క్రైం: ఖరీదైన దొంగ!

క్రైం: ఖరీదైన దొంగ!
చెన్నై: కేరళకు చెందిన సాహుల్ అమీద్(39) ఓ ఖరీదైన దొంగ. మలేసియాలో కుటుంబంతో ఉంటున్నాడు. అక్కడి నుంచి విమానంలో చెన్నై చేరుకుంటాడు. ఆరు భాషలు మాట్లాడే ఇతగాడు ముందుగానే ఏసీ బోగీల్లో సీటు రిజర్వేషన్ చేయించుకుంటాడు. ఆపై తన చేతివాటం ప్రదర్శిస్తాడు. ఇలా 2016 నుంచి యథేచ్ఛగా దొంగతనాలు చేస్తున్నాడు. చోరీ చేసిన నగలను తిరుచూర్, ముంబయిలో అమ్మేస్తాడు.
అలా సంపాదించిన డబ్బుతో మలేసియాలో ఓ హోటల్ నడుపుతున్నాడు. ఈ దొంగ ఎలా దొరికిపోయాడంటే.. చెన్నై నుంచి సేలం వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లలో రాత్రి వేళ వరుసగా చోరీలు జరుగుతున్నట్లు పలువురు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందటంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
బృందంలోని ఓ మహిళా పోలీసుతో కలిసి దంపతుల తరహాలో ఒకరు, వారిని అనుసరిస్తూ మిగిలిన సభ్యులు రైలులో నిఘా పెట్టారు. ఈ క్రమంలో చెన్నై నుంచి వెళ్తున్న ఓ రైలులో ప్రయాణికుడి బ్యాగును తీసుకొని అర్ధరాత్రి పారిపోవడానికి ఓ దుండగుడు యత్నించాడు. మారువేషంలో ఉన్న పోలీసులు అతగాణ్ని పట్టుకొన్నారు. అతడే ఖరీదైన దొంగ సాహుల్ అమీద్.
ఇతడికి ఇద్దరు భార్యలున్నారని, నాగపూర్లో మహిళలపై అత్యాచారం చేసినట్లు ఇతగాడిపై కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని పలువురిని మోసం చేశాడని తెలిపారు. సాహుల్ అమీద్ నుంచి 110 సవర్ల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
క్రైం: ఖరీదైన దొంగ! |actioncutok.com
More for you: