సినిమాలెందుకు హిట్టవుతాయి?: మిస్సమ్మ (1955)


– ప్రద్యుమ్న
సినిమాలెందుకు హిట్టవుతాయి?: మిస్సమ్మ (1955)

సినిమాలెందుకు హిట్టవుతాయి?: మిస్సమ్మ (1955)

తారాగణం: ఎన్టీఆర్, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు, జమున, ఎస్వీ రంగారావు, రుష్యేంద్రమణి, రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, బాలకృష్ణ (అంజి), దొరస్వామి, గుమ్మడి

కథ, మాటలు: చక్రపాణి

పాటలు: పింగళి నాగేంద్రరావు

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

నేపథ్య గానం: ఎ.ఎం. రాజా, పి. లీల, పి. సుశీల, రేలంగి

సినిమాటోగ్రఫీ: మార్కస్ బార్‌ట్లే

నిర్మాతలు: నాగిరెడ్డి – చక్రపాణి

దర్శకుడు: ఎల్వీ ప్రసాద్

బేనర్: విజయా పిక్చర్స్

విడుదల తేదీ: 12 జనవరి 1955

ఆ రోజుల్లోనే 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సూపర్ హిట్ సినిమా ఇది. ‘అవునంటె కాదనిలే.. కాదంటె అవుననిలే’, ‘బాబు ధర్మం చెయ్ బాబూ’, ‘బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే’, ‘ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా’, ‘రావోయి చందమామ మా వింతగాథ వినుమా’, ‘తెలుసుకొనవె యువతీ’ పాటలు ఎక్కడ చూసినా మార్మోగుతూ వచ్చాయి.

నిజానికి ఈ సినిమాలో టైటిల్ రోల్‌కు మొదట ఎంపికైనది భానుమతి. అయితే కొద్ది రోజులు షూటింగ్ చేశాక సెట్స్‌కు భానుమతి ఆలస్యంగా వస్తోందనే కారణంతో ఆమెను తొలగించి, అప్పటి దాకా రెండో హీరోయిన్‌గా నటిస్తూ వచ్చిన సావిత్రిని మిస్సమ్మ పాత్రకు మార్చారు. రెండో హీరోయిన్ రోల్‌కు జమునను తీసుకున్నారు.

‘కోటి విద్యలూ కూటికొరకే’ అన్నట్లు అనేక కష్టాలు పడి, చివరకు సుఖసంపదలను పొందిన ఇద్దరు నిరుద్యోగుల ప్రేమగాథ ‘మిస్సమ్మ’. అప్పాపురం జమీందారు పదహారేళ్ల క్రితం తప్పిపోయిన తమ కూతురు మహాలక్ష్మి పేరుతో ఒక ఎలిమెంటరీ స్కూలు నిర్మిస్తాడు. దానికి టీచర్లుగా భార్యాభర్తలు కావాలని ప్రకటిస్తాడు. మద్రాసులో రావు, మేరీ అనే ఇద్దరు గ్రాడ్యుయేట్లు ఉద్యోగం కోసం వెదుకులాడే ప్రయత్నాల్లో ఒకరికొకరు పరిచయమై జమీందారు ప్రకటన చూసి, భార్యాభర్తలుగా నటిస్తూ ఆ ఉద్యోగాలు పొందాలనుకుంటారు. జమీందారు వాళ్లకు ఉద్యోగాలిస్తాడు. జమీందారు దంపతులు వాళ్లను తమ సొంత కూతురు అల్లుడిగా ఆదరిస్తారు.

సినిమాలెందుకు హిట్టవుతాయి?: మిస్సమ్మ (1955)

జమీందారు మేనల్లుడు రాజు ఎలాగైనా చిన్నప్పుడు తప్పిపోయిన తన మేనమరదలిని కనిపెట్టాలని డిటెక్టివ్‌గా పరిశోధనలు సాగిస్తుంటాడు. రావుతో జమీందారు రెండో కూతురు సీత చనువుగా ఉండటం ఇటు రాజుకూ, అటు మేరీకి కూడా ఇష్టం ఉండదు. మేరీ గర్భిణి అని ఆమెకు సీమంతం చేస్తారు. మేరీని పెళ్లాడాలనే కోరికతో ఉండే డేవిడ్ అనేవాడు ఆమె అడ్రెస్ సంపాదించి అప్పాపురం వచ్చి హడావిడి చేస్తాడు.

రావే తన భర్త అని మేరీ చెబుతుంది. మేరీ తల్లిదండ్రులు కూడా వస్తారు. మేరీ కాలిపై ఉన్న పుట్టుమచ్చను కనిపెట్టిన రాజు ఆమే మహాలక్ష్మి అని నిరూపిస్తాడు. మేరీ తల్లిదండ్రులు అసలు విషయం చెప్పి ఆమె జమీందారు కూతురేనని చెబుతారు. మహాలక్ష్మిని రావుకూ, సీతను రాజుకూ ఇచ్చి పెళ్లి జరిపిస్తారు జమీందారు దంపతులు.

రసవత్తరమైన కథ, సహజ సన్నివేశాలు, మృదుమధుర సంగీతం, అడుగడుగునా సున్నితమైన హాస్యంతో సర్వకళా సమన్వితంగా రూపొందిన ‘మిస్సమ్మ’ ప్రేక్షకుల్ని అరలరించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వానికి చక్రపాణి అద్భుత రచన తోడవడం వల్లే ఈ సినిమా కళాఖండంగా పేరు తెచ్చుకుంది. పింగళి నాగేంద్రరావు రాసిన పాటలకు సాలూరి రాజేశ్వరరావు సమకూర్చిన బాణీలు ప్రేక్షకుల్ని అమితంగా అలరించాయి. సినిమాటోగ్రఫీ, ఆడియోగ్రఫీ ఉన్నత స్థాయిలో ఉండి సినిమా దృశ్యకావ్యంలా రావడానికి తోడ్పడ్డాయి.

రావు, మహాలక్ష్మి పాత్రల్లో ఎన్టీఆర్, సావిత్రి జంటను, వాళ్ల అభినయాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవనిపిస్తుంది. రాజుగా నాగేశ్వరరావు, జమీందారుగా ఎస్వీ రంగారావు రాణించిన తీరు అపూర్వం. ‘దేవదాసు’, ‘విప్రనారాయణ’ వంటి సినిమాలతో స్టార్ అయిన అక్కినేని ఈ సినిమాలో కమెడియన్‌గా నటించేందుకు అంగీకరించడం విశేషమే. దేవయ్యగా రేలంగి, డేవిడ్‌గా రమణారెడ్డి, గోవిందుగా బాలకృష్ణ (అంజి) చక్కని హాస్యాన్ని పండించి తమను మేటి హాస్యనటులుగా ఎందుకు పరిగణిస్తారో తెలియజేసిన సినిమా ఇది. సీత పాత్రలో జమున ముచ్చటగొల్పుతుంది. సావిత్రికి ధీటుగా ఆమె రాణించింది.

‘మిస్సమ్మ’ చరిత్రలో గొప్ప సినిమాగా నిలవడానికి ప్రధాన కారణం ఆద్యంతం చక్కని టెంపోను నిలుపుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని ఇచ్చేలా ఎల్వీ ప్రసాద్ దానిని రూపొందించిన విధానం. విజయా వారి చిత్రాల్లో ఉండే ప్రత్యేక విశిష్టతలన్నీ ఉన్న ‘మిస్సమ్మ’.. క్లాసిక్‌గా ఈనాటికీ నీరాజనాలు అందుకుంటూనే ఉంది.

సినిమాలెందుకు హిట్టవుతాయి?: మిస్సమ్మ (1955) | actioncutok.com

More for you: