్ ఫిలింగా నిలిచిపోతుందని మరోసారి చెప్పాడు.
కానీ విమర్శకులు ఆ సైకాలిజకల్ యాక్షన్ థ్రిల్లర్‌ను సుకుమార్ రూపొందించిన విధానాన్ని మెచ్చుకున్నారే కానీ, దాన్ని కల్ట్ ఫిలింగా పరిగణించడం లేదు. పోనీ ఇంకెవరైనా దాన్ని అలా భావిస్తున్నారా.. అంటే అదీ కనిపించడం లేదు. మహేశ్ అభిమానులు సైతం ‘1’ను కల్ట్‌గా పరిగణిస్తున్న జాడ కనిపించడం లేదు. మరెందుకు మహేశ్ ఆ సినిమాని అంతగా ప్రేమిస్తున్నాడనే విషయం మనకు తెలీదు.
ఆ సంగతలా ఉంచితే ‘మహర్షి’ విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుకుమార్‌తో తన సినిమా ఉంటుందని చెప్పాడు కానీ, ఎప్పుడు ఉంటుందనే విషయం మహేశ్ చెప్పలేదు. ‘మహర్షి’ తర్వాత ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. దాని కంటే ముందు ఎప్పటి మాదిరిగానే ఫ్యామిలీతో హాయిగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు.
అనిల్‌తో సినిమా తర్వాత పరశురాం డైరెక్షన్లో చెయ్యడానికి మహేశ్ నిర్ణయించుకున్నాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత మహేశ్తోటే రాజమౌళి సినిమా ఉంటుందని వినిపిస్తోంది. అంటే పరశురాం సినిమా తర్వాత రాజమౌళితో మహేశ్ పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సుకుమార్‌తో మహేశ్ సినిమా ఎప్పుడుతుంటుంది? దీనికి సమాధానం మహేశ్‌కీ తెలీకపోవచ్చు.
– సజ్జా వరుణ్
‘1.. నేనొక్కడినే’ కల్ట్ మూవీయేనా? | actioncutok.com