జీవితం (1950) మూవీ రివ్యూ

తారాగణం: చదలవాడ నారాయణరావు, యస్. వరలక్ష్మి, వైజయంతీమాల, టి.ఆర్. రామచంద్రన్, సి.యస్.ఆర్. ఆంజనేయులు, కంచి నరసింహారావు, మహాలింగం
మాటలు, పాటలు: తోలేటి వెంకటరెడ్డి
మ్యూజిక్: సుదర్శనం
నిర్మాత: ఎ.వి. మెయ్యప్పన్
దర్శకత్వం: ఎం.వి. రామన్
బ్యానర్: ఏవీయం ప్రొడక్షన్స్
విడుదల తేది: 14 జూలై 1950
ఏవీయం వారి తొలి తెలుగు చిత్రం ‘జీవితం’. నిర్మాతలూ, ప్రధాన పాత్రధారుల్లో ఎక్కువ మంది తమిళులైనా ఆంధ్రదేశమంతటా విజయవంతంగా ప్రదర్శితమయ్యిందంటే అందులోని రంజకత్వమే కారణం. వినోదాత్మక కథ, సన్నివేశాలు, సంభాషణలు, ఆహ్లాదకరమైన సంగీతం ఉంటే చిత్రం సులువుగా జనాన్ని అలరించి డబ్బులు వసూలు చేయడం ఖాయం అని గుణసుందరి కథ తర్వాత ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. అంతే కాకుండా, ప్రేక్షకుల్లో సినిమాల్లో ఒక విధమైన నవ్యతను ఆదరిస్తారనీ, అనుకరణ కూడా సక్రమంగా చేస్తే సత్ఫలితం వస్తుందనీ కూడా ఈ సినిమా చాటింది.
‘జీవితం’ కథాంశం చాలావరకు దీనికి దాదాపు దశాబ్దం క్రితం కిశోర్ సాహూ తీసిన హిందీ ఫిల్మ్ ‘కున్వారా బాప్’కు అనుకరణ. అయినా ఆ మూవీ కంటే ఎక్కువ డబ్బు వసూలు చేయడం విశేషం.
కథ ప్రకారం.. ఒక సంపన్నునికి అందమైన ఓ కూతురు ఉంది. అతని రెండో భార్య ఆ అమ్మాయిని తన వేలు విడిచిన తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటుంది. వాడు ఏదో పనిమీద వేరే ఊరువెళ్లి అక్కడ ఓ అమాయకురాల్ని పెళ్లాడతానని వంచించి పబ్బం గడుపుతాడు. తిరిగి వచ్చి తన అక్క కూతుర్ని పెళ్లాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈమె ఓ కథారచయితను ప్రేమిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా సంభవించే ఘటనలతో సరైనదేనని అందరూ అనుకొనే విధంగానే కథ ముగుస్తుంది.
వయ్యారిభామగా వైజయంతీమాల ప్రేక్షకుల్ని తన అందచందాలు, అభినయంతో అలరిస్తుంది. వంచకుడిగా నారాయణరావు మంచి నటనా సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. అమాయకురాలైని పల్లెటూరి యువతిని పెళ్లిచేసుకుంటానని వంచించే సందర్భంలో, తనను నమ్మి, తనదైన ఆమె తిరిగి నగరంలో తన వద్దకు వచ్చినప్పుడూ, తన గుట్టు బట్టబయలైనప్పుడూ, చివరకు మంచి మనిషిగా మారినప్పుడూ ఆయన హావభావాలు ప్రశంసనీయం.
వంచనకు గురైన అమాయకురాలిగా యస్. వరలక్ష్మి వివిధ సన్నివేశాల్లో ఉన్నత స్థాయిలో నటించి, కంటనీరు తెప్పిస్తుంది. వైజయంతీమాల తండ్రిగా సీయస్సార్ ఆంజనేయులు, ప్రియుడిగా టీఆర్ రామచంద్రన్ పాత్రోచితంగా నటించారు.
రచయిత తోలేటి వెంకటరెడ్డి రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. పాత్రల ప్రాధాన్యతను గుర్తించి, వారికి ఇవ్వాల్సిన అవకాశాన్నిచ్చి వారి నుంచి చక్కని నటనను దర్శకుడు రాబట్టుకోగా, సన్నివేశాల్లోని మూడ్‌కు తగ్గట్లు కెమెరా పనితనం కనిపించింది. ఎడిటర్ ప్రతిభనూ మెచ్చుకోవాల్సిందే. ఏ సన్నివేశాన్ని ఎంతవరకు చూపితే రక్తి కడుతుందో, అంతవరకే కత్తిరించాడు. అందుకు ఎక్కడా విసుగుపుట్టకుండా సినిమా నడుస్తుంది. సుదర్శనం సమకూర్చిన సంగీతం సినిమాకు మరో ఎస్సెట్.