‘అర్జున్‌రెడ్డి’కి ప్లస్సయింది.. ‘కబీర్ సింగ్’కు మైనస్సవుతుందా?


'అర్జున్‌రెడ్డి'కి ప్లస్సయింది.. 'కబీర్ సింగ్'కు మైనస్సవుతుందా?

‘అర్జున్‌రెడ్డి’కి ప్లస్సయింది.. ‘కబీర్ సింగ్’కు మైనస్సవుతుందా?

‘అర్జున్‌రెడ్డి’గా విజయ దేవరకొండ సెన్సేషన్ సృష్టించాడు. సంప్రదాయవాదులు ఆ సినిమాలోని బోల్డ్‌నెస్ చూసి గుండెలు బాదుకున్నా, యువతరం మాత్రం ఆ సినిమాని సూపర్ హిట్ చేసేశారు. వసూళ్లను మించి ఆ సినిమా వార్తల్లో నిలిచింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక యువ డాక్టర్ జీవితంలో ఎలా దెబ్బతిన్నాడు, వ్యసనాలకు ఎలా బానిసయ్యాడు, చివరకు అతడి జీవితం ఎలా సుఖాంతమయ్యిందనే కథ ‘అర్జున్‌రెడ్డి’.

ఆ సినిమా వెనుక ఉన్న వ్యక్తి సందీప్‌రెడ్డి వంగా. అప్పటి దాకా సందీప్‌రెడ్డి ఎవరో సినీ ప్రియులకు తెలీదు. ఆ ఒకే ఒక్క సినిమాతో అతను డైరెక్టర్‌గా ఫేమస్ అయిపోయాడు. ఎంత ఫేమస్ అంటే సూపర్‌స్టార్ మహేశ్‌ని కలిసి కథ చెప్పేంతగా. అయితే అదింకా వర్కవుట్ అవకపోవడం వేరే విషయం.

‘అర్జున్‌రెడ్డి’ సినిమా తెలుగునాటనే కాకుండా తమిళ, హిందీ రంగాలవారినీ ఆకట్టుకొని, ఆ భాషల్లో రీమేక్స్ తీయిస్తోంది. హిందీ రీమేక్‌ను స్వయంగా సందీప్‌రెడ్డే డైరెక్ట్ చేశాడు. ఒక తెలుగు దర్శకుడు తొలి సినిమాని తెలుగులో తీసి, వెంటనే దాని రీమేక్‌ను హిందీలో తియ్యడం అరుదైన విషయం. ఆ ఘనతను సాధించాడు సందీప్‌రెడ్డి. అతను రూపొందించిన ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ జూన్ 21న విడుదలకు సిద్ధమవుతోంది.

జూన్ 4న రిలీజ్ చేసిన పోస్టర్ బాలీవుడ్‌లోనూ చర్చకు దారి తీసింది. నాయిక కియారా అద్వానీని షాహిద్ కపూర్ గాఢంగా పెదాలతో పెదాలు కలిపి చుంబిస్తున్న ఆ పోస్టర్ వల్గారిటీగా ఉందనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. తెలుగులో విజయ్, షాలినీ పాండే ఇద్దరూ కుర్రాళ్లే కావడం వల్ల అదే రకమైన పోస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ 38 ఏళ్ల షాహిద్, 26 ఏళ్ల కియారా మధ్య ఆ పెదాల చుంబనం ఆక్వార్డ్‌గా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇది సినిమాపై నెగటివ్ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ చేసినప్పుడు విజయ్‌కు హీరోగా ఇమేజ్ లేదు. అందువల్లే ఆ సినిమా అంత సెన్సేషనల్ హిట్టయ్యిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అదే షాహిద్ విషయానికి వస్తే.. అతను సీనియర్ హీరో. అతనికంటూ ఒక ఇమేజ్ ఉంది. అందువల్ల ‘కబీర్ సింగ్’ పాత్రలో అతడిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే అనుమానాల్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. షాహిద్ ఇమేజ్ ఆ కేరెక్టర్‌కు మైనస్ అయితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కూడా వాళ్లు అంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో..

– సజ్జా వరుణ్

‘అర్జున్‌రెడ్డి’కి ప్లస్సయింది.. ‘కబీర్ సింగ్’కు మైనస్సవుతుందా? | actioncutok.com

More for you: