‘హిరణ్య కశ్యప’తో విమర్శకులకు చెక్ పెడతాడా?


– వనమాలి

'హిరణ్య కశ్యప'తో విమర్శకులకు చెక్ పెడతాడా?
Gunasekhar

‘హిరణ్య కశ్యప’తో విమర్శకులకు చెక్ పెడతాడా?

డైరెక్టర్‌గా 27 ఏళ్ల కెరీర్.. తీసిందేమో కేవలం 12 సినిమాలు. వాటిలో రెండు బ్లాక్‌బస్టర్స్.. నాలుగు డిజాస్టర్స్..

ఆ పన్నెండింటిలోనే ఒక పౌరాణిక చిత్రం.. ఒక చారిత్రక చిత్రం.. ఆ డైరెక్టర్ గుణశేఖర్.

1992లో ‘లాఠీ’తో డైరెక్టర్‌గా మొదలైన ప్రయాణం.. ‘సొగసు చూడ తరమా’, ‘రామాయణం’, ‘చూడాలని వుంది’, ‘మనోహరం’, ‘ఒక్కడు’ వంటి చక్కని సినిమాలతో మనోహరంగా, సొగసుగా నడచింది. కానీ ఆ తర్వాతనే ఆయన ప్రయాణం గతి తప్పింది. ‘ఒక్కడు’ కంటే ముందు ‘మృగరాజు’ వంటి డిజాస్టర్ ఉన్నా.. తర్వాత వరుసగా ‘సైనికుడు’, ‘వరుడు’, ‘నిప్పు’ వంటి అట్టర్‌ఫ్లాప్ సినిమాలతో డైరెక్టర్‌గా ఆయన ఉనికికే ప్రమాదం ఏర్పడింది.

‘నిప్పు’ తర్వాత మూడేళ్ల విరామం తీసుకొని కాకతీయ సామ్రాజ్ఞి రాణీ రుద్రమదేవి కథతో ‘రుద్రమదేవి’ (2015) రూపొందించాడు గుణశేఖర్. అనుష్క టైటిల్ రోల్ చెయ్యగా, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య రాజుగా రానా నటించిన ఆ సినిమా ఆశించిన రీతలో ఆడలేదు. ఆ సినిమా కోసం ఎంతో వ్యయ ప్రయాసలు పడ్డాడు గుణశేఖర్. అయితే కథలో ఎక్కువగా రుద్రమదేవి లైంగికతపై దృష్టిపెట్టడం వల్ల ప్రేక్షకులతో ఎమోషనల్ కనెక్షన్ మిస్సయింది.

నాలుగేళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఇంతవరకూ ఆయన మెగాఫోన్ పట్టలేదు. ఇప్పుడు ఆకస్మికంగా రానాతో ‘హిరణ్యకశ్యప’ సినిమా చేస్తున్నానని ప్రకటించాడు. మూడేళ్ల నుంచీ ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్నానని తెలిపాడు. రానా తండ్రి, సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేశ్‌బాబు ఈ సినిమాని తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఏడాది చివరలో కానీ, 2020 మొదట్లో కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సురేశ్ ప్రకటించారు.

ఏదేమైనా ‘హిరణ్యకశ్యప’ ఒక బృహత్ ప్రయత్నం. దర్శకుడిగా గుణశేఖర్‌కు ఈ సినిమా చాలా చాలా కఠిన పరీక్ష. ఆయన దర్శకత్వ సామర్థ్యాలపై ఎంతో కాలంగా సందేహాలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆయన అసాధారణ సినిమాని తన భుజాలపైకి ఎత్తుకున్నారు. ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ, వచ్చాక సంచలనాలు సృష్టించవచ్చు. ఈ సినిమాతో గుణశేఖర్ తన విమర్శకులకు చెక్ పెట్టవచ్చు. నిజంగా ఆ పని ఆయన చేస్తారా? వేచి చూద్దాం.

‘హిరణ్య కశ్యప’తో విమర్శకులకు చెక్ పెడతాడా? | actioncutok.com

More for you: