సమాధి (హిందీ – 1950) మూవీ రివ్యూ

రమేశ్ సైగల్ డైరెక్ట్ చేయగా ఫిల్మిస్తాన్ లిమిటెడ్ నిర్మించిన ‘సమాధి’ (Samadhi) చిత్రంలో అశోక్ కుమార్ (Ashok Kumar), నళినీ జయ్వంత్ (Nalini Jaywant), శ్యామ్, కుల్దీప్ కౌర్, ముబారక్, శశి కపూర్ (Sashi Kapoor) ప్రధాన పాత్రధారులు. సి. రామచంద్ర సంగీతం సమకూర్చగా, రాజేంద్ర కిషన్ పాటలు, ఖమర్ జలాలబాదీ సంభాషణలు రాశారు.
సుభాష్ చంద్రబోస్ సింగపూర్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేయడం, ఆయన ప్రబోధంతో దేశభక్తుడై అందులో చేరిన ఓ యువకుడు బ్రిటిష్ సైన్యంలోని తన అన్నకే ప్రత్యర్ధి కావడం, బ్రిటిష్ వాళ్ల గూఢచారిణులుగా ఉన్న ఇద్దరు అక్కచెల్లెళ్లలో ఒకరిని ఫలానా అని తెలీకుండానే ప్రేమించడం, ఆ గూఢచారిణులు ఆజాద్ హింద్ ఫౌజ్ దళానికి పట్టుబడి, బోస్ ప్రబోధంతో ఫౌజ్ తరపున బ్రిటిష్ సైన్యం దగ్గరే గూఢచారిణులుగా ఉండి, తమ ప్రియులతో సహా మాతృదేశం కోసం ప్రాణాలు త్యాగం చెయ్యడం ఈ చిత్రం ఇతివృత్తం.
దేశభక్తి ప్రబోధం, సుభాష్ చంద్రబోస్ సంకీర్తనం సమధికంగా ఉన్న ఈ మూవీలో కథను పకడ్బందీగా నడిపించగల సన్నివేశాల కూర్పు లేకపోయినా, విదేశాలలో యుద్ధప్రధాన ఇతివృత్తంతో తయారైన సినిమాలలోని పోరాట ఘట్టాలు తదితర సన్నివేశాలు చాలావరకూ చక్కగా చేర్చబడ్డాయి.
బోస్ పాత్రను ఆయన పోలికలు అధికంగా ఉన్న నటుడికి ఇచ్చి, ఇందులో చూపినట్లు కాళ్లు, చేతులు, నడుము, మూపు కాకుండా వీలున్నప్పుడల్లా ముఖం చూపించి, మాటలు వినిపించినట్లయితే సినిమా ఆకర్షకంగా ఉండేది. ఆ పాత్రకు ముబారక్ సరిగ్గా అతకలేదు. బ్రిటిష్ సైన్యం కెప్టెన్‌గా శ్యామ్ చక్కని నటన కనపర్చారు. ఆజాద్ హింద్ ఫౌజ్ కెప్టెన్ శేఖర్‌గా అశోక్ కుమార్ సమర్థవంతంగా నటించారు. అయితే ఆయన ముఖంలో ప్రేమభావాలు వ్యక్తమైన స్థాయిలో దేశభక్తి భావాలు వ్యక్తం కాలేదనేది నిజం. గూఢచారిణులలో చిన్నదైన లిల్లీ డిసౌజాగా నళినీ జయవంత్ ఆకట్టుకున్నారు.
