సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: తీన్ మార్


– సజ్జా వరుణ్
సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: తీన్ మార్

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: తీన్ మార్

సైఫ్ అలీఖాన్ చేసిన హిందీ హిట్ ఫిల్మ్ ‘లవ్ ఆజ్ కల్’ సినిమాని జయంత్ సి. పరాన్జీ డైరెక్షన్‌లో చెయ్యాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నప్పుడు కథలోని యాంటీ సెంటిమెంట్ తెలుగువాళ్లను ఎలా మెప్పిస్తుందనే సందేహాలు వినిపించాయి. అయితే మక్కీకి మక్కీ కాపీ కాకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు హీరో పాత్రలో, కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తున్నారని తెలిసినప్పుడు సినిమాపై భరోసా వచ్చింది. కానీ ఒరిజినల్‌లో సైఫ్ డ్యూయల్ రోల్ చెయ్యలేదు. పవన్ కల్యాణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనేసరికి ఆశ్చర్యం కలిగింది. ఒరిజినల్‌లో రిషి కపూర్ చేసిన కేరెక్టర్‌ను సైతం పవన్ చేస్తున్నాడని విన్నప్పుడు ఆసక్తి వేసింది. తీరా సినిమా చూశాక ఆ ఆసక్తి అంతా నీరుకారిపోయింది.

ద్విపాత్రాభినయం చేయడం పవన్ కల్యాణ్‌కు ఇదే తొలిసారి. రెండు పాత్రల్ని భిన్నంగా చూపించడానికీ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు బాగా రావడానికి త్రివిక్రంను రంగం మీదకు తీసుకొచ్చాడు పవన్. అప్పటికే త్రివిక్రం డైరెక్షన్‌లో ‘జల్సా’ వంటి హిట్ చేశాడు పవన్. అప్పుడు ఏర్పడిన స్నేహంతో త్రివిక్రం ‘తీన్ మార్’కు రైటర్‌గా పనిచేశాడు. తన మార్కు డైలాగ్స్ కొన్ని రాశాడు. కానీ కేవలం డైలాగ్స్ బాగున్నంత మాత్రాన సినిమా ఆడదని ప్రూవ్ చేసింది ‘తీన్ మార్’.

ఒరిజినల్‌లో జై, వీర్‌సింగ్ అనే రెండు పాత్రలు చేశాడు సైఫ్. అయితే వీర్‌సింగ్ వృద్ధుడయ్యాక ఆ పాత్రను రిషి కపూర్‌తో చేయించారు. తన కథను జైకి వీర్‌సింగ్ స్వయంగా చెప్పినట్లు చూపిస్తే, తెలుగులో మైఖేల్‌కు అర్జున్ పాల్వాయ్ కథను రెస్టారెంట్ యజమాని సేనాపతి (పరేశ్ రావల్) చెప్పినట్లు చూపించారు.

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: తీన్ మార్

మైఖేల్ (పవన్) జోడీ అయిన మీరా కేరెక్టర్‌కు త్రిష నప్పింది కానీ అర్జున్ పాల్వాయ్ (పవన్) జోడీ వసుమతి పాత్రలో కృతి ఖర్బందా తేలిపోయింది. ఆమె ఈ సినిమాలో రాంగ్ కేస్టింగ్ అనేది స్పష్టం. హీరోయిన్‌కు హీరోతో కాకుండా మరొకరితో పెళ్లి జరగడం మామూలు హీరోల సినిమాల్లో చెల్లుబాటవుతుంది కానీ పవన్ వంటి పవర్ స్టార్ సినిమాకి సెట్టవుతుందా? ఆ సీన్‌ను ఒరిజినల్ తరహాలోనే దింపేసి యాంటీ సెంటిమెంట్ ప్రయోగం చేశారు.

సుధీర్ (సోనూ సూద్)తో మీరా పెళ్లయిపోయిన ఒక రోజుకే ఆ ఇద్దరూ విడిపోతారు. మైఖేల్, మీరా మళ్లీ ఒక్కటవుతారు. ఈ సన్నివేశాలు మన ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించలేదు. అప్పటి దాకా మైఖేల్ యాటిట్యూడ్, అతని బిహేవియర్ ఏమాత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి.

విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనూ సూద్‌ను ఇందులో సుధీర్‌గా పాజిటివ్ కేరెక్టర్‌లో, అందునా సాఫ్ట్ కేరెక్టర్‌లో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. అంతా కొత్తగా తీద్దామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అసలు ‘తీన్‌మార్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. కథకు, ఆ టైటిల్‌కు సంబంధం లేదు. మైఖేల్ కథ కానీ, అర్జున్ పాల్వాయ్ కథ కానీ ‘తీన్‌మార్’లా అనిపించవు. క్లైమాక్స్ సైతం అనాసక్తంగా ఉండటంతో ఈ సినిమా భారీ వైఫల్యాన్ని చవిచూసింది.

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: తీన్ మార్

సినిమాలెందుకు ఫెయిలవుతాయి?: తీన్ మార్ | actioncutok.com

More for you: