సారీ రవీనా!


సారీ రవీనా!
Raashi Khanna

సినీ తారలు.. అందునా హీరోయిన్లు తమకంటే హోదాలో తక్కువ ఉండేవాళ్లకు సారీ చెబుతారా? చెప్పరనే అనుకుంటారు ఎవరైనా. కానీ రాశీ ఖన్నా అందుకు భిన్నం. ఒక డబ్బింగ్ ఆర్టిస్టుకు సారీ చెప్పి తన మనస్తత్వం ఎలాంటిదో చెప్పకనే చెప్పింది. ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ పేరు రవీనా. విశాల్ హీరోగా నటించిన ‘అయోగ్య’ సినిమాలో నాయికగా నటించిన రాశీకి రవీనా డబ్బింగ్ చెప్పింది.

అయితే ఇటీవల విడుదలైన ఆ సినిమా క్రెడిట్స్‌లో డబ్బింగ్ ఆర్టిస్టులకు చోటు కల్పించలేదు. దీనికి తన ట్విట్టర్ పేజీ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేసింది రవీనా. “సినిమాకి పనిచేసిన డ్రైవర్లు, పెయింటర్లు, కార్పెంటరు, సౌండ్ ఇంజినీర్లు వంటివాళ్ల పేర్లు టైటిల్ క్రెడిట్‌లో ఇచ్చినందకు ఆనందకరం. కానీ మా డబ్బింగ్ విభాగానికి అందులో చోటు కల్పించకపోవడం బాధ కలిగిస్తోంది” అని ఆమె ట్వీట్ చేసింది.

ఇది రాశీ ఖన్నా దృష్టికి వచ్చింది. ఆమె “మిమ్మల్ని గుర్తించనందుకు సారీ రవీనా. నీ చక్కని గొంతును అరువిచ్చి నా పాత్ర అందంగా రావడంలో పాలు పంచుకున్నందుకు థాంక్స్” అని స్పందించింది. రాశీ స్పందనకు ప్రతిస్పందించిన రవీనా “థాంక్స్ రాశీ. మీరు సారీ చెప్పాల్సిన పనిలేదు. ఇది మీ తప్పు కాదుగా. మీకు డబ్బింగ్ చెప్పినందుకు చాలా అనందంగా ఉంది” అని పోస్ట్ చేసింది.

మొత్తానికి ఈ విషయంలో రాశీ స్పందనను అందరూ అభినందిస్తున్నారు. మంచి మనసుంటేనే ఇలా సారీ చెప్తారని వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.

More for you: