Maharshi Review: 3 Ups And 3 Downs

Maharshi Review: 3 Ups And 3 Downs
తారాగణం: మహేశ్, పూజా హెగ్డే, అల్లరి నరేశ్, జయసుధ, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, జగపతిబాబు, అనన్య, సాయికుమార్, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, పోసాని కృష్ణమురళి
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
విడుదల తేది: 9 మే 2019
మహేశ్ హీరోగా నటిస్తోన్న 25వ సినిమాగా ‘మహర్షి’పై అంచనాలు అంబరాన్ని చుంబించాయి. బిజినెస్ వర్గాల్లో అమితమైన క్రేజ్ తీసుకొచ్చి, అత్యధిక ధరలకు అమ్ముడైన ఈ సినిమా.. థియేటర్ల విషయంలో నాన్-బాహుబలి రికార్డ్ సృష్టించిందనీ, ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదలైందనీ నిర్మాత దిల్ రాజు స్వయంగా చెప్పారు.
‘మహర్షి’తో వంశీ పైడిపల్లి టాప్ డైరెక్టర్లలో ఒకడవుతాడనీ ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. తన కెరీర్లో సంఖ్యా పరంగానే కాకుండా విషయపరంగా, కమర్షియల్‌గా మైలురాయి సినిమా అవుతుందని మహేశ్ భావోద్వేగంతో చెప్పాడు. మరి వాళ్ల మాటలకు తగ్గ స్థాయిలోనే ‘మహర్షి’ ఉన్నాడా?

కథ
సక్సెస్ అనేది ఒక గమ్యం కాదనీ, అది ఒక ప్రయాణమనీ నమ్మే రిషికుమార్ (మహేశ్) కాలేజీలో ఇంజినీరింగ్‌లో టాపర్‌గా నిలవడమే కాకుండా యు.ఎస్.కు చెందిన సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉన్న ఆరిజిన్ అనే కంపెనీకి సీఈఓగా నియమితుడవుతాడు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతను వేలకోట్లకు అధిపతి అవుతాడు.
అయితే తాను ఆ స్థితికి రావడానికి తన స్నేహితుడు రవి (అల్లరి నరేశ్) చేసిన ఒక త్యాగమని తెలుసుకొని, అతడిని వెతుక్కొంటూ గోదావరి జిల్లాలోని రామవరం గ్రామానికి వస్తాడు. అక్కడ ఒక కార్పొరేట్ కంపెనీ నుంచి తన ఊరిని కాపాడుకోవడానికి ఒంటరిగా రవి చేస్తున్న పోరాటం చూసి, అతడికి అండగా నిలుస్తాడు.
ఆ క్రమంలో 80కి పైగా ఊళ్లను కబళించాలని చూస్తున్న కార్పొరేట్ దిగ్గజం వివేక్ మిట్టల్ (జగపతిబాబు)కు శత్రువుగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రిషి కాస్తా మహర్షి ఎందుకయ్యాడు?.. అనే ప్రశ్నలకు క్లైమాక్స్ సన్నివేశాలు జవాబిస్తాయి.
కథనం
‘మహర్షి’ కోసం ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూడ్డానికి కారణం.. అది మహేశ్ 25వ సినిమా కావడం, అది మహాగొప్పగా ఉండబోతోందని ఊదరగొట్టిన ప్రచారం. ఈ సినిమా కోసం డైరెక్టర్ వంశీ తనకోసం రెండేళ్ల పాటు వేచి చూశానని మహేశ్ గొప్పగా చెప్తే, సినిమా కూడా ఎంత గొప్పగా ఉంటుందోనని ఎవరైనా అనుకోవడం సహజం.
కానీ డైరెక్టర్ వంశీ తన దర్శకత్వంతో, కథనంతో అసంతృప్తికి గురిచేశాడు. చాలా సందర్భాల్లో కథ ముందుకు కదలక అలా సా..ఆ..ఆ..ఆ.. గుతూనే ఉండి చికాకు పుట్టిస్తుంది. ఫస్టాఫ్‌కే ఒక సినిమా చూసినంత ఫీలింగ్ కలిగిందంటే కథనం పకడ్బందీగా లేదనే అర్థం. కాలేజీ సన్నివేశాలు ఆశించినంత ఆసక్తికరంగా లేవు. రిషి ఎంత ప్రతిభావంతుడో చూపించడానికి డైరెక్టర్ ఎంచుకున్న కథనం సాధారణ స్థాయిలో ఉంది. ఆ ఎపిసోడ్లో బలమైన ఉద్వేగాలు లేవు.

సెకండాఫ్‌లోనైనా కథనం ఆసక్తికరంగా సాగుతుందనుకుంటే ఒక అరగంట సేపు మనం చూస్తోంది ‘మహర్షి’ సినిమాకి సంబంధించిన సన్నివేశాలేనా.. అనే అనుమానం కలుగుతుంది.
అమెరికా నుంచి రామవరం వచ్చిన రిషి, ఆ ఊళ్లోనే తన కంపెనీ ఆఫీస్‌ను ఒక టెంట్ లాగా పెట్టడం, రిషిని కలవాలనుకొనేవాళ్లు అమెరికా నుంచి రామవరానికి వచ్చి, ఆ టెంట్లో రిషితో సమావేశమవడం, ఊళ్లోవాళ్లతో రిషి సన్నివేశాలు.. అన్నీ ఒక ఫార్సుగా అనిపిస్తాయి. కథతో ప్రేక్షకుడికి లింక్ తెంపేసిన సన్నివేశాలవి. చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంటుంది.. డైరెక్టర్‌కి ఎందుకు అర్థం కాలేదో.. మనకు అర్థం కాదు.
కాలేజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు తనను కొట్టడానికి వచ్చినవాళ్లను సునాయాసంగా మట్టికరిపించిన రిషి, తన ప్రాణ స్నేహితుడ్ని వివేక్ మిట్టల్ మనుషులు తన కళ్లముందే దారుణంగా కత్తులతో పొడిచాక కానీ వాళ్ల అంతు చూడడు. రవిని హాస్పిటల్ పాలు చెయ్యాలని ముందే ఫిక్సయిపోయినా కూడా ఆ సన్నివేశాన్ని ఇంకా ప్రభావవంతంగా చూపించవచ్చు.
రవిని దుండగులు లాక్కుపోతుంటే చూసిన మూగబ్బాయి విజిల్ వేసి రిషిని లేపుతాడు. అక్కడ నిద్రావస్థలో వందలాది మంది దీక్షాశిబిరంలోనే ఉంటారు. మూగబ్బాయి విజిల్ వాళ్లెవరికీ వినిపించలేదా? మూగబ్బాయి రిషికి మాత్రమే వినిపించేలా విజిల్ వేశాడా?
సినిమా అయిపోయాక రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ కలిగుతుందంటే కారణం.. సినిమా నిడివే. అనవసర సన్నివేశాలు, సాగతీత సన్నివేశాలు తీసివేసినట్లయితే, కథనం క్రిస్ప్‌గా ఉండేది. అప్పుడు సినిమా మరింత ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా తయారయ్యేది.
కథ దారిలోకి వచ్చింది సినిమా ముగిసే అరగంట ముందే. అప్పట్నుంచే భావోద్వేగాలు పండాయి. రిషి వ్యవసాయం నేర్చుకోవడం, అతడు ప్రెస్‌మీట్ పెట్టడం, అతడి మాటలకు ప్రేరణ చెంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వీకెండ్ పార్టీలకు బాదులు వీకెండ్ అగ్రికల్చర్ అంటూ రామవరానికి రావడం, ఎకరానికి నాలుగు లక్షలిచ్చి వాళ్ల పట్టా కాయితాల్ని తీసుకోవాలని పోసాని ప్రయత్నిస్తుంటే, రిషి ఐదు లక్షలిస్తానని రైతులకు ఆఫర్ ఇవ్వడం, వాళ్ల పొలాల్ని వాళ్లే సాగు చేసుకోవాలని నిబంధనపెట్టడంతో రైతులు పరమానందభరితులవడం.. వంటివి పండాయి.
క్లైమాక్స్ విషయంలో మాత్రం శాటిస్ఫాక్షన్ లభిస్తుంది. “హమ్మయ్య.. డైరెక్టర్ ఇక్కడైనా సక్సెసయ్యాడు” అనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల అభినయం
మహేశ్ సినిమా అంటే అతడి కోసమే సినిమా చూస్తారనేది నిజం. అందుకు తగ్గట్లే ‘మహర్షి’లో రిషికుమార్గా మహేశ్ ఉన్నత స్థాయిలో రాణించాడు. మహేశ్‌కు చాలా తక్కువ మేకప్ వేస్తే చాలు. కానీ ఇందులో ఎక్కువ మేకప్ వేశారు. పెదాలకు రంగు వేశారు.
విడుదలకు ముందు మహేశ్ మూడు ఛాయలున్న పాత్ర చేసినట్లు బిల్డప్ ఇచ్చినప్పటికీ నిజానికి ఉన్నవి రెండు ఛాయలే. ఒకటి కాలేజీ స్టూడెంట్‌గా, ఇంకొకటి కార్పొరేట్ కంపెనీ సీఈఓగా. రామవరంకు వచ్చినప్పుడు అతడి గెటప్ ఏమీ మారలేదు. తలకు గుడ్డ చుడతాడంతే. ఏదేమైనా అందం విషయంలో మహేశ్ నంబర్‌వన్. నటనపరంగానూ అతడి స్థాయి అదే.
కాలేజీలో చలాకీగా కనిపించే అతడు ఆరిజిన్ కంపెనీ సీఈఓగా డిగ్నిఫైడ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. భావోద్వేగభరిత సన్నివేశాల్లో టాప్ క్లాస్‌గా యాక్ట్ చేశాడు. తల్లిగా నటించిన జయసుధతో కలిసి చేసిన సన్నివేశాల్లో అతడు ప్రదర్శించిన అభినయం గొప్పగా ఉంది.
హీరోయిన్గా నటించిన పూజా హెగ్డేకు సానుభూతి తెలపాల్సిందే. పూజ పాత్రలో ఆమె నటనకు వంక పెట్టాల్సిన పనిలేకపోయినా, ఆమె పాత్ర తీరుకు జాలి కలుగుతుంది. ఆమె క్యారెక్టరైజేషన్లో నిలకడ లోపించింది. రిషిని ప్రేమించడం, అతడు తన లక్ష్యానికి ప్రేమ సరిపడదనగానే అతడిని వదిలి వెళ్లిపోవడం, మళ్లీ కలుసుకోవడం, మళ్లీ విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం.. ఏంటిది? అంత బలహీన వ్యక్తిత్వంతో ఆమె పాత్రను దర్శకుడు మలిచాడు.
రిషిని సరిగ్గా అర్థం చేసుకున్న పాత్రలు మనకు రెండు కనిపిస్తాయి.. ఒకటి అల్లరి నరేశ్ చేసిన రవి పాత్ర, ఇంకొకటి జయసుధ చేసిన రిషి తల్లి పాత్ర. రిషి ఏం చేసినా రవికి గొప్పే. రిషి కెరీర్ కోసం తృణప్రాయంగా తన కెరీర్‌ను త్యాగం చేసి, దానివల్ల కన్నతండ్రినే పోగొట్టుకున్న నిర్భాగ్యుడు రవిగా అల్లరి నరేశ్ బ్రహ్మాండంగా చేశాడు. మహేశ్ తర్వాత మనల్ని బాగా ఆకట్టుకొనేది నరేశే. హీరోగానే కాకుండా ఈ తరహా పాత్రలకు తను చక్కగా సరిపోతాడని మరోసారి అతను నిరూపించుకున్నాడు.
మహేశ్ తల్లి పాత్రలో జయసుధకు ఎవరు వంక పెడతారు! ఆమె పర్ఫెక్ట్ మదర్‌గా అలా ఒదిగిపోయారు. వివేక్ మిట్టల్గా ఎక్కువ నిడివి కలిగిన పాత్ర కాకపోయినా తన ఆహర్యం, నటనతో జగపతిబాబు ఎప్పటిలా ఆకట్టుకున్నారు. రిషిని అడ్మైర్ చేసే ప్రొఫెసర్ రోల్‌కు రావు రమేశ్ అతికినట్లు సరిపోయారు. ఆయన పాత్రనూ, వెన్నెల కిశోర్ పాత్రనూ సెకండాఫ్‌లో వినియోగపెట్టుకోలేదు. మూడు గంటల సినిమా తీసి కూడా కొన్ని పాత్రల్ని మధ్యలో అలా వదిలేయడం దర్శకత్వ లోపమే.
రిషి తండ్రిగా ప్రకాశ్ రాజ్‌ది అతిథి పాత్రకు ఎక్స్‌టెన్షన్‌లాగా అనిపిస్తుంది. ఉన్న కాసేపు కూడా ఆయనకు ఒక పేజీకి మించి డైలాగ్స్ లేవు. సాయికుమార్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, అనన్య (నరేశ్ మరదలు) పాత్రోచితంగా నటించారు. రామవరంలో మహేశ్‌కు వ్యవసాయం నేర్పే ముసలి రైతుగా చేసిన నటుడు అతికినట్లు ఆ పాత్రకు సరిపోయాడు.
రిషి అసిస్టెంట్‌గా శ్రీనివాసరెడ్డికి నటించడానికి అవకాశం కలగలేదు. ముఖ్యమంత్రిగా నాజర్, ఎంపీగా పోసాని సరిపోయారు.

సాంకేతిక అంశాలు
టెక్నికల్ అంశాల్లో మొదట చెప్పుకోవాల్సింది కె.యు. మోహనన్ అసమాన సినిమాటోగ్రఫీని. సినిమాటోగ్రాఫర్‌గా ఆయన స్థాయి ఏమిటో చెప్పే సినిమాల్లో ‘మహర్షి’ ఒకటి. కథతో పాటు ఆయన కెమెరా ప్రయాణించింది. క్లోజప్ షాట్లతో పాటు, లాంగ్ షాట్లను ఆయన కెమెరా చూపించిన విధానం ఆకట్టుకుంది.
సాధారణంగా తన సంగీతంతో ఆకట్టుకొనే దేవి శ్రీప్రసాద్ ఈ సినిమాలో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఫస్టాఫ్‌లో వచ్చిన మూడు పాటలూ అలరించలేదు. ‘పదర పదర పదరా’, ‘మనుష్యులందు నీ కథ..’ పాటల్లోనే బాణీలు ఆకట్టుకున్నాయి. శ్రీమణి సాహిత్యం బాగుంది. పాటల కంటే దేవి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బెటర్.
ఎక్కువగా తప్పు పట్టాల్సింది ఎడిటర్‌నే. స్వతహాగా సమర్థుడైన ప్రవీణ్ కె.ఎల్. ఈ సినిమాకి ఎడిటర్‌గా న్యాయం చెయ్యలేకపోయాడు. దర్శకుడ్ని కన్విన్స్ చేయి, అనవసర, సాగతీత సన్నివేశాల్ని తొలగించలేకపోయాడు. ఆర్ట్ డైరెక్షన్ వర్క్ బాగానే ఉంది.
చివరి మాట
కథనంలో బిగువు లేని, కొత్తగా చెప్పుకోడానికి ఏమీ లేని ఒక హై ఫై ‘మహర్షి’ కథ.
– బుద్ధి యజ్ఞమూర్తి
Maharshi Review: 3 Ups And 3 Downs | actioncutok.com
Trending now: