‘ఎంసీఏ’, ‘నేను లోకల్’ కంటే ‘జెర్సీ’ది వెనుకంజే!


'ఎంసీఏ', 'నేను లోకల్' కంటే 'జెర్సీ'ది వెనుకంజే!

‘ఎంసీఏ’, ‘నేను లోకల్’ కంటే ‘జెర్సీ’ది వెనుకంజే!

నాని హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘జెర్సీ’ ప్రశంసల జల్లులో తడిసి ముద్దయింది. నటుడిగా నాని ఎన్నో మెట్లు ఎక్కాడనే కితాబు అందుకున్నాడు. మొదటి రోజు మొదటి ఆట నుంచే మౌత్ టాక్ అదిరింది. దాంతో బాక్సాఫీస్ వద్ద ‘జెర్సీ’ అద్భుతాలు సృష్టిస్తుందని చాలామంది భావించారు. క్రికెటర్ అర్జున్‌గా నాని సంచలనాలు సృష్టిస్తాడని అనుకున్నారు.

రెండు వారాలు గడిచాయి. వరల్డ్‌వైడ్‌గా ‘జెర్సీ’ రూ. 26 కోట్ల షేర్‌నే సాధించాడనే వార్తలు విశ్లేషకుల్ని ఆశ్చర్యపరిచాయి. ఫిలింనగర్ వర్గాలు కూడా సినిమా టాక్‌కీ, వసూళ్లకీ పొంతన లేదేమిటని విస్తుపోయాయి. ఇప్పటివరకు నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’. ఆ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 40 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 33 కోట్లను రాబట్టింది.

దాని వసూళ్లకు ‘జెర్సీ’ సుదూరంగా నిలిచిపోయింది. ‘నేను లోకల్’ వసూళ్లను కూడా అది అందుకోలేదని స్పష్టమైంది. ‘నేను లోకల్’ వరల్డ్ వైడ్‌గా రూ. 32 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 26 కోట్లు రాబట్టింది. ఆ వసూళ్లు కూడా ‘జెర్సీ’ని దగ్గరకు రానివ్వవని తేలిపోయింది.

ఏతావాతా ‘నిన్ను కోరి’ వసూళ్లను ఆ సినిమా చేరుకోవచ్చేమోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘నిన్ను కోరి’ ప్రపంచవ్యాప్తంగా రూ. 28.85 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 22.25 కోట్లు వసూలు చేసింది. అంటే ‘జెర్సీ’ ఇంకో రూ. 3 కోట్లను సాధిస్తేనే ‘నిన్ను కోరి’ వసూళ్లను దాటుతుంది. తెలుగు రాష్ట్రాల వసూళ్లను మాత్రం అది అందుకోలేదు.

ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ‘జెర్సీ’ వసూలు చేసింది రూ. 18 కోట్లే! అయితే ఇంకా రూ. 3 కోట్లను సాధించే సత్తా ఆ సినిమాకు ఉందా అనేది అనుమానం. ఎందుకంటే బాక్సాఫీస్ వద్ద దాని పరుగు బాగా నెమ్మదించింది. మే 9న ‘మహర్షి’ సినిమా వచ్చాక, థియేటర్లలో ‘జెర్సీ’ కనిపించడం కూడా కష్టమే. మహా అయితే అది ఇంకో కోటి రూపాయల్ని వసూలు చేయవచ్చని అంచనా.

ఆ సినిమాకు ఎక్కువ వసూళ్లు యు.ఎస్. మార్కెట్ నుంచే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘కాంచన 3’, ‘అవెంజర్స్: ఎండ్‌గేం’, యు.ఎస్.లో ‘అవెంజర్స్: ఎండ్‌గేం’ సినిమాలు ‘జెర్సీ’ వసూళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. లేదంటే ‘జెర్సీ’ సునాయాసంగా రూ. 35 కోట్లను వసూలు చేసి ఉండేదనేది ట్రేడ్ విశ్లేషకుల అంచనా.

ఒక వారం ముందే విడుదలైనట్లయితే ఆ వసూళ్లను అది చేరుకునేదని వాళ్లంటున్నారు. ‘అవెంజర్స్: ఎండ్‌గేం’ వంటి మాన్‌స్టర్ మూవీ వస్తుందని తెలిసి కూడా దానికి ఒక వారం ముందుగా విడుదల చెయ్యడం నిర్మాతలు చేసిన పొరపాటని అంటున్నారు. ఆ సినిమానే కాకుండా అనూహ్యంగా ‘జెర్సీ’ని బి, సి సెంటర్లలో ‘కాంచన 3’ తీవ్రంగా దెబ్బకొట్టింది.

  • సజ్జా వరుణ్

‘ఎంసీఏ’, ‘నేను లోకల్’ కంటే ‘జెర్సీ’ది వెనుకంజే! | actioncutok.com

Trending now: