జగన్‌కు మోదీ హామీ ఇచ్చారు!

జగన్‌కు మోదీ హామీ ఇచ్చారు!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోసారి ప్రధాని పదవిని చేపట్టనున్న నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. జగన్ ను మోదీ ఆలింగనం చేసుకుని భుజం తట్టి అభినందించారు. గంటకు పైగా సాగిన ఈ భేటీలో జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భేటీపై మోదీ ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ..
“ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అద్భుతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను” అని తెలిపారు. అనంతరం జగన్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు.

ఈ సమావేశం తరువాత జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మోదీతో చర్చించానని, ఈ భేటీ ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. తన తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పరిపాలనలో అసలు జోక్యం చేసుకోలేదని, ఒక్కసారి కూడా సచివాలయంలో అడుగు పెట్టలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితిని సమీక్షించి మళ్లీ టెండర్లు పిలవాలంటే పిలుస్తామని, అవసరమైతే కేంద్రం జోక్యం కోరుతామని జగన్ అన్నారు.

ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదనే 14వ ఆర్థిక సంఘం వాదన సరికాదని, రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్ పేర్కొన్నారు. ఏపీలో చాలా కుంభకోణాలు జరిగాయని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతి చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసి తర్వాత రాజధాని ప్రకటించారని జగన్ ఆరోపించారు.
ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని మండిపడ్డారు. తన మీద ఉన్న కేసులన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని జగన్ అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తనపై కేసులు లేవని, కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాక కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు.

జగన్‌కు మోదీ హామీ ఇచ్చారు! | actioncutok.com
More for you: