సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: అందరివాడు


– వనమాలి
సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: అందరివాడు

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: అందరివాడు

తారాగణం: చిరంజీవి (ద్విపాత్రాభినయం), టబు, రిమీ సేన్, ప్రకాశ్‌రాజ్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సునీల్, రక్షిత, సత్యనారాయణ, కృష్ణ భగవాన్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్

డైలాగ్స్: కోన వెంకట్

సంగీతం: దేవి శ్రీప్రసాద్

దర్శకత్వం: శ్రీను వైట్ల

విడుదల తేదీ: 4 జూన్ 2005

గోవిందరాజులు కల్లు దుకాణం వద్ద తాపీగా గ్లాసులో కల్లు తాగుతున్నాడు. స్కూల్లో చదువుకుంటున్న అతని పదేళ్ల కొడుకు సిద్ధార్థ అక్కడకి వచ్చాడు. కొడుకును చూసి గ్లాసు దాచేయబోయాడు గోవిందరాజులు.

“నాన్నా.. తాగుతున్నావా?” అడిగాడు సిద్ధార్థ తండ్రి వంక కోపంగా చూస్తూ.

“లేదు నాన్నా.. తాగడం లేదు” అన్నాడు పత్తిత్తులా గోవిందరాజులు.

“నీ సంగతి నాకు తెలుసులే. ముందు ఇక్కడ్నించి రా” అని తండ్రి చేయిపట్టుకొని ముందుకు నడిచాడు సిద్ధార్థ.

“సరే నాన్నా” అంటూ మరో చేతిలోని గ్లాసుని బల్లమీద పెట్టి, కొడుకు చూడకుండా అక్కడున్న పెద్ద కల్లు కుండని పట్టుకొని కదిలాడు గోవిందరాజులు.

*   *   *

ఈ సన్నివేశం ఏం చెబుతుందో విడమరచి చెప్పాల్సిన పనిలేదు. గోవిందరాజులు (చిరంజీవి) గ్లాసు కింద పెట్టి, కుండ తీసుకోవడమనే షాట్ చూస్తే.. దానిని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే ఇన్‌టెన్షన్ డైరెక్టర్‌లో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. దాన్ని ‘బాధ్యతారాహిత్య సన్నివేశం’గా పరిగణించక తప్పదు. దాని బాధ్యత దర్శకుడు శ్రీను వైట్లది.

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: అందరివాడు

ఒక కళాకారుడికి ఎటువంటి పాత్రనైనా చేసే స్వాతంత్ర్యం ఉంది. దాన్నెవరూ తప్పు పట్టాల్సిన పని లేదు. సినిమా కథలో చెడుని ఎంత బాగా ఎలివేట్ చేస్తే మంచి అంత బాగా ఎలివేట్ అవుతుందనే ఫార్ములాని చాలామంది దర్శకులు అనుసరిస్తుంటారు. సాధారణంగా చెడుకి ప్రతీకగా విలన్ ఉంటే, మంచికి ప్రతీకగా హీరో కనిపిస్తాడు. దాంతో ‘ఎప్పుడూ విజయం మంచికే’ అనే సందేశం అన్యాపదేశంగా ఇచ్చినట్లవుతుంది.

అయితే ఓ ఎడుని నెగటివ్‌గా కాకుండా, పాజిటివ్‌గా చూపిస్తే.. దాన్ని ఏమనాలి? దాని వల్ల ఎటువంటి సందేశం ప్రేక్షకులకు అందుతుందీ? తాగుడనేది చెడు వ్యసనమని అందరికీ తెలుసు. దాని వల్ల ఎన్ని కాపురాలు కూలుతున్నాయో, ఎన్ని ప్రాణాలు పోతున్నాయో తెలుసు. అలాంటి ఒక చెడు వ్యసనాన్ని సినిమాలోని ప్రధాన పాత్రకు ఆపాదించి పాజిటివ్‌గా చూపించడం.. అదీ చిరంజీవి వంటి మెగాస్టార్‌పై ప్రయోగించడం.. ప్రేక్షకులపై ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది. జవాబు కోసం మానసిక నిపుణుల వంక చూడనవసరం లేదు. మానసిక స్థితి సరిగా ఉన్న ఎవరైనా చెప్పగలరు.

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: అందరివాడు

‘అందరివాడు’ అనే చక్కని టైటిల్ పెట్టి, ‘మ్యాన్ ఆఫ్ ద మాసెస్’ అనే మరో ఇంప్రెసివ్ ట్యాగ్ లైన్ పెట్టి, గోవిందరాజులు పాత్రను పచ్చి తాగుబోతుగా చూపిస్తే.. “మాస్ అంటే పచ్చి తాగుబోతు” అనే సందేశం జనంలోకి వెళ్లదా? పైగా “తాగడంలో తప్పులేదు” అనే నమ్మకాన్ని గోవిందరాజులు పాత్ర పిల్లల్లో, యువతలో, తాగుబోతుల్లో కలిగించే ప్రమాదం ఉంది. ఎందుకంటే తనకున్న చెడు అలవాటు విషయంలో గోవిందరాజులు ఎప్పుడూ పశ్చాత్తాపపడడు. ఆ అలవాటు ఇతరులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందనే సంగతే తలచడు.

పైకా ఒకానొక సందర్భంలో దానిని ‘ప్రెస్టేజ్ ఇష్యూ’గా కూడా భావిస్తాడు. అలా తాగివచ్చిన తండ్రిని కోప్పడాల్సిన కొడుకు, అందుకు విరుద్ధంగా ఓ ఫుల్ బాటిల్ మందు తీసుకొచ్చి కానుకగా ఇస్తాడు. “భేష్! సీన్ అదిరింది! ప్రేక్షకు పులకించి ఈలలు వేస్తారు, చప్పట్లు చరుస్తారు” అనుకున్నారు ఆ సన్నివేశానికి బాధ్యులైన రచయిత, దర్శకుడు. కానీ అలాంటి సన్నివేశం అందించే ప్రతికూల సందేశాన్ని వారు గ్రహించలేకపోయారో, కావాలని ఉపేక్షించారో తెలీదు. సినిమాను ఫక్తు వ్యాపారంగా భావించేవాళ్లు, సమాజం పట్ల బాధ్యతను గుర్తించనివాళ్లు మినహా ఇలాంటి సన్నివేశాలు రూపొందించరు.

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: అందరివాడు

ఏదేమైనా ‘అందరివాడు’ పాత్రని అలా నెగటివ్‌గా మలచడం వల్లే ఆ సినిమా అందరినీ కాక, కొందరినే మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక ఫెయిలైంది. మాస్‌ని ఆకట్టుకుంటూనే వైవిధ్యమైన పాత్రలు పోషించాలనే తపనతో గోవిందరాజులు పాత్రను చేసిన చిరంజీవి ‘కొందరివాడు’గా మిగిలిపోయారు.

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: అందరివాడు | actioncutok.com

More for you: