ఉత్తమ ఫిల్ముకు పోటీ ఏర్పాటు చేసిన మద్రాస్ ప్రభుత్వం.. తెలుగు నిర్మాతల సహాయ నిరాకరణ

మద్రాసు ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్మాణమయ్యే ఉత్తమ తెలుగు, తమిళ చిత్రాలకు బహుమతులివ్వడం ద్వారా నిర్మాతలకు ప్రోత్సాహమివ్వ తలపెట్టి, 1950లో సమంజసమైన రీతిలో ఒక పోటీ ఏర్పాటు చేసింది. కానీ తొలి సంవత్సరమే తెలుగు ఫిల్మ్‌లు తీసిన వారెవరూ ఆ పోటీలో పాల్గొనకపోవడం వింతగానే కాకుండా, విచారకరంగా అనిపిస్తుంది.
చిత్రపరిశ్రమకు సంబంధించిన వివిధ శాఖల ద్వారా పలు రకాలుగా పన్నుల రూపాన చాలా డబ్బు గుంజుకొనే ప్రభుత్వం, ఈ పరిశ్రమకు ఎలాంటి సహాయం చేయడం లేదనీ, దీని బాగోగులు గుర్తించడం లేదనీ నిర్మాతలు ఈ నాటికీ విమర్శిస్తూనే ఉండటం చూస్తున్నాం. అలాంటిది ప్రభుత్వం ఏదో ఓ విధమైన ఆసక్తి కలిగించుకొని ఈ పోటీ, బహుమతి రూపేణా నిర్మాతలకు ప్రోత్సాహం ఇవ్వదలచినప్పుడు నిర్మాతలు ఈ విధంగా సహాయ నిరాకరణ చేయడంలోఅర్థమేమిటి?
ఈ పోటీలో పాల్గొనని వారు అందుకు చెప్పే కారణాలు ఏమంటే…
- ఉత్తమ చిత్రం అనే నిర్ణయం న్యాయంగా జరగకపోవచ్చు.
- ప్రభుత్వమిచ్చే బహుమతి మొత్తం ఆకర్షణీయంగా లేకపోవడం. కాబట్టి రూ. 50 దరఖాస్తు రుసుంతో పాటు ప్రదర్శన చార్జీలు పెట్టుకోవడం దండగ.
ఈ రెండు కారణాలూ సబబుగానే కనిపించినా, వాదనకు నిలవవు. ఏమంటే, ఉత్తమ చిత్రం నిర్ణయం న్యాయంగా జరగకపోయేందుకు ఉండే అవకాశం కంటే, న్యాయంగా జరిగేందుకే ఎక్కువ అవకాశం ఉంది. ఫిల్ములను చూసి, ఈ నిర్ణయం చేసేందుకు ప్రభుత్వం అర్హులైనవారినే నియమిస్తుంది. అట్లా నియమించకపోతే పోటీ పడేవారూ, ఇండస్ట్రీ బాగోగుల్లో శ్రద్ధ చూపించేవారూ ఆందోళన చేయవచ్చు, చేస్తారు కూడా. కాబట్టి ఈ కారణంలో పసలేదు.
పోతే.. బహుమతి మొత్తం ఆకర్షణీయంగా లేదనేది. లక్షలు ఖర్చుపెట్టి ఫిల్మ్ తీసేవాళ్లు ఈ విషయాన్ని పట్టించుకోవడం కరెక్ట్ కాదు. ఈ బహుమతిని ఒక గౌరవ చిహ్నంగా భావించాలే కానీ, దాని విలువ విషయమై లెక్కలు గట్టడం సరైన పనికాదు. ఎందుకంటే దీనివల్ల ఒక స్థాయి, ఒక ప్రమాణం కలిగిన పెద్దల మెప్పు ఏదో ఒక చిత్రానికి లభిస్తుంది. అది గౌరవప్రదమే కదా!
కాబట్టి తెలుగు ఫిల్ములు తీసేవారు ప్రభుత్వ ఉద్దేశాన్ని సరిగ్గా అవగాహన చేసుకొని ముందు ముందైనా ఈ సహాయ నిరాకరణ ధోరణిని విరమిస్తే బాగుంటుంది. ఆ రీత్యా ఫిల్మ్ ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వం మరింత శ్రద్ధాసక్తులు కనపర్చడానికి దోహదం చేసినవారవుతారు.
- 4 జూన్, 1950