మళ్లీ టబు వెంటపడుతున్నారు!

మళ్లీ టబు వెంటపడుతున్నారు!
తెలుగులో టబు చివరిసారిగా నటించి పదకొండేళ్లయింది. 2008లో ఆమె చంద్రసిద్ధార్థ్ డైరెక్షన్లో ‘ఇదీ సంగతి’, రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పాండురంగడు’ సినిమాలు చేశారు. ఒకప్పుడు హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో ఆమె క్రేజీ హీరోయిన్ అనే విషయం తెలిసిందే.
‘కూలీ నం.1’తో తెలుగులో నాయికగా అడుగుపెట్టిన ఆమెకు తమిళం నుంచి తెలుగులో డబ్ అయిన ‘ప్రేమదేశం’ తెచ్చిన ఖ్యాతి ఏమిటో తెలిసిందే. యువత ఆరాధ్య తారగా మారిపోయింది. ఇక నాగార్జునతో చేసిన ‘నిన్నే పెళ్లాడతా’ ఆ క్రేజ్‌ను మరింత పెంచింది.
ఆ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే తెలుగులో నటిస్తూ వచ్చిన ఆమె హిందీ సినిమాలకే ఎక్కువ ప్రాధ్యాన్యం ఇస్తూ వచ్చారు. వయసు రీత్యా నాయిక పాత్రలు కాకపోయినా ప్రాధ్యాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తన ఉనికిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ తెలుగు చిత్రసీమ ఆమెవైపు దృష్టి సారించింది. అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ఇందులో ఆమె బన్నీకి తల్లిగా కనిపిస్తారని వినిపిస్తోంది. అదే నిజమైతే టాలీవుడ్లో తొలిసారి హీరో తల్లిగా నటిస్తున్నట్లవుతుంది. ఆ పాత్రకు ప్రాధాన్యం ఉండటం వల్లే ఆమె ఒప్పుకున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేం వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ‘విరాటపర్వం 1992’లో టబు చేయనున్నారని వెల్లడైంది. రానా, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. సో.. టబు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లే కనిపిస్తోంది.
ఇలా టాలీవుడ్ ఆమె వెంటపడుతుంటే, ఆమె కూడా హైదరాబాద్‌తో ఎన్నాళ్లనుంచో ఉన్న అనుబంధాన్ని కంటిన్యూ చేస్తోందన్న మాట.
మళ్లీ టబు వెంటపడుతున్నారు! | actioncutok.com
Trending now: