Kousalya Krishnamurthy Review: 5 Ups And 2 Downs

Kousalya Krishnamurthy Review: 5 Ups And 2 Downs
తారాగణం: ఐశ్వర్యా రాజేశ్, రాజేంద్రప్రసాద్, ఝాన్సీ, కార్తీక్ రాజు, శివ కార్తికేయన్, మహేశ్, వెన్నెల కిశోర్, భీమనేని శ్రీనివాసరావు
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
విడుదల తేదీ: 23 ఆగస్ట్ 2019
టాలీవుడ్లో రీమేక్ కింగ్‌గా పేరుపొందిన భీమనేని శ్రీనివాసరావు రూపొందించిన మరో రీమేక్ ‘కౌసల్య కృష్ణమూర్తి’. తమిళంలో సత్యరాజ్, ఐశ్వర్యా రాజేశ్ తండ్రీకూతుళ్లుగా నటించగా, తమిళ స్టార్ శివ కార్తికేయన్ నిర్మించిన ‘కణా’ సినిమా దీనికి మాతృక. తమిళంలో చేసిన రోల్‌ను తెలుగులోనూ ఐశ్వర్య పోషించగా, తండ్రి కేరెక్టర్‌ను రాజేంద్రప్రసాద్ చేశారు.
కథ
కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్) ఒక రైతు. అతడికి క్రికెట్ అంటే పిచ్చి. ఏ మ్యాచ్‌లో అయినా ఇండియా ఓడిపోయిందంటే తట్టుకోలేక ఏడ్చేసేంత పిచ్చి. అలా వరల్డ్ కప్‌లో ఇండియా ఓడిపోతే ఏడ్చిన తండ్రిని చూసి, ఆయన కూతురు కౌసల్య (ఐశ్వర్యా రాజేశ్) తాను క్రికెటర్‌గా మారి, వరల్డ్ కప్‌ను సంపాదించి, ఆ కప్పును తీసుకొచ్చి తండ్రి చేతుల్లో పెట్టాలని నిశ్చయించుకుంటుంది. ఆ ఊళ్లో క్రికెట్ ఆడే వేరే అమ్మాయిలెవరూ లేకపోవడంతో అబ్బాయిలతోటే క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంది. తల్లి (ఝాన్సీ) ఎంత అడ్డు చెప్పినా, తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా మారుతుంది కౌసల్య. మధ్యలో అడ్డంకులు, కష్టాలు ఎదురైనా పట్టుదలతో నేషనల్ విమెన్స్ టీంకు సెలక్టవుతుంది. ఇక్కడ ఊళ్లో కృష్ణమూర్తి పొలం పొలం నీళ్లు లేక నిలువునా ఎండిపోతుంది. బ్యాంక్ రుణం తీర్చలేకపోతాడు. ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకుంటాడు. అతని ఇంటిని బ్యాంకు వాళ్లు జప్తు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? కృష్ణమూర్తి ఏమయ్యాడు? కౌసల్యా ఆశయం నెరవేరిందా? అనేది మిగతా కథ.

కథనం
ఒరిజినల్ మూవీకి ఎక్కువ మార్పులు, చేర్పులు లేకుండా, దాని కథను ఎక్కడా తప్పుదోవ పట్టించకుండా ‘కౌసల్య కృష్ణమూర్తి’ని తీర్చిదిద్దాడు దర్శకుడు భీమనేని. ఎలాంటి డొంకతిరుగుడులు లేకుండా కథను నడిపించాడు. కృష్ణమూర్తి పాత్రను, అతని క్రికెట్ పిచ్చినీ పరిచయం చేసే సన్నివేశాలు ఆహ్లాదపరుస్తాయి. తండ్రి పిచ్చిని తన ఇష్టంగా మార్చుకున్న కౌసల్య పాత్రను ఎక్కడా తగ్గించకుండా, పాత్రకు ఔచిత్య భంగం కలగకుండా చిత్రించాడు. ప్రథమార్ధంలో మెరుపులు కాస్త తక్కువే. నెరేషన్ ఫ్లాట్‌గా అనిపిస్తుంది. దాని వల్ల బోర్ కొట్టే అవకాశం ఉండటంతో వెన్నెల కిశోర్ కేరెక్టర్‌తో దాన్ని పూరించాడు దర్శకుడు.
కృష్ణమూర్తి క్రికెట్ పిచ్చి చూస్తుంటే, మనలోని క్రికెట్ పిచ్చిని తెరమీద చూసుకున్నట్లు ఉంటుంది. అందుకే కృష్ణమూర్తి పాత్రతో మనం కూడా ట్రావెల్ అవుతాం. కౌసల్య ‘పెద్దమనిషి’ అయ్యాక తల్లి బయటకు వెళ్లకుండా కట్టడిచెయ్యాలని చూడ్డం సహజంగా అనిపిస్తుంది. మగపిల్లలతో కలిసిపోయి మగరాయుడిలా ఆడుతోందంటూ ఇరుగుపొరుగు అమ్మలక్కలు సూటిపోటి మాటలు అంటే కూతురి క్షేమం కోసం ఆ తల్లి తల్లడిల్లటం న్యాయం. ఆ సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. ఆ మగపిల్లలంతా కౌసల్యను చెల్లిలిగా భావించి ఆమెకు సపోర్ట్ చెయ్యడం బాగుంది. రొమాంటిక్ యాంగిల్ పూర్తిగా మిస్సవకుండా సాయికృష్ణ కేరెక్టర్‌ను ప్రవేశపెట్టారు. అయితే సాయికృష్ణది ఒన్ సైడ్ లవ్. కౌసల్య ధ్యాసంతా క్రికెట్ పైనే ఉండటంతో ప్రేమ అనే భావనకు ఆమె హృదయంలో చోటు లేదు. అలా ఆమె కేరెక్టర్‌ను లవ్ యాంగిల్ లేకుండా మలచి, మెప్పించడం చిన్న విషయం కాదు.
ఒక వైపు స్టేట్ టీంకు, తర్వాత నేషనల్ టీంకు, అక్కడ్నుంచి వరల్డ్ కప్ టీంకు ఎన్నికవడంలో కౌసల్య ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, మరోవైపు వ్యవసాయం గిట్టుబాటు కాక, పంట ఎండిపోయి, బ్యాంక్ నుంచి తెచ్చిన రుణం చెల్లించలేని స్థితికి వచ్చి ఆత్మహత్య చేసుకుందామనే దాకా కృష్ణమూర్తి రావడం చూసి హృదయం బరువెక్కుతుంది. ఆ ఇద్దరి కష్టాలు తీరాయా? తండ్రిని వరల్డ్ కప్పుతో ఆనందపెట్టాలనుకున్న కౌసల్యకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే విషయాల్ని ఆసక్తికరంగానూ, హృదయాలు తడయ్యే విధంగానూ చిత్రించడంలో భీమనేని సక్సెస్ అయ్యాడు.

నటీనటుల అభినయం
రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేశ్, ఝాన్సీ.. ముగ్గురిలో ఎవరు గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఏం చెప్పాలి? ముగ్గురూ ముగ్గురే అన్నట్లు తమ పాత్రలకు జీవం పోశారు. కృష్ణమూర్తిగా రాజేంద్రప్రసాద్ అత్యుత్తమ స్థాయి నటనను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఒకవైపు కూతుర్ని ప్రోత్సహించే తండ్రిగా, మరోవైపు కష్టాల కడగండ్లకు గురైన రైతుగా గొప్ప నటన చూపారు. ఒరిజినల్లో సత్యరాజ్‌కు ఎంత పేరు వచ్చిందో, అంత పేరు ఆయనకు రావడం ఖాయం. కౌసల్య పాత్రలో ఐశ్వర్య అపూర్వమనదగ్గ అభినయం చూపించింది. ఇలాంటి చక్కటి పాత్రతో ఆమె నేరుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం మెచ్చదగినది. మనకు తెరపై కౌసల్యే కనిపిస్తుంది కానీ, ఐశ్వర్య కనిపించదు. క్లైమాక్స్‌లో హావభావాలు ప్రదర్శిస్తూ ఐశ్వర్య చెప్పిన మాటలు సినిమాకే హైలైట్.
సినిమాలో ఇంకో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కౌసల్య తల్లిగా నటించిన ఝాన్సీది. మొదట మగరాయుడిలా క్రికెట్ ఆడటానికి వెళ్తున్నదన్న భావనతో కూతుర్ని కట్టడి చేయాలని ప్రయత్నించే సగటు తల్లిలా, తర్వాత ఆ కూతురి ఆశయంలోని నిజాయితీని తెలుసుకొని ప్రోత్సహించిన అమ్మలా ఝాన్సీ ఉత్తమ స్థాయి నటనను ప్రదర్శించారు. కౌసల్యను మూగగా ఆరాధించే పాత్రలో కార్తీక్ రాజు, అతడి స్నేహితుడిగా మహేశ్, సెకండాఫ్‌లో కనిపించే క్రికెట్ కోచ్‌గా తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, కృష్ణమూర్తి స్నేహితుడిగా సీవీఎల్ నరసింహారావు, ఫస్టాఫ్‌లో పోలీస్ ఇన్స్పెక్టర్గా నవ్వించే వెన్నెల కిశోర్ తమ పాత్రల్ని పండించారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు సైతం రైతుల్ని రుణాలు కట్టమని పీడించే బ్యాంక్ మేనేజర్‌గా కనిపించి, మెప్పించారు.
చివరి మాట
ఇటీవలి కాలంలో తెలుగులో వచ్చిన చక్కని చిత్రాల్లో ‘కౌసల్య కృష్ణమూర్తి’ తప్పకుండా ఉంటుంది. కమర్షియల్ హంగులేమీ లేకపోయినా చక్కని పాత్రలు, ఆ పాత్రల్లో ఆయా తారల అసమాన నటనతో ఈ సినిమా మస్ట్ వాచ్ ఫిలింగా నిలిచింది.
Kousalya Krishnamurthy Review: 5 Ups And 2 Downs | actioncutok.com
More for you: