ఒక హీరోయిన్ ప్రేమలేఖ


ఒక హీరోయిన్ ప్రేమలేఖ

ఒక హీరోయిన్ ప్రేమలేఖ

డియర్ డైరెక్టర్,

ఎలా ఉన్నారు? హైదరాబాద్ నుంచి వెళ్లి ఇంకా వారం కూడా కాలేదు.. ఇంతలోనే.. ఫోన్‌తో పాటు మళ్లీ ఈ లెటర్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? లెటర్ రాయడం నాకు వ్యసనంగా మారింది ఏం చెయ్యను? మీరు ముంబై వెళ్లేప్పుడు నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. నా సజెషన్స్ కోసమే ఇచ్చానన్నారు. మీరు వెళ్లేలోగా ఆ పని పూర్తిచెయ్యలేకపోయాను. మీరు వెళ్లాక నన్ను నేను గట్టిగా తిట్టుకొని స్క్రిప్ట్ దగ్గర పెట్టుకొన్నాను. ఏం సజెషన్స్ ఇవ్వాలో తెలియలేదు. అయినా నాకు తోచింది రాసేశాను.

మీరు స్క్రిప్ట్ మధ్యలో కొన్ని లైన్లు గుర్తుపెట్టారు. వాటిని దృష్టిలో పెట్టుకొని రాశాను. అవి మీకు పనికిరావచ్చు, పనికి రాకపోవచ్చు. మీకు పనికొచ్చేవి రాసుంటే అవి మీకు ఉపయోగపడుతున్నాయని సంతోషిస్తాను. మీకు అనవసరమైనవనిపిస్తే ఇదీ నా జీవితం లాగే పనికిరాకుండా పోతుందే అని ఒక్క నిమిషం బాధపడతాను. సుత్తి రాస్తున్నాననుకుంటున్నారా!

మీతో ఎంతో మాట్లాడాలని, ఏదేదో చెప్పాలని ఉంది. కెమెరా ముందు ఏమాత్రం భయపడని నేను మీరు ఎదురుపడితే మాత్రం భయంతో ఎందుకు చెప్పలేకపోతున్నానో అర్థం కాదు. లెటర్ ద్వారా చెప్పాలని ఉంది. కానీ దానికి మీ పర్మిషన్ కావాలి. పర్మిషన్ అని ఎందుకంటున్నానంటే నేను ఏ స్థాయి వరకు మీ మనిషినో నాకు తెలియదు కాబట్టి. అయినా మీతో ఈసారి చాలా ఎక్కువగానే మాట్లాడాను, ప్రవర్తించాను. నా పరిధి మర్చిపోయాను. కానీ మీతో గడిపిన క్షణాలన్నీ నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. క్షమించండి..  మీరు ముంబై వెళ్లే చివరి నిమిషంలో సంతోషంగా పంపడానికి బదులు బాధతో పంపాను.

ఇదివరకెప్పుడూ అలాంటి మాటలు మీతో నేనెప్పుడూ మాట్లాడలేదు. ఈసారి మీ దగ్గర చాలా చనువుగా మెలిగాను కదా! అందుకే అలా తొందరపాటుగా చెప్పాను. కానీ నిజానికి ఆ ఆలోచన నా మనసులో కొన్ని నెలలకు పైనుండే ఉంది. ఆ నిర్ణయం మారనిది కూడా. ఇంకెప్పుడూ ఆ ప్రస్తావన మీ దగ్గర తీసుకురాను.

మీరు లెటర్స్ రాయడం మానొద్దు. మీరు లెటర్ రాసినందువల్ల మీకేవిధమైన ప్రాబ్లెం నేను తీసుకురాను. నన్ను నమ్మండి. నేను మీరందరూ అనుకునేంత చెడ్డదాన్ని మాత్రం కాదు. –త ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దన్నారు. కారణం తెలుసుకోవచ్చా?

నా మనసులో ఒక కోరిక ఉంది. అది మీ ద్వారా తీర్చుకోవాలని ఉంది. ఈసారి మీ లెటర్‌ను బట్టి నా కోరిక చెప్తాను. బలవంతం చెయ్యను. వేరే రకంగా ఆలోచించవద్దు. ఒక తమిళ సినిమా ఆఫర్ వచ్చింది. నాకు చెయ్యాలని లేదు. ఎందుకంటే, చెన్నైకి వెళ్లాలనే ఉద్దేశం నాకు లేదు. అమ్మ చెయ్యమని బలవంతపెడుతోంది. మీరేమంటారు? ఏ విషయమూ తప్పనిసరిగా లెటర్‌లో రాయండి.

అన్ని విషయాలూ వివరంగా తర్వాత తెలియజేస్తాను. నేను లెటర్ రాయడం మీకు ఇష్టమో, కాదో చెప్పండి. వెంటనే లెటర్ రాస్తారు కదూ! మీ స్క్రిప్టుపై నా అభిప్రాయాలు.. ఈ లెటర్‌తో పాటు పంపిస్తున్నా. నాకు మీ దగ్గర స్వతంత్రం ఉందనుకుంటే మన పందెం గుర్తుకు తెచ్చుకోండి. తర్వాత లెటర్‌లో నాకు రెండు ముద్దులు పంపండి. ఉంటాను.

ఏమని సంబోధించాలో తెలీని

–ణి

ఒక హీరోయిన్ ప్రేమలేఖ | actioncutok.con

More for you: