Game Over Review: 1 Up and 4 Downs


– వనమాలి
Game Over Review: 1 Up and 4 Downs

బుర్ర చెడగొట్టే ‘గేమ్ ఓవర్’

తారాగణం: తాప్సీ

దర్శకుడు: అశ్విన్ శరవణన్

విడుదల తేదీ: 14 జూన్ 2019

తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన ‘గేమ్ ఓవర్’ సినిమా శుక్రవారం విడుదలైంది. బాలీవుడ్‌లో అర్థవంతమైన సినిమాలు, నాయిక ప్రధాన పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న తాప్సీ సినిమా కావడం, అది కూడా ఇదివరకు నయనతారతో ‘మయూరి’ వంటి థ్రిల్లర్ తీసిన డైరెక్టర్ అశ్విన్ శరవణన్ సినిమా కావడంతో ఒక మంచి సినిమా అనుభవం కలుగుతుందనే ఉద్దేశంతో వెళ్లిన ప్రేక్షకులకు ‘గేమ్ ఓవర్’ షాకిచ్చింది. అర్థం లేని కథా కథనాలతో తలబొప్పి కట్టింది.

ఇంటర్వెల్‌లో ‘గేమ్ ఆన్’ అని వేశారు కానీ అప్పటికే గేమ్ ఓవర్ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. చేతికి ‘ఇమ్మోర్టల్ టాట్టూ’ వేయించుకున్న స్వప్న (తాప్సీ)కి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి, అవి థ్రిల్‌ని కలిగిస్తాయనుకుంటే.. ఆ అభిప్రాయానికి పూర్తి విరుద్ధమైన అనుభవాన్ని.. అంటే టార్చర్‌ని కలిగించింది సినిమా.

కేన్సర్‌ని మూడు సార్లు జయించిన ఒక యువతిని ఎవరో తల నరికి హత్య చేస్తారు. ఆమె అస్థికలతో టాట్టూ వేయించుకొని తన కూతుర్ని శాశ్వతంగా తన శరీరంలో ఒక భాగంగా చేసుకోవాలని ఆమె తల్లి ఆశిస్తుంది. కానీ టాట్టూలు వేసే యువతి ఆ అస్థికలు కలిపిన ఇంక్‌తో తల్లికి బదులు స్వప్నకి టాట్టూ వేస్తుంది. దాంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది.

కేన్సర్‌ను జయించిన యువతిని పొట్టనబెట్టుకున్న మిస్టరీ కిల్లర్స్ స్వప్నను చంపడానికి ప్రయత్నించడం, తన పనిమనిషి సాయంతో స్వప్న ముగ్గురు మిస్టరీ కిల్లర్స్‌ని ఎలా చంపిందనేది కథ. పుర్రె మాస్క్ వేసుకొని ఉండే ఆ మిస్టరీ కిల్లర్స్ ఎవరో ఆఖర్లో కూడా తెలీకపోవడం, జరుగుతున్నది వాస్తవమేనని అనుకొనేంతలో అది స్వప్నకు వచ్చిన కలగా చూపించడం.. ఈ తంతు ఒకటికి మూడు సార్లు రావడం చికాకు కలిగిస్తుంది.

స్వప్న పాత్రలో మేకప్ లేకుండా.. లేదూ. అతి తక్కువ మేకప్‌తో తాప్సీ బాగా నటించిందనే పేరు మాత్రం తెచ్చుకుంటుంది. ఆమె హావభావాలు టాప్ క్లాస్‌లో ఉన్నాయి. కానీ కథా కథనాల కారణంగా ఆ నటన వృథాగా మారింది.

అతి తక్కువ ఖర్చుతో.. ఒకే బిల్డింగులో సినిమా తీసేసి ప్రేక్షకుల నుంచి చాలా డబ్బులు రాబట్టాలనేది దర్శక నిర్మాతల ఆలోచనగా కనిపిస్తుంది. తాప్సీ రెమ్యూనరేషన్ మినహాయిస్తే ఈ సినిమాకి నిర్మాతలు పెట్టిన ఖర్చు చాలా స్వల్పం. నిర్మాణ విలువలూ అలాగే ఉన్నాయి. టార్చర్‌ని అనుభవించే ఓపిక ఉన్నవాళ్లు ఈ సినిమా చూసి, ఆ అనుభవాన్ని పొందవచ్చు.

Game Over Review: 1 Up and 4 Downs | actioncutok.com

More for you: