అన్నింటా గురువుతోటే పోటీ!


అన్నింటా గురువుతోటే పోటీ!
Raghava Lawrence

అన్నింటా గురువుతోటే పోటీ!

రాఘవ లారెన్స్ ఇప్పుడు హిందీ చిత్రసీమలో డైరెక్టర్‌గా అడుగుపెట్టాడు. తొలి సినిమాలోనే అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాల్ని డైరెక్ట్ చేస్తున్నాడు. లారెన్స్ కంటే పేరుపొందిన దర్శకులు ఎంతోమంది ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ ఉన్నారు. వాళ్లెవరూ సాధించలేనిది, కనీసం ఆలోచించనిది లారెన్స్ సాధించాడు. అతడికి అదెలా సాధ్యమైంది?

వృత్తిపరంగా లారెన్స్‌కు మార్గదర్శకుడు ప్రభుదేవా. కొరియోగ్రాఫర్‌గా లారెన్స్ గురువు అతడే. వృత్తిపరంగా లారెన్స్‌కు పోటీ ప్రభుదేవా! అవును. ఇది కూడా నిజం.

ప్రభుదేవా ఏ అడుగేస్తే లారెన్స్ కూడా పట్టుదలగా ఆ అడుగే వేస్తూ వస్తున్నాడు, సక్సెసవుతున్నాడు కూడా. డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్‌గా మారి చిరంజీవితో వీణ స్టెప్ వేయించడం ద్వారా సంచలనాలు సృష్టించాడు లారెన్స్. ప్రభుదేవాను డైరెక్టర్ శంకర్ ‘ప్రేమికుడు’తో హీరోగా చేశాక, తానూ హీరోనవ్వాలని కృషి చేసి, తెలుగు సినిమా ‘స్పీడ్ డాన్సర్’తో హీరో అయ్యాడు.

అయితే హీరోగా ప్రభుదేవాలా సంచలనం సృష్టించలేకపోయాడు. అయినా హీరోగా నటిస్తూ వచ్చాడు. హీరోగా డిమాండ్ తగ్గాక తెలుగు సినిమా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో డైరెక్టర్‌గా అవతారమెత్తి ఘన విజయం సాధించాడు ప్రభుదేవా. దాంతో తానూ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు లారెన్స్.

నాగార్జున అతనికి తొలి అవకాశమిచ్చాడు. అలా ‘మాస్’తో డైరెక్టరై, హిట్ కొట్టాడు లారెన్స్. అంతే కాదు, డైరెక్టర్‌గా తన తర్వాతి సినిమా ‘స్టైల్’లో తనే హీరోగా నటించి, ప్రభుదేవాను అందులో తన గురువుగా నటింపజేసి, తన ప్రత్యేకత చాటుకున్నాడు.

తర్వాత ప్రభుదేవా డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టి తొలి సినిమా ‘వాంటెడ్’ (‘పోకిరి’ రీమేక్)లో టాప్ హీరో సల్మాన్ ఖాన్‌ను డైరెక్ట్ చేసి, పెద్ద హిట్ కొట్టాడు. అప్పట్నుంచీ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాలని కంకణం కట్టుకున్నాడు లారెన్స్.

అందుకు మార్గం ఏర్పరచింది అతడు తీసిన ‘ముని’ సిరీస్. ఒక ఫ్రాంచైజీలాగా అతడు ఒక దాని తర్వాత ఒకటిగా ఇప్పటికి నాలుగు సినిమాలు తీసి, ఘన విజయాలు సాధించాడు లారెన్స్. పైగా వాటిలో అతడే హీరో. ఆ ఫ్రాంచైజీ బాలీవుడ్‌ని ఆకర్షించింది. సిరీస్‌లోని రెండో సినిమా ‘కాంచన’ను చూసిన అక్షయ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

దాంతో ‘కాంచన’ను హిందీలో ‘లాక్ష్మీబాంబ్’ పేరుతో ఇటీవలే మొదలుపెట్టాడు లారెన్స్. అలా తన మరో ఆశయాన్ని నెరవేర్చుకుంటున్నాడు. పైగా అదే సినిమాలో అమితాబ్‌ను సైతం డైరెక్ట్ చేసే అవకాశం రావడం లారెన్స్‌కు డబుల్ బొనాంజా లాంటిది. ‘కాంచన’లో శరత్‌కుమార్ చేసిన హిజ్రా కేరెక్టర్‌ను బిగ్ బి చేస్తున్నాడు.

సందర్భవశాత్తూ ప్రభుదేవా ఇప్పుడు మరోసారి సల్మాన్‌ను డైరెక్ట్ చేస్తూ ‘దబాంగ్ 3’ని రూపొందిస్తున్నాడు. అంటే గురుశిష్యులిద్దరూ ఇప్పుడు బాలీవుడ్ హీరోలతో సినిమాలు తీస్తున్నారన్న మాట.

ఇలా ప్రభుదేవా అడుగుజాడల్లో నడుస్తూ గురువుకు తగ్గ శిష్యుడిగా, కొండొకచో గురువును మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు లారెన్స్.

  • వనమాలి

అన్నింటా గురువుతోటే పోటీ! | actioncutok.com

Trending now: