బర్త్‌డే స్పెషల్: ఆర్ ఆర్ ఆర్.. జూనియర్‌కు కీలకం!

బర్త్‌డే స్పెషల్: ఆర్ ఆర్ ఆర్.. జూనియర్‌కు కీలకం!
రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ కేరెక్టర్ ఎలా ఉండబోతోంది? ఇది ఇప్పుడు సినిమా ప్రియుల్లో, అతని అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్న విషయం. కావాల్సినంత ప్రతిభ ఉన్నా, ఎంచుకుంటున్న కథల కారణంగా అగ్ర హీరో రేసు నుండి ఎన్టీఆర్ కాస్త దూరం జరిగిపోయాడనేది విశ్లేషకుల అభిప్రాయం. ‘ఆది’, ‘సింహాద్రి’ సినిమాలతో అతను టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అవుతాడని అప్పట్లో అంచనాలు వేశారు.
కానీ ఆ తర్వాత అతను అనూహ్యంగా వెనకపడిపోయాడు. ‘సింహాద్రి’ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించిన సినిమా చాలా కాలం దాకా అతని నుంచి రాలేదు. ‘యమదొంగ’, ‘అదుర్స్’, ‘బృందావనం’, ‘బాద్షా’, ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలు ఆశలు కల్పించాయి కానీ అతని ఇమేజ్ను పెంచలేకపోయాయి. మొన్న వచ్చిన ‘జనతా గారేజ్’ జూనియర్ దాహార్తిని తీర్చింది. ‘సింహాద్రి’ తర్వాత మళ్లీ ఆ స్థాయి బ్లాక్‌బస్టర్‌ను చూశానని అతనే స్వయంగా ప్రకటించాడు.
బాబీ డైరెక్షన్లో వచ్చిన ‘జై లవ కుశ’ సినిమా జూనియర్ నటనా వైదుష్యానికి నిదర్శనంగా నిలిచింది. బాక్సాఫీస్ విజయాన్ని పక్కన పెట్టినా ‘జై’ కేరెక్టర్లో విలన్‌గా చెలరేగిపోయాడు. ఈ సినిమాతో సమకాలీన హీరోల్లో విలక్షణ నటుడిగా నిరూపించుకున్నాడు జూనియర్.
ఆ సినిమా తర్వాత త్రివిక్రం డైరెక్షన్లో జూనియర్ చేసిన ‘అరవింద సమేత’ అతని కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది కానీ కొన్ని ఏరియాల్లో బ్రేకీవెన్ సాధించలేకపోయింది. పైగా ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తీవ్ర విమర్శల పాలయ్యాయి.
ఇలాంటి నేపథ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. పైగా ఇంకో హీరోతో స్క్రీన్ పంచుకుంటున్నాడు. ఆ హీరో రాంచరణ్. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తుంటే కొమరం భీం కేరెక్టర్‌ను జూనియర్ చేస్తున్నాడు. ఆ పాత్రను రాజమౌళి ఎలా రూపొందిస్తున్నాడనేది ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇద్దరు హీరోల సినిమా అంటే, అదీ సమ ఉజ్జీల్లాంటి హీరోల సినిమా అంటే వాళ్ల అభిమానులు ఒకరి పాత్రతో మరొకరి పాత్రను పోల్చి చూడటం సహజం. తమ హీరో కేరెక్టర్ గొప్పగా ఉందంటే, తమ హీరో కేరెక్టరే గొప్పగా ఉందని సోషల్ మీడియాగా వార్ జరగడం తథ్యం. ఈ నేపథ్యంలో రాజమౌళిపై ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. జూనియర్ కేరెక్టర్‌ను ఎంత ఎమోషనల్‌గా, ఎంత ఎనర్జిటిక్‌గా ఆయన మలుస్తున్నాడనే విషయంపైనే ఇప్పుడందరి దృష్టి.
(నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు)
– వనమాలి
బర్త్‌డే స్పెషల్: ఆర్ ఆర్ ఆర్.. జూనియర్‌కు కీలకం! | actioncutok.com