గిరీశ్ కర్నాడ్ కన్నుమూత


– వనమాలి
గిరీశ్ కర్నాడ్ కన్నుమూత
Girish Karnad

గిరీశ్ కర్నాడ్ కన్నుమూత

సుప్రసిద్ధ బహుభాషానటుడు, నాటకరచయిత, సాహితీవేత్త గిరీశ్ కర్నాడ్ ఇక లేరు. తన ప్రతిభావంతమైన నటనతో, నాటకాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చిన ఆయన సోమవారం (జూన్ 10) బెంగళూరులోని తన స్వగృహంలో మృతి చెందారు. ఆయన వయసు 81 సంవత్సరాలు.

నాలుగు దశాబ్దాలుగా ఆయన సమకాలీన సామాజిక అంశాలే ఇతివృత్తాలుగా నాటకాలను రచించి, ప్రదర్శిస్తూ, ప్రజల్ని చైతన్యపరుస్తూ వచ్చారు. కన్నడంలో తను రాసిన నాటకాలను తనే ఇంగ్లీషులోకి కూడా అనువదించారు. ఆయన నాటకాలు కొన్ని ఇతర భారతీయ భాషల్లో అనువాదమయ్యాయి. వాటిని బీవీ కారంత్, ఇబ్రహీం అల్కాజి, అలీఖ్ పదమ్సీ, ప్రసన్న, అరవింద్ గౌర్, సత్యదేవ్ దూబే, విజయ మెహ్‌తా, శ్యామానంద్ జలాన్ వంటి పేరుపొందిన నాటకకర్తలు దర్శకత్వం వహించారు.

ఇక భారతీయ సినిమాకు ఆయన తన వంతు సేవలను అందించారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా పనిచేశారు. మాతృభాష కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాల్లో నటించారు. నటునిగా అవార్డులను పొందారు. భారత ప్రభుత్వం నుంచి ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. నాలుగు ఫిలింఫేర్ అవార్డులు గెలిచారు. వాటిలో మూడు బెస్ట్ డైరెక్టర్, ఒకటి బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డులు. ఆయన నటించిన చివరి హిందీ సినిమా ‘టైగర్ జిందా హై’ (2017).

తెలుగులో అనంత నాగ్, వాణిశ్రీ ప్రధాన పాత్రధారులా శ్యాం బెనెగల్ డైరెక్టర్ చేసిన ‘అనుగ్రహం’ (1978) సినిమాకి గోవింద్ నిహ్లానీతో కలిసి స్క్రీన్‌ప్లే అందించారు కర్నాడ్. ‘కొమరం పులి’ (2010), ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ (2004), ‘వందేమాతరం’ (2001), ‘ధర్మచక్రం’ (1996), ‘జీవన వేదం’ (1993), ‘ప్రాణదాత’ (1992), ‘చైతన్య’ (1991), ‘సంకీర్తన’ (1987) తదితర చిత్రాల్లో నటించారు.

గిరీశ్ కర్నాడ్ కన్నుమూత | actioncutok.com

More for you: