నాగ్ వర్సెస్ నాని.. బాక్సాఫీస్ వార్ తప్పదా?

నాగ్ వర్సెస్ నాని.. బాక్సాఫీస్ వార్ తప్పదా?
చిత్ర పరిశ్రమ అంటేనే.. చిత్రవిచిత్రాలకు నెలవు. ఒకసారి కలసి పనిచేసిన వాళ్ళే.. మరోసారి పోటాపోటీగా బరిలోకి దిగుతుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే.. రెండు తరాలకు చెందిన కథానాయకులు నాగార్జున, నాని విషయంలో చోటు చేసుకోనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. గత ఏడాది సెప్లెంబర్లో విడుదలైన మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’లో నాగ్, నాని కలసి నటించిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే.. ఈ సంవత్సరం ఈ ఇద్దరూ ఒకే రోజున తమ కొత్త చిత్రాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారని సమాచారం.
‘జెర్సీ’ తరువాత నాని నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ ఆగస్టు 15న విడుదల కానుండడంతో.. ఆగస్టు 29న ‘గ్యాంగ్ లీడర్’ని రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోందట. ఇప్పుడు సరిగ్గా అదే రోజున నాగ్ కొత్త చిత్రం ‘మన్మథుడు 2’ రావచ్చని అంటున్నారు.
వాస్తవానికి.. ‘మన్మథుడు 2’ రిలీజ్ డేట్పై ఇప్పటివరకు యూనిట్ క్లారిటీ ఇవ్వకపోయినా.. రకరకాల వార్తలు వినిపించాయి. దసరా సీజన్లో వస్తుందని కొందరంటే.. లేదు ఆగస్టు నెలలో వస్తుందని మరికొందరు.. మెరుపు వేగంతో చిత్రీకరణ జరుగుతోంది కాబట్టి జూలై నెలలోనే రావచ్చని ఇంకొందరు కథనాలు అల్లేస్తున్నారు. తాజా సమాచారం ఏమిటంటే.. నాగ్ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న రెండో ‘మన్మథుడు’ వస్తాడని టాక్.
అదే జరిగితే.. నాగ్, నానికి మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదన్నమాట. చూద్దాం.. ఏం జరుగుతుందో?!
నాగ్ వర్సెస్ నాని.. బాక్సాఫీస్ వార్ తప్పదా? | actioncutok.com
Trending now: