టీవీ9 రవిప్రకాశ్ విషయంలో జరుగుతున్నదదే!


టీవీ9 సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీ, మరికొంత మంది కలిసి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, తప్పుడు పత్రాలు సృషించారని టీవీ9లో అతిపెద్ద వాటాదారు అయిన పి. కౌశిక్ రావు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీవీ9 రవిప్రకాశ్ విషయంలో జరుగుతున్నదదే!
Ravi Prakash

టీవీ9 రవిప్రకాశ్ విషయంలో జరుగుతున్నదదే!

ప్రచారంలో ఉన్నట్లే టీవీ9 వ్యవస్థాపకుడు, దాని సీఈవో రవిప్రకాశ్ ఉద్వాసనకు రంగం సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. ఆయన ఫోర్జరీకి పాల్పడ్డారనీ, కంపెనీ ప్రమోటర్ల విధులకు ఆటంకం కలిగిస్తున్నారనీ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం సైబరాబాద్ పోలీసులు రవిప్రకాశ్ ఇంటితో పాటు, టీవీ9 ఆఫీసు, మరికొంతమంది ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీ, ఇతరులు కలిసి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, తాను నలుగురు కొత్త డైరెక్టర్ల నియామకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బోర్డుకు లెటర్ రాశారని అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పి. కౌశిక్ రావు ఏప్రిల్ 24న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీవీ9ను నడిపిస్తున్న ఏబీసీపీఎల్ కంపెనీలో కౌశిక్‌కు 90 శాతం వాటా ఉంది. ఆయన ఫిర్యాదును ఆధారం చేసుకొని రవిప్రకాశ్, శివాజీ, ఇతరులపై ఐపీసీ, ఐటీ చట్టాల కింద రెండు కేసులను నమోదు చేశారు. ఏబీసీపీఎల్‌లో శివాజీకి రూ. 40 లక్షల విలువ చేసే షేర్లు ఉన్నాయని సమాచారం.

మోసపూరిత ఉద్దేశంతో రవిప్రకాశ్‌తో కలిసి శివాజీ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, రవిప్రకాశ్‌తో షేర్ల కొనుగోలు ఒప్పందంలోకి అడుగుపెట్టాడని తన ఫిర్యాదులో కౌశిక్ ఆరోపించారు. అంతేకాకుండా కంపెనీకి చెందిన ‘కాన్ఫిడెన్షియల్’ డేటాను ఎవరో చోరీచేసి, సంస్థకు నష్టాలు చేకూర్చేలా బయటి వ్యక్తులకు వాటిని అందజేసినట్లు అనుమానం కలుగుతోందని కూడా ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు.

టీవీ9 వ్యవస్థాపకుడైన రవిప్రకాశ్‌కు సంస్థలో 8 శాతం వాటా ఉంది. న్యూస్ చానల్ నిర్వహణ విషయంలో కౌశిక్‌తో ఆయనకు విభేదాలు తలెత్తాయని కొంత కాలంగా ప్రచారం నడుస్తోంది. గురువారం సాయంత్రం టీవీ9 తెరపై ప్రత్యక్షమైన రవిప్రకాశ్ తాను పరారీలో ఉన్నానని వస్తున్న వదంతులు కొట్టివేశారు. పోలీసులు తనను అరెస్ట్ చేయనున్నారనే వార్తల్నీ ఖండించారు.

“ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టి)లో ఉంది. మే 16న విచారణకు వస్తోంది. ఈలోగా కొంతమంది నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు” అని ఆయన చెప్పారు.

టీవీ9 రవిప్రకాశ్ విషయంలో జరుగుతున్నదదే! | actioncutok.com