బాలీవుడ్ లవ్ స్టోరీస్: అజయ్ ఇంట్రావర్ట్.. కాజోల్ ఎక్స్ట్రావర్ట్.. అయినా అన్యోన్య దాంపత్యం!

“అజయ్ దేవ్‌గణ్, కాజోల్ ఎక్కువ కాలం కలిసుండలేరు”.. ఆ ఇద్దరూ పెళ్లాడిన తర్వాత చాలామంది అభిప్రాయం ఇదే. మీడియా కూడా ఇవే సందేహాలు వ్యక్తం చేసింది. పూర్తి భిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఆ ఇద్దరిదీ సరైన జోడీ కాదని విమర్శకులు భావించేవారు. అజయ్ ఇంట్రావర్ట్ అయితే, కాజోల్ ఎక్స్ట్రావర్ట్. అయితే నాలుగేళ్ల ప్రేమబంధం తర్వాత పెళ్లిబంధంతో నిజ జీవితంలో దంపతులుగా మారిన ఆ ఇద్దరూ అందరి అనుమానాలనూ పటాపంచలు చేస్తూ, ఇప్పటికీ అన్యోన్యంగా దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
ఆ ఇద్దరూ మహారాష్ట్రియన్ శైలిలో 1999 ఫిబ్రవరి 24న పెళ్లి చేసుకున్నారు. అంటే వారి వైవాహిక బంధానికి త్వరలో 22 ఏళ్లు నిండబోతున్నాయన్న మాట. కెమెరా అంటే సిగ్గుపడే అజయ్ తమ పెళ్లిని ప్రైవేట్ వ్యవహారంగానే ఉంచాలనుకున్నాడు. పెళ్లి కోసం కనీసం అతను ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్‌ను కూడా నియమించలేదు. కెమెరాతో తానొక్కడే ఉంటానని సూచించాడు. అందువల్ల అజయ్, కాజోల్ పెళ్లి ఫొటోలు పూర్తి వ్యక్తిగతంగా కనిపిస్తాయి. పెళ్లయ్యాక కొత్త దంపతులు రెండు నెలల హనీమూన్ కోసం యూరప్ ట్రిప్‌కు వెళ్లారు.
ప్రేమికులుగా వారి బంధం ఎంత హాయిగా గడిచినా, వారి వైవాహిక బంధం ఆటుపోట్లను చవిచూసింది. పెళ్లి తర్వాత, అత్తామామలతో కాజోల్కు సరిపడటం లేదంటూ రూమర్స్ వ్యాపించాయి. కానీ అవి కేవలం వదంతులేనని ఆమె తేల్చేసింది. పైగా, ఆ జంట అనేకసార్లు మీడియా దాడులను ఎదుర్కొంది. ఒక పాపులర్ మేగజైన్ అయితే, ఓ కుర్ర హీరోయిన్‌తో అజయ్‌కు సంబంధాలు అంటగట్టి రాసేసింది. అయితే ఈ రూమర్స్‌ను కాజోల్ నమ్మలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. అందుకే అలాంటి గాసిప్స్‌ను ఆమె పట్టించుకోలేదు. నమ్మకం అనేది లేకుండా వైవాహిక బంధం నిలవలేదని ఆమె నమ్మింది.
2001లో కాజోల్ తొలిసారి గర్భం దాల్చింది. దేవ్‌గణ్ ఫ్యామిలీ ఆనందోత్సాహాలతో బిడ్డను స్వాగతించేందుకు సిద్ధమవుతుండగా, ఆరో నెల నడుస్తుండగా కాజోల్కు గర్భస్రావమైంది. ఆ బాధను దిగమింగుకుంటూ, ఎంతో హుందాగా ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశాడు అజయ్. “ప్రెగ్నెన్సీ విషయం తెలిసినప్పుడు మేమిద్దరం ఎంతో ఉద్వేగానికి గురయ్యాం. ఈ రోజు కాకపోతే, రేపు మేం ఓ కుటుంబాన్ని ప్రారంభించేందుకు ఎదురుచూస్తాం. మీకు తెలియకముందే కాజోల్ తన కాళ్లమీదకు తను తిరిగొస్తుంది. జంటగా మేం హ్యాపీగా ఉన్నాం. అంతకంటే ఏం కావాలి” అన్నాడు.
గర్భస్రావమైన రెండేళ్లకు మాతృత్వ మధురిమను చవిచూసే రెండో అవకాశం వచ్చింది కాజోల్కు. 2003 ఏప్రిల్ 20న పండంటి కూతురు నైసా పుట్టింది. ఏడేళ్లకు కొడుకు యుగ్ జన్మించాడు. నైసా పుట్టినప్పట్నుంచే పిల్లలను చూసుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది కాజోల్. వారితో గడపడం కోసం, వారి ఆలనా పాలనా చూసుకోవడం కోసం ఎన్నో సినిమా ఆఫర్లను ఆమె తిరస్కరించింది.
తనకంటే అజయ్ బెటర్ పర్సన్ అని ఓ ఇంటర్వ్యూలో ఒప్పేసుకుంది కాజోల్. తను నాస్టీగా, అల్లరిగా ఉంటాననీ, కానీ కష్టాలొస్తే తట్టుకోలేననీ చెప్పిన ఆమె ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనూ నిబ్బరం కోల్పోకుండా హుందాగా వ్యవహరించే జెంటిల్మన్ అజయ్ అనీ తెలిపింది. తమ వైవాహిక జీవితానికి సంబంధించి ఎన్ని వివాదాలు, పరీక్షా కాలాలు తటస్థించినా వాటి నుంచి విజయవంతంగా ఆ జంట బయటపడటం ఆశ్చర్యం కలిగించదు. పైగా వారి మధ్య బంధం మరింత బలపడుతూ వచ్చింది.
ఒక సందర్భంలో కాజోల్ మాట్లాడుతూ, “పెళ్లి చేసుకోవడానికి ముందు మేం నాలుగేళ్లు ప్రేమలో ఉన్నాం. మేం మంచి స్నేహితులం. నేను తెగ మాట్లాడుతుంటా. తను శ్రద్ధగా వింటాడు. మా అనుబంధం గట్టిగా ఉండటానికి ఇదే కారణమనుకుంటాను. కాబట్టి మా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వెనుక ఉన్న రహస్యం అజయ్ ఎక్కువగా మాట్లాడకపోవడం” అని నవ్వేసింది. ఏదేమైనా బాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో వారు ఒకరనేది నిజం.
