‘మన్మథుడు 2’కి అంత సీన్ ఉంటుందా?


'మన్మథుడు 2'కి అంత సీన్ ఉంటుందా?

‘మన్మథుడు 2’కి అంత సీన్ ఉంటుందా?

ఒరిజినల్‌ను మించే సీక్వెల్‌స్ చాలా అరుదుగా వస్తుంటాయి. తెలుగులో సీక్వెల్సే తక్కువ. ఆ వచ్చిన వాటిలో హిట్టయినవీ తక్కువే. ఇప్పుడు ఒక సీనియర్ టాప్ హీరో చేస్తోన్న సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అది.. నాగార్జున చేస్తోన్న ‘మన్మథుడు 2’. డైరెక్టర్‌గా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో నాగ్ జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తోంది. కీర్తి సురేశ్, సమంత అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

సహజంగానే ఒరిజినల్‌తో ఈ సినిమాని పోల్చడం తప్పదు. 17 సంవత్సరాల క్రితం.. అంటే 2002లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రం ప్రేక్షకుల్ని అమితంగా అలరించింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఆ సినిమాని డైరెక్టర్ విజయభాస్కర్ టేకింగ్, రైటర్ త్రివిక్రం డైలాగ్స్ అమితాకర్షణీయంగా మార్చాయి. నాగ్, సోనాలీ బెంద్రే జోడీ ప్రేక్షకుల్ని బాగా అలరించింది. వాళ్ల మధ్య కెమిస్ట్రీ ముచ్చటగొలిపింది. ఇక బ్రహ్మానందం కేరెక్టర్ నవ్వుల పూలు పూయించింది. కథలో భాగంగా వచ్చే నాగ్-అన్షు రొమాన్స్ అలరించింది. అలా అన్ని అంశాలూ కుదిరి ‘మన్మథుడు’ నాగ్ కెరీర్‌లోని టాప్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.

అలాంటి మూవీకి 17 ఏళ్ల తర్వాత సీక్వెల్ రూపొందుతుండటం, అందులోనూ హీరోగా నాగ్ నటిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒరిజినల్‌లో సోనాలీ కేరెక్టర్ తరహాలో రకుల్‌ప్రీత్ కేరెక్టర్ ఉంటుందని తెలుస్తోంది. సీక్వెల్‌లో కీర్తి సురేశ్ ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం సినిమా ఆకర్షణని పెంచింది. నాగ్ కౌగిలిని కీర్తి ఎంజాయ్ చేస్తున్నట్లు వెల్లడించిన స్టిల్ చూస్తుంటే కీర్తి కేరెక్టర్ ఒరిజినల్‌లో అన్షు కేరెక్టర్ తరహాలో ఉంటుందనే అభిప్రాయం కలిగిస్తోంది.

ఇక సమంత కేరెక్టర్ ఏమిటనేది తెలీకపోయినా నాగ్ కేరెక్టర్‌ను పరిచయం చేసే నెరేటర్‌గా ఆమె కనిపిస్తుందని వినిపిస్తోంది. అలాగే ఒరిజినల్‌లో బ్రహ్మానందం నిర్వర్తించిన బాధ్యతను సీక్వెల్‌లో వెన్నెల కిశోర్ నిర్వర్తిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఒరిజినల్‌ను ‘మన్మథుడు 2’ మించేలా ఉంటుదా? లేదూ.. ఆ స్థాయిలోనైనా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా? ఆ రెండూ చెయ్యక నిరాశపరుస్తుందా? డైరెక్టర్ రాహుల్ ఎలా తీస్తాడో.. ఏం చేస్తాడో.. వెయిట్ అండ్ సీ.

'మన్మథుడు 2'కి అంత సీన్ ఉంటుందా?

‘మన్మథుడు 2’కి అంత సీన్ ఉంటుందా? | actioncutok.com

More for you: